(శ్రవణ్ బాబు*)
గూగుల్ సైంటిస్ట్ మల్లిక్ పరుచూరిని హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. థర్డ్ వేవ్ లో ఇంటికో శవం లేస్తుందనే వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారనే అభియోగంపై ఆయనను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు మద్దతుగా వీరమాచనేని రామకృష్ణ, మరికొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడంటే సెకండ్ వేవ్ ఉపశమించటంతో కాస్త తగ్గిందిగానీ, ఆమధ్య, ఒక నెలరోజుల క్రితం ఈ మల్లిక్ పరుచూరి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ జరిగింది. ఇతనికి మద్దతుగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో, బయట తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదోపవాదాలు చేసుకున్నారు.
విశాఖపట్నానికి చెందిన కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పరుచూరి తనను తాను ఒక లూయీస్ పాశ్చర్(వైద్యరంగంలో అపూర్వమైన ఆవిష్కరణలు చేసి మానవాళికి మహోపకారం చేసిన ఒక జీనియస్ సైంటిస్ట్) లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి తనదైన శైలిలో మందులు ప్రిస్క్రైబ్ చేసి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే. అలా మందులు సూచించటమేకాకుండా, సాంప్రదాయక(conventional) వైద్య విధానంలో కోవిడ్ చికిత్సకు అనుసరిస్తున్న ప్రతి పద్ధతినీ మల్లిక్ ఎద్దేవా చేస్తూ అల్లోపతి వైద్యులపై దుమ్మెత్తిపోశారు. అంతవరకు అయితే ఫర్వాలేదు, కానీ ఆయన ఈక్రమంలో, శిక్షార్హమైన కొన్ని తప్పిదాలు చేశారు.
రాంగోపాల్ వర్మ ఆ మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మల్లిక్ పరుచూరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ సివిల్ ఇంజనీర్‌కు, ఈ కెమికల్ ఇంజనీర్‌కు మధ్య జరిగిన ఆ భేటీలో వర్మ ఒక మాట అన్నారు. ఈ సబ్జెక్ట్‌పై తనకు అవగాహన లేనందున, మల్లిక్ చెప్పే వెర్షన్ లో అతనికి ఎంత conviction(బలంగా, నమ్మకంగా చెప్పటం) ఉందని మాత్రమే తాను చూస్తున్నాని చెప్పారు. అయితే గమనించాల్సింది ఏమిటంటే – ఒక విషయాన్ని బలంగా, నమ్మకంగా చెప్పినంతమాత్రాన అది నిజం అయిపోదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ విధ్వంసాలకు, ఆత్మాహుతిదాడులకు పాల్పడే టెర్రరిస్ట్‌లు అందరూ – తమ పనుల ద్వారా, త్యాగాలద్వారా తమ వర్గానికో, మతానికో మేలుచేసి స్వర్గానికి చేరుకుంటామని బలంగా, నమ్మకంగా చెబుతారు. కోవిడ్ వ్యాధి విషయంలో మల్లిక్ బలంగా బల్లగుద్ది చెబుతున్నాడుకాబట్టి అతని పాయింట్ కరెక్ట్ అనుకోవటం అనే తప్పును రాంగోపాల్ వర్మే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలోని న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కూడా చేస్తున్నాయి. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవలసిందేమిటంటే, మల్లిక్ అనే వ్యక్తి ఒక కెమికల్ ఇంజనీర్, పైగా ఫార్మా రంగంలోనే ఉన్నాడు. మందుల తయారీలో వాడే ముడిపదార్థాల గురించి, అవి ఎలా పనిచేస్తాయనేదాని గురించి అతనికి అవగాహన ఉంది, లోతైన పరిజ్ఞానమే ఉంది. దానికితోడు వర్మ ఇంటర్వ్యూలో తనే చెప్పినట్లు – లాక్ డౌన్ కావటంతో ఖాళీగా ఉండలేక ఈ సబ్జెక్టుపై వివిధ మ్యాగజైన్లలో వస్తున్న వ్యాసాలు చదివి నాలెడ్జ్ పెంచుకున్నాడు. కొత్తగా వచ్చి చేరిన ఈ నాలెడ్జ్‌తో మల్లిక్ తనను తాను – మానవాళికి తన పరిశోధనలద్వారా మహోపకారం చేసిన లూయిస్ పాశ్చర్ లాంటి సైంటిస్ట్లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి మందులను సూచించేస్తున్నాడు. కరోనాకు మందు రాలేదుకాబట్టి దానిని వాడితే తప్పేంటి అని కొందరు అనుకోవచ్చు. ఇంకా అతను చేసిన కొన్ని తప్పులు ఇక్కడ చూడండి.
1. కోవిడ్‌కు వ్యాక్సిన్లు పనికిరావని చెప్పాడు. వ్యాక్సిన్లపై ప్రభుత్వం పెట్టిన వేలకోట్లు వృథా అని చెబుతున్నాడు.
2. కరోనా చికిత్సకు కొన్ని వస్తువులు వాడమని చెప్పటానికి మీకేం అర్హత ఉందని టీవీ డిబేట్లలో డాక్టర్లు అడిగితే మిమ్ముల్ను నేను వాడమన్నానా అని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.
3. మ్యుటేషన్లు అయ్యేకొద్దీ వైరస్ బలం పెరుగుతుందని చెబుతున్నాడు. కానీ, అది పూర్తిగా తప్పని, మ్యుటేషన్లు అయ్యేకొద్దీ వైరస్ బలం తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.
4. ఇంటికో శవం లేస్తుందని అనటం – అసలే భయకంపితులై ఉన్న జనాన్ని మరింత భయాందోళనలకు గురిచేయటమే! భయానికి, ఇమ్యూనిటీకి ఉన్న విలోమ సంబంధం అందరికీ తెలిసిందే. భయం పెరిగితే ఇమ్యూనిటీ దారుణంగా పడిపోతుంది. మరి ఈయన జనంలో ఇలా భయాన్ని పెంచటంద్వారా ఏమి చేయాలనుకుంటున్నాడో తెలియటంలేదు.
5. కరోనాకు సంజీవని అన్నట్లుగా, బ్రోమెక్సిన్ అనే మందును ఇతను సూచిస్తున్నాడు. అయితే బ్రోమెక్సిన్ వలన వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లుకూడా వార్తలు వచ్చాయి. పైగా ఏ జాతీయ, అంతర్జాతీయ వైద్య సంస్థకూడా దీనిని సిఫార్స్ చేయలేదు. ఎక్కడో కొద్దిమందిపైనో మల్లిక్ వంటివారు ఇలా ఈ మందును ప్రయోగించి సత్ఫలితాలు వచ్చినంత మాత్రాన, దానిని జనం అందరికీ పని చేస్తుందని జనరలైజ్ చేయటం తప్పు.
6. కరోనాకు ‘యాంటీబాడీలు భ్రమ‘, ‘వ్యాక్సిన్ మిథ్య‘, ‘హెర్డ్ ఇమ్యూనిటీ కల‘ అని తాను ఫేస్ బుక్‌లో పోస్ట్ ఎప్పుడో పెట్టానని చెప్పాడు.
ఇతని పద్ధతి ఏమిటంటే, వైద్యులు ఈ చికిత్సలో అనుసరిస్తున్న ప్రతి విధానాన్నీ అవహేళన చేసి తేలిగ్గా కొట్టిపారేయటం. కరోనా చికిత్స విషయంలో గత ఒకటిన్నర సంవత్సరంగా వైద్యులు వివిధ సమయాలలో వివిధ మందులను వాడుతున్నారు. ఒకసారి వాడిన మందు కంటే మెరుగైన మందు మరొకటి వస్తోంది కాబట్టి. దానిని ఇతను తేలిగ్గా కొట్టిపారేస్తూ తనదే అత్యుత్తమ మార్గమని చెబుతున్నాడు.
ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసింది ఏమిటంటే – కోవిడ్ అనేది ఒక కొత్త జబ్బు. అల్లోపతి వైద్య విధానంలో ఒక కొత్త జబ్బుకు మందు(ఔషధం) మార్కెట్లోకి రావాలంటే దానివెనక ఎంతోమంది కృషి, ఎంతో కసరత్తు ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో ప్రయోగాలు జరుగుతాయి. ఎలుకల వంటి జంతువులపైన, మనుషులపైన అనేక దశలలో ప్రయోగాలు చేసి, ఆడవారు, మగవారు, పిల్లలు, వృద్ధులు… ఇలా వివిధ రకాల రోగులపై, ఆ మందు ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించి, వాటన్నింటి సారాంశాన్ని క్రోడీకరించి ఒక మందు తయారుచేసి దానిని మార్కెట్లోకి విడుదల చేస్తారు. అందుకే అల్లోపతి వైద్యాన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. ఫార్మా రంగంలో పనిచేస్తూకూడా ఇంత చిన్న విషయం మర్చిపోయి, తాను ఒక్కడే పుస్తకాలు చదివి కనిపెట్టిన(అదికూడా ఈయన రీసెర్చ్ చేసిందికాదు) చికిత్సా విధానాన్ని అనుసరించాలని చెప్పటం మల్లిక్ పరుచూరి మూర్ఖత్వానికి మొదటి నిదర్శనం.
మీడియాలో, ముఖ్యంగా న్యూస్ ఛానల్స్‌లో లైవ్ డిస్కషన్స్‌లో కనిపించటాన్ని ఆయన ఎంజాయ్ చేయటం ఆయన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది. ఇంత సీరియస్ విషయంపై చర్చ జరుగుతుంటే, అదేదో మామూలు డిబేట్ లాగా ఆయన నవ్వులు చిందిస్తూ మాట్లాడటం విచిత్రంగా ఉంది.
2021 మార్చి చివరినుంచి పరిస్థితి విషమించుతూ సెకండ్ వేవ్ మొదలయిందని, ఆ టైమ్ లో మీరు ఏమైనా హెచ్చరికలు చేశారా అని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్జీవీ అడిగితే, మల్లిక్ చిరునవ్వులు చిందిస్తూ నేరుగా సమాధానం ఇవ్వకుండా ఏదేదో చెప్పొకొచ్చాడు.
వైద్యులు సరైన మందులు ఇవ్వటంలేదంటున్నారుకదా, ఇలా ఎందుకు చేస్తుండొచ్చని మీరు అనుకుంటున్నారు అని వర్మ అడిగితే, డబ్బుకోసమే ఇలా చేస్తున్నారని, మిగిలిన చికిత్సలలో లభించేదాని కంటే ఎన్నోరెట్లు ఈ కోవిడ్ చికిత్స ద్వారా వస్తుందనే ఇలా చేస్తున్నారని మల్లిక్ ఆరోపణ.
ఈ అంశాలు చాలు మల్లిక్ ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడో తెలుసుకోవటానికి. అసలే మనదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ. కరోనా తీవ్రత ఏమిటనేది సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మాత్రమే మనదేశంలో అందరికీ అర్థమయింది. మొన్న సెకండ్ వేవ్ వచ్చేదాకా కూడా, మనదేశంలో చాలామంది మూర్ఖులు కరోనా అనేది అసలు రోగమేకాదని, ఇది మందుల(ఫార్మా) కంపెనీలు సృష్టించిన మాయరోగమని, ఇది తమనేమీ చేయలేదని చెప్పుకుంటూ వచ్చిన సంఘటనలు మనకందరికీ తెలుసు. ఇలాంటి సమయాల్లో మల్లిక్ వంటివారు బాధ్యతారహితంగా చేసే ఇలాంటి పనులవలన పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతోంది.
ప్రభుత్వ వైఫల్యం
మల్లిక్ లాంటి గూగుల్ సైంటిస్టులు ఇలా రెచ్చిపోవటానికి, దేశవ్యాప్తంగా ఇంత ప్రాణనష్టం జరగటానికి కేంద్రప్రభుత్వం కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. మొదటినుంచీ ప్రభుత్వం కరోనా విషయంలో సరైన రీతిలో వ్యవహరించలేదు. గత ఏడాది మార్చి 21న, తగినంత వ్యవధి లేకుండానే (పెద్ద నోట్ల రద్దు విషయంలో వ్యవహరించినట్లుగానే) ఉన్నట్లుండి లాక్ డౌన్ ప్రకటించటంతో లక్షలమంది ప్రజలు డబ్బు, నిత్యావసర వస్తువులు నిల్వచేసుకోలేకపోయారు, ఇబ్బందుల పాలయ్యారు. వేలమంది వలస కార్మికులు రోడ్డుబాట పడితే, కేంద్రంలోని పాలకులు చాలాకాలం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయి ఆలస్యంగా మేలుకున్నారు. అప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక కరోనాపై అవగాహన కల్పించటంలో కూడా ప్రభుత్వం విఫలమయింది. ప్రభుత్వం కనక దీనిపై అవగాహన కల్పించటానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసిఉంటే ప్రజలలో అవగాహన పెరిగిఉండేది… ముఖ్యంగా మాస్కులు ధరించటంలో. నిరక్షరాస్యత బాగా ఉన్న మనదేశంలో అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా మెసేజ్ చేరాలంటే సినీనటులు/క్రికెటర్లు తప్ప మార్గం లేదు. కానీ, ప్రభుత్వం ఈ ప్రచారాన్ని సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ గా తప్పిస్తే వేరే ప్రయత్నమేమీ చేయలేదు. తీరా సమస్య చాపకింద నీరులా పాకి అందరికీ అర్థమయ్యేనాటికి – జనం ఎలా ఉన్నారంటే – కరోనాను తగ్గించే బ్రహ్మాండమైన మందు వచ్చిందంటూ ఎవరు బలంగా చెప్పినా – ముందూ వెనక ఆలోచించకుండా మూకుమ్ముడిగా వెళ్ళి తీసుకునేటంతగా! వస్తువులను తాకటం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువే అని లాన్సెట్ లో ప్రచురితమయింది, అమెరికన్ ప్రభుత్వ సంస్థ CDC చెప్పినాకూడా దానిగురించి బలంగా ప్రచారం జరగలేదు.
వ్యాక్సిన్ల విషయంలోకూడా కేంద్ర ప్రభుత్వం అత్యంత భారీ తప్పిదం చేసింది. సెకండ్ వేవ్ వస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నా, ముందు జాగ్రత్తతో వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాల్సిందిపోయి, సమస్య తీవ్రమయ్యేదాకా చూస్తుండిపోయింది. పర్యవసానం – సెకండ్ వేవ్‌లో 50 ఏళ్ళలోపు ఉన్న ఇంటి సంపాదనపరులు(bread winners) ఎక్కువగా చనిపోవటం. ఉత్తరాఖండ్‌లో కుంభమేళాను ఆపకపోవటంకూడా కేంద్రప్రభుత్వం చేసిన మరో అతి పెద్ద తప్పిదం. దానిద్వారాకూడా వేలమందికి కరోనా సోకింది. పాలకులకు సైంటిఫిక్ టెంపర్ లేకపోవటం వలన జరుగుతున్న అనర్థం ఇది. జర్మనీలో, మనదేశంలోని కేరళలో కీలకస్థానాలలో ఉన్న విద్యావంతులైన స్త్రీలు కరోనాను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారో అందరమూ చూశాము.కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో ఇలా పూర్తిగా విఫలమవటానికి కారణం, ఈ అంశంపై సూచనలు ఇచ్చే సలహాదారులు మంచివాళ్ళు కాకపోవటంవలన కూడా అనే వాదన ప్రచారంలో ఉంది.
ఇక చైనా కుట్ర అనే విషయానికొస్తే, ప్రతిదానిలోనూ కుట్రకోణాన్ని(conspiracy theory) చూడటానికి ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. చైనా ఈ వైరస్ ను సృష్టించిందనే వాదన ప్రచారంలో ఉంది. అయితే వైరస్ మ్యుటేషన్లు కృత్రిమంగా ల్యాబ్‌లో సృష్టించినవి కాదని శాస్త్రజ్ఞులు నిర్ధారించినట్లు, పరిశోధనలకు కావలసిన వైరస్ జెనోమ్ కోడ్‌ను చైనా అందరికీ షేర్ చేయటం ఆహ్వానించదగిన పరిణామమని అన్నిదేశాలవారూ అభినందించటం గురించికూడా మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు చైనాలోకూడా ప్రాణనష్టం జరిగింది… ఆ సంఖ్య బయటకు రాకపోవచ్చుగానీ. కాబట్టి చైనాపై విపరీతమైన కోపం పెంచుకుని, పళ్ళు నూరుకుంటూ ఉండటంవలన దెబ్బతినేది మన ఆరోగ్యాలే కాబట్టి ఆ విషయాన్ని వదిలేస్తే మంచిది.
(*Sravana Babu, Freelance Journalist, Mobile: 99482 93346,Email: sravone.babu@gmail.com)