(వడ్డేపల్లి మల్లేశము)
రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా పటిష్టంగా ఉండాలంటే ఆ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వారిలో చొరవ, సమయస్ఫూర్తి ,సమర్థత, సమన్వయము, నాయకత్వ పటిమ, సమకాలీన సమస్యలపై అవగాహన, ప్రశ్నించే ధోరణి, ఆత్మస్థైర్యం, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి
తెగువ ప్రధానంగా ప్రజలు చూస్తారు.
అంతేకాకుండా కార్యవర్గము సూచనల మేరకు కార్యవర్గాన్ని సమన్వయపరుస్తూ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని, పార్టీలోని సీనియర్ జూనియర్ కార్యకర్తల మనోగతాన్ని గెలుచుకోవలసి ఉంటుంది.
రాజకీయ పార్టీలు అధ్యక్ష బాధ్యతలు:
దేశవ్యాప్తంగా ను తెలంగాణ రాష్ట్రంలోనూ దాదాపుగా మెజారిటీ రాజకీయ పార్టీల నాయకత్వం ఉన్నత, అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి పార్టీ కార్యకర్తలుగా పని చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీలు నాయకత్వానికి ఎందుకు పనికి రారు? ఒకసారి నాయకత్వం లో ఉన్నవారు, జెండాలు మోసే కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అంటే పార్టీ నాయకత్వం గానీ, చట్ట సభల్లో సభ్యత్వం గానీ అన్ని సామాజిక వర్గాలకు దక్కవలసిన అవసరం ఉందనేది దీని అర్థం. ఈ అంశం కూడా రాజకీయ పార్టీలు బలహీనపడడానికి కారణం. కనుక పార్టీ అధినేతలు ఈ విషయాన్ని గమనించాలి.
ఇక ప్రధానమైన ప్రశ్న ఏ రాజకీయ పార్టీ కూడా అధ్యక్షుడిగా ఉన్న వారు అధికార పదవులలో ఉండకూడదు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీనివల్ల ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వరాల జల్లు కురిపించి అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉన్నది ఈ విషయాన్ని కూడా రాజకీయ పార్టీలు గమనించాలి.ఇటీవలప్రధాని ప.బెంగాల్ ఎన్నికల్లో అలాంటి వాగ్ధానాలుచేయడాన్ని చూచాము.కనుక
ముఖ్యమంత్రి,మంత్రులు, ప్రధానికూడా
ప్రచారాలు చేయకుంటే మంచిది.
రెడ్డి ముందున్న పార్టీ నిర్మాణాత్మక సమస్యలు:
పార్టీలో జూనియర్ కు పిసిసి ఇవ్వడాన్ని అనేకమంది విమర్శిస్తున్న తరుణంలో ఆ విమర్శను తిప్పి కొట్టే విధంగా నాయకత్వ పటిమను ప్రదర్శించి పార్టీని బలోపేతం చేయాల్సిన గురుతర బాధ్యత కీలకమైన టువంటి అంశం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది.
గత నాయకత్వం తప్పిదాలు:
కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన టువంటి వారు టిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మందలించకపోవడం, ప్రజల ముందు ఉంచకపోవడం పెద్ద దోషమే. తరచుగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, బలంగా పాలనలోని లొసుగులను ,అవగాహనతో ఉమ్మడి కార్యాచరణ లేకపోవడం కూడా ప్రధానమైన లోపం తద్వారా అనేక మంది పార్టీని విడిచి వెళ్లారు.
పార్టీని రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నిర్మాణాత్మకంగా బలోపేతం చేయక కేవలం నామమాత్రంగానే ఉండిపోవడం, ఎన్నికల సమయం లోపల అభ్యర్థులను తొందరగా ప్రకటించకపోవడం, ఉమ్మడి కార్యాచరణ లోపల కూడా ఇతర పార్టీలతో నిర్ణయాలు తొందరగా తీసుకోకపోవడం వలన గత ఎన్నికల్లో ప్రధానంగా ఓటమికి కాంగ్రెస్ పార్టీ బాధ్యురాలు అయింది.
రైతుబంధు లోపభూయిష్టంగా ఉన్న ప్రకృతి విధ్వంసం గుట్టల విధ్వంసం కొనసాగిన, భూ దందాలు భూ అక్రమార్జన పేరుతో అనేక మంది శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా అనేక ఆరోపణలు వచ్చినా వాటిమీద పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు ఉమ్మడిగా ఇతర పార్టీలతో కలిసి కార్యాచరణ చేయకపోవడం కూడా ప్రజలకు విశ్వాసాన్ని ఇవ్వలేకపోయింది.
మౌలికమైన అంశాలు :అఖిల పక్షాలతో సమావేశాలు లేకపోవడం, విద్యా వైద్య రంగాల నిర్వీర్యం చేయడం, కరోనా వంటి జటిలమైన సమస్యలను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంపై ఒత్తిడి లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ గత లోపాలుగా భావించవచ్చు.
ప్రధాన హామీ అయినటువంటి దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోవడం, దళితులకు 3 ఎకరాల భూమి అమలు చేయకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం గాని, ప్రాజెక్టులు ,కాలువలు నిర్మాణంలో నాణ్యత లోపించి కూలిపోవడం, మిషన్ భగీరత వంటి పనులలో భాగంగా రోడ్లు విధ్వంసానికి గురికావడం,తిరిగి నిర్మాణం చేయకపోవడం ప్రభుత్వం యధేచ్చగా ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్న కూడా ప్రతిఘటించకపోవడం పార్టీ లోపంగా భావించవచ్చు.
ప్రధానంగా గత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక లక్షా 91 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని ఒత్తిడి చేసినప్పటికీ కూడా భర్తీ చేయకపోవడం కూడా బాధాకరమే. నిర్మాణపరంగా బలం గా ఉన్నటువంటి సచివాలయాన్ని కూలగొట్టి తిరిగి ఆరు వందల కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టడం, ప్రజల ఆస్తులను ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి అప్పును దాదాపుగా నాలుగు లక్షల కోట్లకు చేర్చడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా?
జాతీయస్థాయిలో ఈ దేశాన్ని ఆరు దశాబ్దాలకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో లౌకిక, సామ్యవాద విలువల ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మౌలికంగా ప్రధాన జాతీయ ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి అవసరమైతే మిగతా రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది.
రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు
ఇంతవరకు దాకా చెప్పుకున్నట్టుగా పార్టీ నిర్మాణ పరంగా గానీ ప్రభుత్వం యొక్క లోపాలు కానీ గత కార్యవర్గం కొంత నిర్లక్ష్యానికి గురి చేసిన మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని ముందుగా రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. గమనించాలి. నాయకత్వంతో సమన్వయ పరచుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
* నిర్బంధము అణచివేత:-
ముఖ్యంగా కవులు, కళాకారులు, మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టుల పైన అణచివేత ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ప్రభుత్వ వైఫల్యాలు భూదందాల పైన విచారణ చేసినటువంటి వారిని ఎవరినైనా ప్రశ్నిస్తే జైలుకు పంపడం ఇటీవల జర్నలిస్టు రఘు పైన చేసినటువంటి ఆ కృత్యాన్ని మనం ప్రత్యక్షంగా చూసినాము. అలాంటి నిర్బంధం జరగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. పత్రికా స్వేచ్ఛ ,స్వాతంత్య్రాల ను ప్రభుత్వం గౌరవించే విధంగా ప్రజల విభిన్న రంగాలవారికి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తెలంగాణ ఆకాంక్ష లో నాల్గవది ఆత్మగౌరవమే కదా!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిరసనలకు ప్రధాన క్షేత్రం గా ఉన్న ఇందిరా చౌకను మూసివేయడం దానికోసానికి పోరాటంచేయవలసి రావడం దేనికి సంకేతం?
*పోలీసులు కలెక్టర్లు- ప్రభుత్వం ఒత్తిడి
పోలీసు వ్యవస్థను ప్రజల కోసం వినియోగించ వలసిందిపోయి కేవలం ప్రభుత్వ పెద్దల కోసం, శాసన సభ్యులు, మంత్రులు, రాజకీయ పార్టీల కార్యకర్తల కోసమే అతిగా వాడడం నిర్మూలించాలి. మంత్రులు ముఖ్యమంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు ఎస్పీలు, కలెక్టర్లు కార్ల వెంట పరుగెత్తడం బానిసత్వానికి సంకేతం కదా! ఇటీవల కామారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేయడం కూడా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అవుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. అధికారులు పోలీసుల పైన పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న కారణంగా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కావున అధికారులు స్వేచ్ఛగా తమ విధి నిర్వహణ చేసేవిధంగా విధానాన్ని రూపొందించాలి.
*వ్యవసాయము రైతుబంధు లోపాలు సవరణ:
వ్యవసాయం చేసే వారికి సాయం కోసం ఉద్దేశించిన టువంటి రైతుబంధు ఇవాళ పూర్తిగా నిర్వీర్యమైఉన్నత వర్గాల జేబులు నింపుతుంది. ఏటా 14 వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తూ లేకుంటే రిజర్వ్ బ్యాంకు నుండి అప్పు చేస్తూ పంపిణీ చేస్తుంటే నిజమైన టువంటి రైతులకు చేరేది కేవలం నామమాత్రమే అని చెప్పవచ్చు. ఐదు ఎకరాల లోపు వరకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేసి మిగతా వారికి ఆర్థికంగా అవకాశం లేకుండా చేయాలి .అది కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ చేస్తున్నారో వారికి మాత్రమే నగదు రూపంలో కాకుండా విత్తనాలు, పురుగుమందులు ,ఎరువుల రూపంలో సహాయం చేసి సకాలంలో వారిని ఆదుకోవాలి .అప్పుడు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనం చేకూరుతుంది. ఉన్నత వర్గాలకు చెందిన రాళ్లకు, బోళ్లు, గుట్టలకు, ఖాళీ ప్లాట్లకు, చెరువులకు కూడా రైతుబంధు ఇవ్వడం దేనికి సంకేతం?
ఖమ్మంలో రైతు చేతులకు బేడీలు వేసిన సంఘటన, సిరిసిల్లలో ప్రశ్నించినందుకు అరెస్ట్ చేసిన సందర్భం రైతు లోకాన్ని తీవ్ర అవమానానికి గురి చేసింది తెలంగాణ రాష్ట్రంలోనే కదా!
* నాయకత్వాన్ని సామాజిక వర్గాల వారీగా కేటాయించాలి.
52 శాతం గా ఉన్నటువంటి బీసీలకు అరడజను శాసనసభ్యులు లేరు. అనేక కులాలకు సామాజిక వర్గాలకు చట్టసభల్లో స్థానమే లేదు. కానీ అతితక్కువ జనాభా ఉన్నటువంటి రెడ్డి ,వెలమ కులస్తులకు చట్టసభల్లో సగానికి పైగా ఉండటం ఇది ఆందోళన కలిగించే విషయం కాదా ఆలోచించాలి. ఇలాగే కొనసాగితే ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ లు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయి సుమ!
*ఇంకా కొన్ని ప్రధాన సమస్యలు:
నిత్యావసర మిగతా వస్తువుల ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నవి. అలాగే పెట్రోల్ డీజిల్ పైన సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తున్నది.
గుట్టల విధ్వంసాన్ని ప్రకృతి విధ్వంసాన్ని అధికారానికి రాకముందు ప్రశ్నించినా ప్రభుత్వ పెద్దలే ఇవాళ దానిలో భాగస్వాములు కావడం చాలా విడ్డూరం .వెంటనే దానిని ఆపివేయాలి.
– ప్రభుత్వ భూములను కారుచౌకగా తన వర్గీయులకు ఇవ్వడం, అమ్మడం బాబాలు స్వామి లకు నామమాత్రపు ఒక రూపాయికి ఎకరాల చొప్పున ఇవ్వడం చాలా విడ్డూరం.
– ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన భూముల అమ్మకాన్ని వెంటనే నిలువరించాలి. ప్రభుత్వ ఆదాయాల కు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికే లా సూచించాలి.
అక్రమంగా, చౌకగా అమ్మినభూములనుతిరిగి స్వాధీనం చేసుకోవాలి.రైతుబంధులో అక్రమంగా లక్షలాది రూపాయలు పొందిన మంత్రులు,mla లు,కలెక్టర్ల నుండి ఆసొమ్ము నిర్బంధంగా వసూలుచేసి ప్రభుత్వ ఖాతాకు
జమచేయాలి.
*విద్యా వైద్య రంగాల బలోపేతం:-
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్య రంగాల పైన నాడు-నేడు అనే పథకం ద్వారా విస్తృతంగా నిధులను కేటాయించి నిరంతరము సమీక్షిస్తూ అభివృద్ధివైపు అక్కడ కొనసాగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏనాడూ కూడా సమీక్షించిన దాఖలాలు లేవు .పైగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పాఠశాలలను ప్రోత్సహిస్తూ ప్రైవేటు రంగం పై వేసిన టువంటి కమిషన్ సిఫారసులను యథాతథంగా ఆమోదించడం వల్ల ప్రైవేటు విద్య పై ఆధారపడిన పేద మధ్య తరగతి వర్గాల వారు తమ కుటుంబ ఆదాయంలో 70 శాతాన్ని కోల్పోయిమరీ పేదలుగా మారిపోతున్నారు.
వైద్య రంగం మొత్తము కూడా ప్రైవేటు రంగం లోనే కొనసాగుతూ ఉంటే ప్రభుత్వ వైద్యశాలలు నామమాత్రంగా మిగిలిపోవడం తో ప్రైవేటు వైద్యశాలల్లో సామాన్య ప్రజానీకం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ మరీ పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు.
తక్షణమే విద్యా, వైద్య రంగాల ను పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ప్రైవేటు సంస్థలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ వైపుగా ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పైన చేయాలి.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రారంభించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులను కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్న దుర్మార్గపు అవినీతిని కొనసాగనివ్వకుండా వెంటనే ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రద్దు చేయాలి.
* పార్టీ ఫిరాయింపులు- స్థిరత్వం
పార్టీ ఫిరాయింపుల వలన ఎన్నుకోబడిన శాసనసభ్యులు భవిష్యత్తు పైన ఆశ పైన ఎన్నుకొన్న ప్రజలను వమ్ముచేస్తూ అధికార పార్టీలో చేరడాన్ని నిలువరించే విధంగా చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఎవరైనా పార్టీ మారిన చో తన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే ఇతర పార్టీలోకి వెళ్లాలి. అయినప్పటికీ ఇతర పార్టీలు కూడా ఇలాంటి వారికినామినేటెడ్ పదవిని కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు ఖాళీగానే ఉంచితే తప్పకుండా మార్పు వస్తుంది
మరి కొన్ని సమస్యలు:
– ఆహార, వినియోగించే వస్తువులలో పదార్థాలలో కల్తి విచ్చలవిడిగా కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిఘా పెంచి కల్తీ అరికట్టే విధంగా ఒత్తిడి తేవాలి
– ఎస్సీ, ఎస్టీ ,బీసీ సబ్ ప్లాన్ కు సంబంధించినటువంటి నిధులను కేటాయించి నప్పుడు అవి సక్రమంగా ఖర్చు చేయబడుతున్నయ లేదా శ్వేతపత్రానికి డిమాండ్ చేయాలి.
– బలహీన అట్టడుగు వర్గాలకు సంబంధించి చిరువ్యాపారులు నిరుద్యోగ యువకులు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వీలుగా ఆర్థిక సహకారాన్ని అందించాలి .అలాంటివారిని సర్వే చేసి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి.
*లంచగొండితనం- అవినీతి:
నీతికి వ్యతిరేకమైనది అవినీతి. అలాంటప్పుడు మాట తప్పిన తప్పుడు విధానాలకు పాల్పడిన విధి నిర్వహణలో నిర్లక్ష్యం, జాప్యం ,డబ్బులు అడగడం, పనులు దాటవేయడం ఇబ్బందులకు గురి చేయడం ముఖ్యంగా రైతులు సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం .ఇందులో భాగంగానే హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ అధికారి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన టువంటి విషయం మనకు తెలిసినదే .ఈరకంగా సామాన్య ప్రజానీకాన్ని విసిగించకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయించే లా నాయకత్వం అధికారుల పైన ఒత్తిడి చేసి అవినీతిని నిర్మూలించాలి.
మన రాష్ట్రంలోని ఒక ఎమ్మార్వో కార్యాలయంలో ఒక వ్యక్తి నుండి కోటి పది లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నట్టు పత్రికల్లో బాహాటంగా మనము చూసినాము.
ఇట్లా క్రమంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయ అవినీతి తోపాటు ఉద్యోగిస్వామ్యం లోపల కూడా అవినీతి గణనీయంగా పెరిగింది. రాజకీయ ఉద్యోగి వర్గంలో అవినీతిని నిర్మూలించడానికి పోరాట కార్యక్రమాలను కాంగ్రెసేతర పక్షాల పక్షాన విస్తృత పరచాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
– ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా తరచుగా అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం, దళితున్ని ముఖ్యమంత్రి చేయడం దళితులకు 3 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడంతో పాటుగా భూమి లేనటువంటి బీసీ, ఇతర వర్గాలకు కూడా భూములను ఉచితంగా పంపిణీ అవసరం ఉంది.
యువత,ప్రజానీకాన్ని నిర్వీర్యంచేస్తున్న
మద్యం,మత్తుపానీయాలు,గుట్కాలు,ధూమపానాన్ని నిషేధించి ఆధారపడినప్రజలకు
ప్రత్యామ్నాయ ఉపాధి చూపేల ఒత్తిడితేవాలి.
పేదలకు ఇంటి కోసం అరగుంట కూడా దొరకని అటువంటి స్థితిలో వేల ఎకరాలను ధారాదత్తం చేయడం మరొకవైపు ఆక్రమించుకోవడం తెలంగాణ కీర్తిని అపఖ్యాతి పాలు చేయడం అవుతుంది.
ఈ రకంగా పీసీసీ చీప్ గా నియామకమైన రేవంత్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ ఈ రాష్ట్రంలో నూతన ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకురావడానికి కృషి చేయవలసిందిగా ప్రజలు మెచ్చిన పరిపాలన దిశగా మార్పు కోసం పోరాడవలసిo దిగా ప్రజలు ,ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, నియంతృత్వాన్ని విమర్శించే వాళ్ళు కోరుతున్నారు. వీరి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా తమ కార్యాచరణను రూపకల్పన చేసుకోవలసిందిగా విజ్ఞప్తి .
( ఈ వ్యాసకర్త కవి, రచయిత, సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, హుస్నాబాద్. జిల్లా సిద్దిపేట. తెలంగాణ)