(టి.లక్ష్మీనారాయణ)
ఉత్తర తెలంగాణ కోసం, దక్షిణ తెలంగాణ ప్రజల మనోభావాలను కేసీఆర్ వాడుకుంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు విద్యుత్తు కావాలి. దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్లలోని నీటిని జల విద్యుదుత్ఫాదనకు తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా వాడేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కాలంలోనే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్.ఎల్.బి.సి.) నిర్మాణం చేపట్టబడింది. కానీ, రాష్ట్ర విభజన చట్టంలో దాని ప్రస్తావన లేదు. చట్టానికి సవరణ చేసి, ఎస్.ఎల్.బి.సి.ని పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో చేర్చమని ఏనాడు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. అంటే, దానిపై ఆయనకు ద్యాసే లేదు.
“బేసిన్లు లేవు – భేషజాలు లేవు” అన్న పెద్దమనిషి , నేడు “ట్రిబ్యునల్ తీర్పుల్లేవు -చట్టాల్లేవు” అంటూన్నారు. రాజ్యాంగంపైన ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారో చూడండి. కుటిల రాజకీయాలతో రెండు రాష్ట్రాల మధ్య జల రగడ రాజేసి, కరవు పీడిత రాయలసీమ ప్రజల నీటి హక్కులపై కేసీఆర్ ముప్పేట దాడి చేస్తున్నారు.
(టి.లక్ష్మీనారాయణ,సమన్వయకర్త,ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)