(సలీమ్ బాషా)
దాదాపు అర్థ శతాబ్దం కింద జూలై 1న ” సాక్షి” అనే ఒక ఆఫ్-బీట్, సినిమా తో ఇద్దరు తెరంగేట్రం చేశారు. సినిమాను ఒకరు రాస్తే, మరొకరు తీశారు. రాసిన వాడు ముళ్ళపూడి వెంకటరమణ. తీసినవాడు బాపు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు రాసి తీశారు. తెలుగులో అంతకుముందు అలాంటి సినిమా రాలేదు.
అంత వరకు వచ్చిన తెలుగు సినిమాలకు భిన్నంగా వచ్చిన సినిమా ‘సాక్షి’.
1959 లో ముళ్ళపూడి వెంకటరమణ ఆంధ్రప్రభ లో తానే రాసిన చిన్న కథ సాక్షిని సినిమా కథగా మలిచాడు.
ఆ కథ కూడా 1952 లో వచ్చిన హై నూన్ (high noon) అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రాసుకున్నది. చాలా సాధారణమైన కథ. అందులో తమ మొదటి సినిమాకు ఎంచుకోవడం అన్నది ఒక సాహసోపేతమైన నిర్ణయం.
ఇది బాపు-రమణల మనస్తత్వానికి, వారి ఆలోచనా విధానానికి నిదర్శనం. బాపు అనే క్రియేటివ్ జీనియస్, ముళ్ళపూడి అనే అచ్చ తెలుగు హాస్యాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన చిలిపి రచయిత ఎలాగైనా సరే ఈ సినిమా తీయాలనుకున్నారు. చాలామంది సినిమా కథను విని ఆశ్చర్యపోయారు. చాలామంది వాళ్లను ఎద్దేవా కూడా చేశారు.
ఈ సినిమా కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ సినిమా హీరో కృష్ణ అప్పటికి పెద్ద పేరు పొందిన నటుడు కాదు. ముళ్ళపూడి రచయితగా రక్తసంబంధం, దాగుడుమూతలు, మూగ మనసులు వంటి సినిమాలకు కథ మాటలు రాసి ఉన్నాడు.
సాక్షి వాటికి భిన్నమైన కథ.నిజానికి అది క్రైమ్ తో కూడిన యాక్షన్ సినిమా. అంతవరకూ అలాంటి సినిమా ఏది కూడా తెలుగులో రాలేదు. అయినా సరే వాళ్ళిద్దరు ధైర్యం చేశారు. తీశారు. ఆ సినిమా కథ కూడా సాధారణమైనది.
ఒక క్రిమినల్ చేసిన హత్య కు ఊర్లో ఉన్న పడవ వాడు కిష్టయ్య సాక్షి. అతని సాక్ష్యంతో ఫకీర్ జైలుకెళ్లడం.. తర్వాత కిష్టయ్య ను , చంపడానికి ప్రయత్నం చేయడం, చివరికి పిరికివాడైన కిష్టయ్య ఫకీర్ ను చంపడం.
ఈ సినిమా మొత్తం రాజమండ్రి సమీపంలోని పులిదిండి అనే ఊర్లో తీశారు. కొత్త డైరెక్టర్, కొత్త యాక్టర్లు, కేవలం 19 రోజుల్లోనే తీసిన సినిమా. అప్పట్లో అదో సంచలనం.
సినిమా మొత్తం అవుట్ డోర్ లో షూట్ చేసిన మొదటి సినిమా ఇదే. చాలామంది నిర్మాత దర్శకులు సినిమా కూడా 19 రోజులు ఆడుతుంది అని ఎగతాళి చేశారు. అందులో ప్రముఖ నిర్మాత రచయిత చక్రపాణి కూడా ఉన్నాడు. అయితే చిత్రంగా ఆ సినిమా 29 రోజులు ఆడింది. తాష్కెంట్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రశంసలందుకుంది. ఆడటమే కాకుండా కొద్దో గొప్పో లాభాలు కూడా సంపాదించి పెట్టింది. అప్పట్లో రెండున్నర లక్షలు పెట్టి తీసిన సినిమా ఇది.
మొదట్లో ఈ సినిమా కోసం అక్కినేని నాగేశ్వరావు అనుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదని కొత్త నటుడు కృష్ణ ను తీసుకున్నారు.
ఈ సినిమా చూసిన తరువాత అక్కినేని నాగేశ్వరరావు” నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదు?” అని బాపు రమణ లతో చెప్పి ఓ మంచి సినిమా మిస్ అయ్యాను అని ఫీల్ అయ్యాడట. ఆ తర్వాత నాగేశ్వరరావు తో వాళ్ళిద్దరూ అందాల రాముడు, బుద్ధిమంతుడు అనే రెండు విజయవంతమైన సినిమాలు తీశారు.
ఈ సినిమాకు నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ కు ఫైనాన్సియర్స్ ముందుకురాలేదు. మొదట్లో వారు కూడా కొంత తటపటాయించారు. దానికి కారణం . బాపు సినిమా రంగానికి కొత్త , ముళ్ళపూడి వారిని కన్విన్స్ చేశాడు.
ఈ సినిమా ఆత్రేయ, కె వి మహదేవన్ కాంబినేషన్లో మ్యూజికల్ హిట్ అయింది.ఎన్నో విమర్శలు, అడ్డంకులు అవరోధాలు అధిగమించి ధైర్యంగా సినిమా తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడటం కొసమెరుపు.
(సలీమ్ బాషా,రచయిత, స్పోర్ట్స్ జర్నలిస్టు, పర్సానాలిటీ డెవెలప్ మెంట్ నిపుణుడు, కర్నూలు ఫోన్ నెంబర్ 9393737937)