(అద్దేపల్లి రామమోహన రావు)
చాలా కాలంగా మన దేశాల ప్రధాన మంత్రులూ ముఖ్యమంత్రులూ ఒక సందేశం ఇస్తూ వుంటారు. అదేమిటంటే, మన దేశంలోని వ్యవసాయం పూర్తిగా ఆధునికం కావాలని. ఇది ఎంతో ధ్వని గర్భితమైన
మాట. అంతే కాదు వారే దేశ భవిష్యత్తు ఎలా ఉండాలను కుంటున్నారో, దానికి సంబంధించిన మాట. ‘ఆధునికం’ అంటే అర్ధం ‘యాంత్రికీకరణ! వ్యవసాయ ప్రక్రియనంతా యాంత్రికం చెయ్యాలని వారి ఉద్దేశం.
దాని వలన దిగుబడి అసాధారణంగా పెరిగిపోతుందని. అమెరికా మొదలైన ‘అభివృద్ధి చెందేసిన దేశాల్లో ఒకే ఒక్క యంత్రం వ్యవసాయ సంబంధమైన అన్ని పనుల్ని చేస్తుంది. ఒక్క వ్యక్తి, అలాటి ఒక్క యంత్రంతో మరెవరి
సాయమూ లేకుండా వందలాది ఎకరాలకు సంబంధించిన అన్ని పనులూ చేసి , ఎంతో ఆర్జించగలడు. అది మన ఆదర్శం. అలాటింది యిక్కడ రావాలంటే యంత్రాలు కొనాలంటే చాలా ధనికులకు (బహుళ జాతుల్లాంటి వాళ్ళు) మాత్రమే సాధ్యం. అందువల్ల వందల ఎకరాలు
ఒక్కరి చేతుల్లోకి పోయే సదుపాయం ‘ఆధునికత ‘ కల్పిస్తుంది.
చిన్న చిన్న రైతులందరూ ఏదో ఒక ధరకి తమపొలాలు ధనికులకు అమ్మేసు కుంటే, వందలాది ఎకరాల పెట్టుబడిదార్లు పెంపొందుతారు. కూలీల బెడద పూర్తిగా తప్పుతుంది. లేదా పొలాలు అమ్ముకున్నవాళ్ళే, ఆయా
పెట్టుబడిదారుల పొలాల్లో యంత్రాలు నడిపే కూలీలు అవుతారు. ఇంక వ్యవసాయమన్నది , రైతుకి ప్రాణపదమైన, అనుబంధం కొల్పోతుంది. వ్యాపార వ్యవస్థలో ఒక భాగమౌతుంది. పెట్టుబడిదారీ యంత్రంలో
ఒక సీల ఔతుంది. ఇది ,ఈ దేశంలో అంత సులభంగా అయ్యే పని కాకపోవచ్చు కాని ఆదర్శం ఎప్పుడూ ఒక్కసారిగా పూర్తి కాదు. అందుకే అంచెలంచెలుగా, ఈ లక్ష్యం కోసం ‘సంస్కరణలు’ జరుగుతూ ఉంటై.
శ్రామిక సంఘాల పోరాటాల వల్ల సంస్కరణలు ఆలస్యమౌతూ ఉంటై. అయితే ఆదర్శం మాత్రం చెక్కు చెదరదు.!
ఇలాంటి ఆదర్శం కళ్ళ ముందుండగా , ఈ దేశంలో రైతుకి,
శ్రామికులకీ న్యాయం ఎలా జరుగుతుంది? వాళ్ళ వేలాది ఆత్మహత్యల్ని ఎలా ఆపగలుగుతుంది. తరతరాలుగా మట్టిలో మమేకమైన రైతుని ఆ మట్టినుంచి వేరు చేసే ప్రక్రియ వేగవంతంగా అమలు జరగడం, ఈ
దేశ మౌలిక సంస్కృతినే నాశనం చెయ్యడం. ఇక్కడే ‘సంస్కృతి’ ‘సంస్కరణ’ అనే పదాలు ఒకే పోలికతో ఉన్న పూర్తి వైరుధ్యం తలెత్తింది. తెలుగు కవులు కూడా ఈనాడు అన్ని మోసాల్నీ గ్రహించారు. ప్రపంచీకరణ తెస్తున్న విధ్వంసానికి కలవరం పొందుతున్నారు. చాలా కాలంగా రైతు పరిస్థితిని తమ కవితల్లో శక్తిమంతంగా రూపుగడుతున్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో రైతు గురించి వచ్చిన కవితలు అన్ని పార్శ్వాల్ని పట్టించుకుని
అక్షరీకరణ పొందుతున్నై. కొన్ని వ్యక్తీకరణల్ని ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.
రైతుకీ నేలకీ ఉన్న సంబంధం, ఈ దేశంలో సామాన్యమైంది కాదు. అది ఒక సజీవ సంబంధం. ఎట్టి పరిస్థితిల్లోనూ నేలను పోగొట్టుకోలేని ఆత్మీయ అనుబంధం. రైతు జీవితంలోని ఒక భాగం. ఈ ఉదాత్త సంబంధం గూర్చికవులు ఎంతగానో వర్ణిస్తారు. ఎమ్,ఎన్.
సూర్యనారాయణ ‘ఆకుమడి’ అనే కవితలో ఇలా అంటాడు.
ఇక్కడ ఏరువాక సాగిన రైతు కాలి కింద రేగిన
ధూళికి సైతం జీవకణాలని ముడ్చుకునే నైజం
తరం నుంచి తరానికి వ్యాపించే
పవిత్ర బీజం నుంచి బహిరంగ రహస్యమై జన్మించే తత్వం
ఆవగింజంత విత్తనం పుడమిని చీల్చుకుని
ఆకాశానికి తలెత్తే గింజతనం
‘విత్తుముందా?? చెట్టు ముందా?
అని అనంతంగా ప్రశ్నించుకునే గుణం
ఎప్పటికీ విప్పలేని చిక్కు గూడుల్లోంచి
అవిశ్రాంతంగా పయనిస్తూ జన్మాంతర జన్మల్ని అన్వేషిస్తూ
జీవరహస్యాన్ని సజీవంగా అనుసరించడం ఇక్కడి నేపధ్యం!
గింజతనం ఎలాంటిదంటే అవిశ్రాంతంగా పయనిస్తూ జన్మాంతర
జన్మల్ని అన్వేషిస్తూ జీవరహస్యాన్ని సజీవంగా అనుసరించడం. ఒక
అనుస్యూతమైన, శక్తి ప్రసారంగానే ఇక్కడ గింజ చూడబడింది. అది “
వ్యాపారం’ లో ఒక భాగంగా ఎప్పుడూ భావించలేదు. పంపిణీ
విధానంలోని వ్యాపారం వేరు, కాని ఈ కాలంలో వ్యాపారాను గుణంగా,
మట్టి మలచబడి, పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం పరుగులు తీసే తపనలో
రైతుకీ మట్టికీ గల అనుబంధం తెగిపోతోంది.
రైతు ప్రజల ప్రాణాలు కాపాడే ఆహారాన్ని ఆరుగాలమూ శ్రమపడి
పండించే నిరంతర శ్రామికుడు. ఈ శ్రామికతత్వాన్ని దేవదానంరాజు
తన ‘ముద్రబల్ల’ దీర్ఘకవితలో తెలుగునుడికారాన్ని ఉపయోగించి
చెప్తున్నాడు.
రైతంటే
నెర్రెలిడిన నేలలో ఊపిరి దాచి
మట్టి పొరల మధ్య సారాన్ని వెతికేవాడు
లోలోతుల్లోంచి గాయాల్ని తడుముకుని
నేల ఒడిలో శ్రమని భద్రపరచేవాడు
కాగే మట్టి దశల్లో బతుకు పండించుకుని
నిశ్శబ్ద ప్రవచనమై కాలం గడిపేవాడు
నిత్యం నేల అద్దంలో ముఖాన్ని చూసుకుని
ఒకానొక సామూహిక వ్యధకి ప్రతినిధి అయినవాడు
సమస్త భూవలయం కాలుష్య వేదికైనా
పసిడి రాగాన్ని ఆలపించే మట్టి పరిమళం
మట్టిలో కదలాడే మట్టి పాదమే!!
మట్టిలో కదలాడే మట్టి పాదాలు కలవాడే సామూహిక వ్యధకి
ప్రతినిధి. యంత్రాల్లో కదలాడే యంత్ర బుర్రలు కలవాడు స్వీయ వ్యధకి
మాత్రమే ప్రతినిధి. ఆ దిశలో వ్యవసాయాన్ని నడిపించాలనే పాలక
వర్గ విధానాలు శ్రామిక వ్యతిరేకమైనవే.
గాలి, నీరు, నేలా వ్యవసాయానికి అతి ముఖ్యమైన ప్రాకృతిక
సంపదలు. ఇవన్నీ వ్యాపారంలో మింగి వెయ్యబడడమే ఈనాటి రైతు
విషాదం. పెట్టుబడిదారుల దయాదాక్షిణ్యం లేని పరిశ్రమల విష ఫలితాలు
గాలిని కాలుష్య నిలయంగా చేస్తున్నై. అపార్టుమెంటులు కట్టడానికో,
రొయ్యలు పెంచడానికో, మరో అవసరానికో పొలాల్ని వ్యాపార సాధనంగా
వినియోగించడంతో నేల కుంచించుకుపోతుంది. నీళ్ళు, బహుళ జాతుల
బాటిల్ వ్యాపారాలకి ఎన్నైనా దొరుకుతైగాని, రైతుకి మాత్రం ‘జలకరువే’.
అన్నిటి కంటే వ్యాపారమే ముఖ్యమైన వ్యవస్థలో, రైతున్న స్థానం
తుడిచివెయ్యబడుతోంది.
జలకరువును గూర్చి, భయంకరమైన వేదనతో
తపించే రాయలసీమ కవులకి ఈ అంశాలన్నీ సంక్షోభం కలిగించేవే ,
“జల గండం” దీర్ఘకవితలో వై.శ్రీరాములు అంటాడు.
రాయలసీమ నోట్లో మట్టి
వానరాక కాదు నేస్తం
నీళ్ళు నీళ్ళంటూ
ఓటుకు మాత్రమే నోళ్ళు తెరిచే వాళ్ళు
నిరంతరంచేస్తున్న ద్రోహం……
రాజకీయాలన్నీ రంగురుచి వాసన ఉన్న నీళ్ళను
అందిస్తున్నాయి నీ గొంతుకు అది నీకు తెలుసా?
రంగూ, రుచి, వాసనా, లేవు నీళ్ళకు….
గమనించు! గాలి, భూమి, నీరు ఇప్పుడు
వ్యాపారానికి ప్రధాన కేంద్ర బిందువులు….
దారైనా ఎడారైనా మట్టిమట్టే
కోనసీమైనా, తెలంగాణా,
రాయలసీమైనా
రాష్ట్రమైనా, దేశమైనా, ప్రపంచమైనా,
మట్టితోనే రూపురేఖలు అల్లుకునేది
నీటితోనే జీవన కాంతి రేఖలు విచ్చుకునేది!
ప్రపంచ వ్యాప్తంగానే రైతు పరిస్థితిలో వచ్చిన మార్పుని ప్రతి
బింబిస్తున్నాయి. పై పంక్తులు “ రంగు, రుచి, వాసన’ ఉన్న నీళ్ళు కూల్
డ్రింకులే. కూల్ డ్రింకులతో, చెట్లకు పట్టిన చీడల్ని కొంత వరకు నాశనం
చెయ్యవచ్చు. అంటే అవి విషపూరితాలు. అని శాస్త్రవేత్తలు రుజువు
చేసిన విషయం. రంగు, రుచి, వాసనగల నీటిని వ్యాపారానికి
వినియోగిస్తూ స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితిని సృష్టించడం,
ప్రజావ్యతిరేక రాజకీయమే అంటున్నాడీ కవి.
సరళీకరణ వలన జరిగిన అనర్థాలలో ముఖ్యమైంది వ్యవసాయ
రంగంలో యాంత్రీకరణ పెరిగిపోవడం. శ్రమకు సంబంధించిన అన్ని –
రంగాలూ దీని వల్ల సంక్షోభంలో పడుతున్నై. యంత్రాలుపయోగించడం
ప్రగతిశీలత కావచ్చు. అయితే ఈ దేశంలో ఇది ప్రజల జీవన స్థాయిని !
బట్టి, వృత్తుల విధానాన్ని బట్టి జరగాలి. కేవలం శ్రమవల్లనే బతికేవార్ని
ఆత్మహత్యలకు పరిగొల్పి, యాంత్రీకరణతో కొద్దిమందిని కోటీశ్వరుల్ని చేసే
పాలక వర్గ పద్ధతి ప్రజా సంక్షోభాలకు దారితీస్తుంది. దున్నడానికి , నాట్లు
వెయ్యడానికి, కోతలకు, ఊడ్పులకు అన్నిటికీ యంత్రాలు దిగుమతి
చేసుకుంటే ఎగుమతి చేసిన వాడికి ధనం పంటలు పండుతైగాని, ఇక్కడి
రైతుల జీవితాల్లో మాత్రం మంటలు మండుతై. శాస్త్ర విజ్ఞాన ఫలితాలన్నీ
సామ్రాజ్యవాదుల, బహుళజాతుల చేతుల్లో కేవలం లాభార్జన ప్రధానంగా
ప్రజావ్యతిరేకంగా మారుతున్న దృశ్యం గూర్చి అద్దేపల్లి ఇలా అంటాడు.
‘క్షిపణి దూసుకుపోతూ నింగి దద్దరిల్లేలా అరుస్తుంది
విత్తనం మట్టిని తొలుచుకుపోతూ
తన కడుపు చీలుస్తున్న సైన్సును గూర్చి
తన కనురెప్పలైన రైతుల చివరి చూపుల్ని గూర్చి
నాగరికుడికి వినబడని హాహాకారాలు చేస్తుంది
ఒకటి ధన సంస్కృతికి ప్రతీక
మరోటి శ్రమ సంస్కృతికి ప్రతిరూపం!
ప్రకృతికి సంబంధించిన సర్వఫలితాల్నీ సగౌరవంగా స్వీకరించడం
భారతీయ సంస్కృతి. కాని, వ్యాపారం కోసం, ప్రకృతినే వికృతం చెయ్యడం
సామ్రాజ్యవాద సంస్కృతి. విత్తనాల్ని, రసాయనాలతో నింపి అధిక దిగుబడి
అనీ, ఎక్కువ ఆరోగ్యకరమనీ ప్రచారాలు కల్పించి ఏ విషఫలితాలు వచ్చినా
వ్యాపారమే ప్రధానంగా వంచన చేసే బహుళ జాతుల్ని తలకెత్తుకున్న
ఫలితంగా, భారతీయ విత్తన సంప్రదాయమే విచ్చిన్నమౌతోంది. ‘టెర్మినేటర్’
విత్తనం వల్ల జరిగిన హాని యింతా అంతా కాదు. మహికో, మెన్సెంటో
మొదలైన బహుళ జాతీయ కంపెనీలు ఎంతో విచ్చిన్నం
సృష్టించాయి. కవుల రచనల్లో ఈ ఆవేదన చాలా తీవ్ర స్థాయిలో
కనిపిస్తుంది. గంటేడు గౌరునాయుడు ఈ విధ్వంస దృశ్యాన్ని యిలా
చెప్పాడు.
ఈ నేల శరీరం మీద టెర్మినేటర్
నిలువెత్తు నెత్తుటి చారికలుగా మొలకెత్తనున్న నేపథ్యంలో
బహుళ జాతి కంపెనీల లాభాల పాటలకు
లయబద్ధంగా దరువెయ్యడానికి
డప్పు డోలు అరువిచ్చే రైతు బజార్లు వస్తున్నాయి
విధ్యంసమే యిక్కడి అభివృద్ధి క్రమ పరిణామం!’
పెరుగు రామకృష్ణ అంటాడు:
తల్లి వాసన వేసే పల్లె మట్టి
యిప్పుడు టెర్మినేటర్ విత్తనం మింగి
ఆత్మహత్యకు సిద్ధపడుతోంది
పాడి పంటలతో తులతూగే పంట కాపుల ఇళ్ళు
విషపు రసాయనాలు పెంచిన వడ్డీ మూటల మధ్య
చీకట్లు వాంతి చేసుకునే జైళ్ళ గదుల్లా మారాయి”.
రైతుకి తాను ఉత్పత్తి చేస్తున్న దేని మీదా తనకి అధికారం లేకుండా
పోయింది. అన్నిటినీ నిర్ణయించేది సామ్రాజ్యవాది శాసనాలే. సబ్సిడీలు
గానీ అమ్మకాలుగానీ, విత్తనం దగ్గర నుండి దిగుబడి దాకా అన్నీ
పరాధీనతలో ఉన్నై. కారు కొనాలంటే నిమిషాల మీద రుణం పుడుతుంది,
పరిశ్రమ స్థాపించాలంటే క్షణాల మీద లోను వస్తుంది.
కానీ పేదరైతుకి
రుణం దొరకడానికి ఎన్ని అవరోధాలో, సామ్రాజ్య వ్యాపార నియంత్రణల
గూర్చి
వసీరా తీవ్రంగా రాస్తాడు.
నీ నష్టాన్ని బట్టి కాక ప్రపంచ పోలీసుల
లాభ నష్టాల బట్టే
విత్తనం నుదుటి మీద పంటవెల కట్టి వుంది
ఈ ఏడాది నువ్వు ఎన్ని పూటలు పస్తులుండాలో
దుక్కి దున్నక మునుపే ఎత్తేసిన సబ్సీడీల మీదే
అమ్మబోయే విత్తనాల మీదే చల్లబోయే ఎరువుల మీదే
వచ్చే తెగుళ్ళ మీదే వాటికి కొట్టే మందుల మీదే రాసి వుంది
మూడో ప్రపంచం నెత్తిన కూర్చొన్న మాయాబజారు
విత్తనం కాళ్ళ కింద నేలని తొలిచి
విత్తనం కలల్ని నియంత్రిస్తుంది’
బహుళ జాతుల వ్యాపారలాభాల కోసం సరఫరా కాబడే నకిలీ
విత్తనాలు రైతు జీవితాల్ని నాశనం చేస్తున్నా, బడబాగ్ని శంకర్రాజు యిలా అంటాడు.
కలుపు మొక్కల విత్తనాలు
శిధిలమైపోయిన స్వదేశీ విత్తనానికి శ్రద్ధాంజలి ఘటించి,
విదేశీ విత్తనానికి సాష్టాంగపడతాయి
తన మాతృదేశ విత్తనాన్ని చూసిన ఆనందంతో
రెక్కలను టపటపలాడిస్తుంది వలస పక్షి
జమ్మిచెట్టు మీది స్వదేశీ పక్షులు
బిక్కు బిక్కుమంటూ శవజాగరణ చేస్తుంటాయి!”
వ్యవసాయం వల్ల జీవనోపాధి జరగక, పొట్ట చేత
పట్టుకొని పేద రైతులూ పనిలేని కూలీలు పట్టణాలకు వేల సంఖ్యలో వలసలు పోవడం
ఈనాటి హృదయవిదారక దృశ్యం. అప్పులు తీర్చలేని రైతుల ఆత్మహత్యలు,
వ్యవసాయ సంస్కృతిని హత్య చేస్తున్న పాలకవర్గాల బానిసత్వ ఫలితమే.
“ఇక్కడ కరువు రక్కసి
కొండ చిలువ నోరు తెరుచుకూర్చుంటుంది
కరువు కోరల్లో జనజీవనం కర్కశంగా నలిగి పిప్పై
ప్రాణాల్ని చిక్క బట్టుకుని జీవన భృతి కోసం
వలస పక్షి ఎగిరిపోతుంది!
వలసలో ఉన్న ‘ఆత్మక్షోభని అమ్మంగి వేణుగోపాల్ చెప్తాడు. రైతుకి అదెంత
బాధాకరమో ఈ కింది పంక్తులు వ్యక్తం చేస్తే.
ఏరెండి పోయింది
పొలం తాకట్టులో వుంది
తెగనమ్ముదామంటే
పొలంలో తరతరాల “ఆత్మవుంది
ఎక్కడికి వలస పొమ్మంటావు!
వ్యవసాయమే కాదు ఈ దేశంలో అన్ని వృత్తులూ మార్కెట్ వ్యవస్థలో
విచ్ఛిన్నమైపోతూ, శ్రామికుల జీవితాల్ని నాశనం చేసే పరిస్థితిని వఝల
శివకుమార్ చెప్తాడు-
విత్తినప్పటి నుండి గిట్టుబాటు కంటి దాకా
మోసిన కలలన్నీ విరిగిన మగ్గాలై, మూసిన మిల్లులై
సింథటిక్ ప్రపంచపు వెన్నుపోటుకి
చిందరవందరౌతున్న చోట పురుగు చెట్టుకే కాదు
మొత్తం మార్కెట్ కు పట్టుకుంది, వ్యవస్థకు పట్టుకుంది
మరి ‘డెమొక్రాన్ వీళ్ళందరికీ కొట్టమంటావా?!
రైతుల మీద జరుగుతున్న ఈ దాడిని ప్రజాపోరాటాలే ఎదుర్కోవాలి.
ఒక్క రైతులే కాదు. ఈ ధనిక సరళీకృత వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తున్న జీవిత
సంక్షోభం ఎదుర్కుంటున్న శ్రామికులంతా కలిసి, తమ హక్కుల్ని, ఈ
దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం చేసే ఆలోచనలు రైతుకి
ఏదో విధంగా సహకరిద్దామనే మార్గంలోనే ఉంటై. ఇలా నడిచి నడిచి
అంతిమంగా వ్యవసాయాన్ని కూడా పూర్తి పరిశ్రమగా, వాణిజ్య రంగంగా
మార్చి పెట్టుబడిదారీ వ్యవస్థను సుస్థిరం చెయ్యడం, సామ్రాజ్యవాద
అధిపత్యానికి లొంగిపోయిన వారికి అనివార్యం అవుతుంది. ఆ పరిస్థితే
వస్తే మనదని చెప్పుకోవలసిందేమీ మిగలదు. దానికి ప్రతిఘటన ఒకటే
మార్గం.
కోడూరి విజయ్ కుమార్ అంటాడు.
“మట్టి చేతులు కూడా మాట్లాడాయి
వాటి మాటల భాష వేరు
మట్టి చేతులు మాట్లాడటం ప్రారంభించాక
నోళ్ళున్న మారాజుల సింహాసనాలు కదిలిపోతాయి.”
ఆ రోజుకి ఎదురు చూడాల్సిందే!
(గ్రామీణ జీవన విధ్వంసం-రైతాంగ ఉద్యమం పై ప్రజాసాహితి ప్రత్యేక సంచిక నవంబర్ 2005 నుండి)