(సిఎస్ సలీమ్ బాషా)
తొమ్మిదేళ్ల వయసులో మొదటి పాట రాసిన పిల్లవాడు తర్వాత కాలంలో సంగీత సామ్రాట్ గా ఎన్నో అద్భుతమైన పాటలను కంపోజ్ చేస్తాడు అని సంగీత దర్శకుడు అయిన తండ్రి కూడా ఊహించి ఉండడు.
తండ్రి అప్పటికే పేరుపొందిన సంగీత దర్శకుడు. కానీ తండ్రిని మించిన సంగీత దర్శకుడిగా అద్వితీయమైన పాటలను స్వర పరిచి ” పంచం దా” అని అందరూ ముద్దుగా పిలుచుకునే, ఆర్.డి. బర్మన్ లేదా రాహుల్ దేవ్ బర్మన్, హిందీ సినిమా పాటల చరిత్రలో ఒక నూతన ఒరవడిని సృష్టించి చాలా చిన్న వయసులో నే (55) అలా కంపోజ్ చేస్తూ… వెళ్ళిపోయాడు.
జూన్ 27 ఆర్.డి.బర్మన్ జయంతి.
తనకే ప్రత్యేకమైన పోలే స్టైల్ లో పాటలు కంపోజ్ చేయడం ” పంచం దా” ప్రత్యేకత. పోలే(foley) స్టైల్ అంటే మరింత శ్రావ్యంగా ఉండేందుకు సహజంగా రికార్డు చేయబడిన వివిధ రకాల ధ్వనులను అదనంగా పాటలకు, వీడియోలకు చేర్చడం. పాటల కోసం పిట్టల కూతలు, సోడా బాటిల్, చెంచాలు ఇలా ఏవేవో వాడి అతను కంపోజ్ చేసిన పాటలు ఈ రోజు కూడా విన సొంపుగా ఉంటాయి. నిరంతరం కొత్తదనం కోసం తపించడం అతనికే చెల్లింది. బాలీవుడ్ కు మిర్చి మసాలా అందించిన ఆర్డీ బర్మన్ కి మిరపకాయలు అంటే చాలా ఇష్టం. అతని ఇంట్లో ఎన్నో రకాల మిరపకాయల్ని పండించేవాడు. అతనొక స్వాప్నికుడు. క్రియేటివ్ జీనియస్. బాలీవుడ్ సంగీతానికి జాజ్ మ్యూజిక్ లాంటి సాంకేతికతను అందించిన ఆర్.డి.బర్మన్ ఏ పాటకు ఆ పాటను కొత్త రకంగా కంపోజ్ చేయడం ద్వారా సంగీతానికే సరిగమలు అందించాడు. పాటకు కొత్త సొబగు దిద్దాడు.
అటువంటి సంగీత దర్శకుడికి ఒక్కసారి కూడా జాతీయ స్థాయిలో అవార్డు రాలేదు. అయితే అతను స్వరపరచిన పాటకి అవార్డు వచ్చింది. హమ్ కిసీ సే కం నహి సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన ” క్యా హువా తేరా వాదా” పాటకి రఫీ కి అవార్డు వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
ఆర్.డి.బర్మన్ మహమ్మద్ రఫీ కి పెద్దగా పాటలు ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్.డి. బర్మన్, కిషోర్ కుమార్, రాజేష్ ఖన్నా త్రయం ఏర్పడిన తర్వాత, రఫీ కి పాటలు పాడే అవకాశం లేదు. మహమ్మద్ రఫీ కొంచెం నిదానించిన కాలమది. రఫీ కి కూడా చాలా కాలం వరకు అవార్డు దక్కలేదు. ఆర్డీ బర్మన్ కి మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఒకటి రెండు సార్లు అవార్డు కోసం తండ్రితో కూడా పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి.
1995 లో మరణానంతరం “1942; ఏ లవ్ స్టోరీ” సినిమాకు వచ్చింది. అదే ఆర్.డి.బర్మన్ కు చివరి సినిమా కావడం విశేషం. క్రితం రోజు ఆ సినిమా నేపథ్య సంగీతం గురించి విధు వినోద్ చోప్రా తో చర్చించిన ” పంచం దా” మరుసటి రోజు వెళ్ళిపోయాడు. ఆర్.డి.బర్మన్ స్నేహ పిపాసి. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించిన ” దోస్తీ ” సినిమాలో తనకిష్టమైన మౌత్ ఆర్గాన్ వాయించడం అతనికే చెల్లింది. తర్వాత వారు జీవితాంతం స్నేహితులుగానే ఉన్నారు
కొత్తతరం సంగీత దర్శకుడు అయినప్పటికీ, ఆర్.డి.బర్మన్ అందించిన కొన్ని మెలోడీస్ మర్చిపోలేం. అతని బెస్ట్ సాంగ్స్ ఏవి అంటే చెప్పడానికి కుదరదు. అయితే కొన్ని పాటలు మాత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాల్సిందే. మచ్చుకి 1, 2 చూద్దాం..
సినిమా ప్రపచంలోకి రావడం రావడమే సుడిగాలిగా వచ్చి తన రూటేమిటో చూపించాడు ఆర్ డి బర్మన్. 1966 లో తీస్రి మంజిల్ (Teesri Manzil)తో ఆయన వరవడి మొదలయింి. షమ్మీకపూర్ తో వచ్చిన ఈ చిత్రంలో అన్నీ పాటలు (Sona re Sona, O Hasina Zulfonwali, Aajaa Aajaa)అసాధారణ హిట్ సాంగ్స్. ఈ పాటలు ఇప్పటికే ప్రాచుర్యంలో ఉండేందుకు కారణం ఆర్ డి బర్మన్ ఈ కాంపోజిషన్ లో దట్టంగా మత్తు మందు దట్టించడమే.
హమ్ కిసీ సే కం నహి సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన ” క్యా హువా తేరా వాదా” ఎవరైనా సరే వింటే మంత్రముగ్ధులు కావాల్సిందే
యాదవ్ కి బారాత్ సినిమాలో ఈ పాట హైలెట్. పాట మొదట్లో జీనత్ అమన్ రెండు గ్లాసుల తో చేసిన శబ్దం ఒరిజినల్. అదే ఆర్.డి.బర్మన్ స్టైల్
https://www.youtube.com/watch?v=_R7Po4Wpbj8&ab_channel=bollyoldisgold
ఆరాధన సినిమాలో ఈ మెలోడియస్ పాట వినని వారు ఉండరు. రాజేష్ కన్నా ఈ సినిమా తర్వాత నే తారా పథంలో దూసుకు పోయాడు
ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. మొత్తం మీద ” పంచం దా” ఒక వైవిధ్యమైన సంగీత దర్శకుడు.
(సలీమ్ బాషా, లాఫ్ థెరపిస్టు, రచయిత, హోమియో వైద్యుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు. కర్నూలు. ఫోన్ నెం.9393737937)