ఆంధ్ర కరోనా మృతుల వివరాలు వెళ్లడించండి
అమరావతి: కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
బాధిత కుటుంబాలను చూసినా సీఎం జగన్ చలించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని చెప్పారు.
కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు పలు ఇతర డిమాండ్లతో తెదేపా చేపట్టిన ‘సాధన దీక్ష’ ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మృతుల వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనాకు ప్రపంచమంతా భయపడితే జగన్ తేలిగ్గా తీసుకున్నారని ఆక్షేపించారు. వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్‌కు కులం ఆపాదిస్తారా?అని మండిపడ్డారు.
‘‘ప్రపంచం మొత్తాన్ని కరోనా భయభ్రాంతుల్ని చేసింది. బాధ్యత గల ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ సూచనలను సీఎం జగన్ పట్టించుకోలేదు. కరోనా వచ్చిన తొలి రోజుల్లోనే నేను సూచనలు చేస్తే అవహేళన చేశారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని సీఎం చెప్పారు. కరోనా ఆంక్షలు సాకుగా చూపి తెదేపా నేతల్ని ఇబ్బంది పెట్టారు. కరోనా సమయంలో ఎంతోమంది బాధితులకు తెదేపా ధైర్యం చెప్పింది.
ఐదు కోట్ల మంది ఆరోగ్యంపై ఆలోచించాలని చెబితే మాపై తప్పుడు కేసులా? పది, ఇంటర్ విద్యార్థుల పరీక్షల పట్ల వితండవాదం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారు.
సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో తోక ముడిచారు. లేని ‘దిశ’ చట్టానికి యాప్, వాహనాలు, పోలీసుస్టేషన్లా? సీఎం ఇంటిపక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోలేదు. తెదేపా చేపట్టిన ‘సాధన దీక్ష’ నుంచి దృష్టి మళ్లించేందుకే ‘దిశ’ కార్యక్రమం చేపట్టారు.
కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. కొవిడ్ మృతుల పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలని సవాల్ చేస్తున్నా. మూడో దశ హెచ్చరికలున్నా ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. కరోనా తీవ్రతలోనూ మద్యం దుకాణాలు తెరిచి దుర్మార్గంగా వ్యవహరించారు. తప్పుడు కేసులతో పోలీసు వ్యవస్థ విశ్వాసం కోల్పోయింది. శ్మశానాల్లో రిజర్వేషన్లు, అంత్యక్రియల ధరలు పెంచారు. రైతులు, కార్మికులు పనిలేక పస్తులుంటున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.