తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ ములుగ్ ఎమ్మెల్యే సీతక్క మొక్కులు చెల్లించుకున్నారు.
పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి రావాలని మేడారం అమ్మవారిలకు మొక్కుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పార్టీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో తన మొక్కులు ఫలించాయని సీతక్క భావించారు. అందుకే మొక్కులు చెల్లించారు.
ఊరేగింపుగా వెళ్లిన సీతక్క అమ్మవారిలకు ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించారు. రేవంత్ తనకు సోదరుడని ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి దక్కటం సంతోషకరమని ఆమె అన్నారు. రేవంత్ కు పీసీసీ బాధ్యతలను అప్పగించింనందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
2017 నవంబర్ లో రేవంత్ రెడ్డి, సీతక్క టీడీపీకి రాజీనామా చేసి ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు.సీతక్కగతంలో టిడిపి తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఆమె టిడిపిలో చేరారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆమె 2009లో ములుగ్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆమె అసలుపేరు దనసరి అనసూయ. పూర్వం జనశక్తి నక్సల్ సంస్థలో పని చేశారు. తర్వాత ఆమె పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చారు. వ్యాపార ప్రయోజనాలు, కోళ్ల ఫారాలు,రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు వంటి వ్యాపకాల్లేకుండా ఎమ్మెల్యేగా ప్రజల్లోనే జీవిస్తున్న రాజకీయ నేతలెవరైనా తెలంగాణలోఉంటే అందులో మొదట చెప్పకోవలసిన పేరు సీతక్కదే.