లేదంటే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మరో పోరాటానికి టిడిపి సిద్ధం : సిఎం జగన్మోహన్రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ
ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉత్తుత్తి ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చామని ప్రకటించుకుని, ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిండా ముంచిందని, తక్షణమే ప్రభుత్వం ఆ క్యాలెండర్ని ఉపసంహరించుకుని, వైసీపీ అధినేత ఎన్నికల సభల్లో ప్రకటించిన 2 లక్షల 30వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్తగా రీ నోటిఫికేషన్ ఇవ్వాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో వారికి మద్దతుగా కొన్ని డిమాండ్లతో నారా లోకేష్ సీఎంకి లేఖ రాశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి సంవత్సరం జనవరి 1 న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మొత్తం 2.3 లక్షల ఉద్యోగాలు నింపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకొచ్చి రెండేళ్లయినా జనవరి1న మాట తప్పారని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన గ్రామ / వార్డ్ వాలంటీర్లు, ఆల్రెడీ ఆర్టీసీలో పనిచేస్తోన్న 50,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రకటించడం ఈ జాబ్ కేలండర్ ఓ కపట ప్రకటన అని తేలిపోయిందన్నారు. ఎప్పటి నుంచో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వాళ్లనూ
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటుచేసిన ఎపి కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్ సర్వీసెస్ కిందకు తీసుకొచ్చి వారికి కొత్తగా ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొనడం మోసపుచ్చడమేనన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలలో 0.47% మాత్రమే పోస్టులతో ప్రకటించిన బోగస్ జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేల పోస్టులు ఖాళీలుంటే గ్రూప్1, 2 లో కేవలం 36 పోస్టులు మాత్రమే జాబ్ క్యాలెండర్లో పెట్టడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమేనన్నారు. కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టులు 16000 కంటే ఎక్కువ ఖాళీలుంటే జాబ్ క్యాలెండర్ అటువంటి 450 పోస్టులను ప్రకటించి లక్షలాది మంది ఆశావహులకు సర్కారు తీవ్ర నిరాశ మిగిల్చిందని పేర్కొన్నారు. విద్యా శాఖలో 26000 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీలుంటే.. కేవలం 2 వేల పోస్టులు భర్తీ చేస్తానని శిక్షణ తీసుకున్న లక్షలాది మందిని ఉసూరుమనిపించారని ఆరోపించారు. రెండేళ్ల జగన్రెడ్డి పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మాయమాటలతో యువత బంగారు భవిష్యత్తుని జగన్రెడ్డి జాబ్ కేలండర్ చీకటిమయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు 38% ఉందని, దక్షిణాది రాష్ట్రాలలో ఇదే ఎక్కువ అని, దేశంలో నిరుద్యోగిత రేటు రాష్ట్రాలలో ఏపీ 4వ స్థానంలో ఉందని, సీఎమ్ఐఈ సర్వే ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రాష్ట్రంలో 7 లక్షలకు పైగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు నమోదు కావడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్-డిసెంబర్ మధ్య జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో నిరుద్యోగిత రేటు 45%గా నమోదు కావడం రాష్ట్రంలో యువతకు ఉపాధి దూరం అవుతోందనే ప్రమాద సంకేతాలు పంపుతోందన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొందరు ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారు. కోవిడ్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైతే వైకాపా ప్రభుత్వ అరాచక పాలన, అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడిందన్నారు. రెండెళ్ల లో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, పారిశ్రామిక వృద్ధిని నీరుగార్చి ప్రైవేటు రంగంలో ఉపాధికి గండికొట్టారని, ఉద్యోగాల్లేని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగావకాశాలను దూరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకి భరోసానివ్వాలంటే, ఆందోళనకి దిగిన నిరుద్యోగులు..విద్యార్థులకు న్యాయం చేయాలన్నా తక్షణమే ఈ కింది డిమాండ్లు నెరవేర్చాలని నారా లోకేష్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు.
1. పాదయాత్రలో మీరు వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలి
2. 6500+కి పైగా ఖాళీగా వున్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి
3. గ్రూప్ 1 & గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ కొత్తగా విడుదల చేయాలి
4. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి 30 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి
5. ఇంజనీరింగ్ విభాగాలలో 20,000 వేలకు పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టాలి.
6. రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి
7. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
8. టిడిపి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకిచ్చిన 2000 నిరుద్యోగ భత్యాన్ని పునరుద్ధరించాలి.
ఈ డిమాండ్లన్నీ నెరవేర్చడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పించొచ్చు. తద్వారా రాష్ట్రాభివృద్ధి సాధించవచ్చు. ఉత్తుత్తి ఉద్యోగాల భర్తీ పేరుతో కోట్ల రూపాయల ప్రకటనలు, బోగస్ జాబ్ క్యాలెండర్ల ద్వారా ఎవరికి ఒరిగేదేమీ లేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కరించాలని ఈ లేఖ రాస్తున్నాను. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను. ఉద్యోగాల భర్తీ కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే వారి తరఫున తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది.