తెలంగాణ దళితులు సాధీకారీకరణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు.
దళితుల కోసం గత ఏడేళ్లలో ఆయన చాలా ప్రకటనలు చేసినా, తొలిసారి ఇలా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాన్ని, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలను గుర్తించరు. ఇపుడు తొలిసారి ఆయన దళితులకోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
దీనికి బిజెపి నాయకుడు మోత్కుపల్లి నరసింహులు కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ను బాగా ప్రశంపించారు. ఒకపుడు తెలంగాణలో కెసిఆర్ ను మోత్కుపల్లి వమర్శించినంతా మరకొ నాయకుడు విమర్శించి ఉండరేమో. అపుడాయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత తెలంగాణ రావడం,టిడిపి ఆంధ్ర వెళ్లిపోవడం, ఆయన పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. 1982లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆయన తెలుగుదేశంలో ఉన్నారు.1983నుంచి 2004 దాకా ఆయన ఆలేరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి గెలుస్తూ వచ్చారు.2009లో తుంగతుర్తి నుంచి గెలిచారు. టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.చంద్రబాబు నాయుడి క్యాబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. ఒక దశలో చంద్రబాబు నాయుడు ఆయనకు గవర్నర్ పదవి ఇప్పిస్తున్నారని కూడా వూహాగానాలు వినిపించాయి.
2014 తర్వాత ఆయనకు పార్టీతో విబేధాలొచ్చాయి. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో టిఆర్ ఎస్ విలీనం చేయాలని ప్రకటనలు చేయడంతో సమస్య వచ్చింది. ఈ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరకు 2018 మేలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాత ఆయన 2019 నవంబర్ లో ఆయన బిజెపిలో చేరారు.
ఇపుడు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రశంసింస్తున్నారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ మీద ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. దీని భావమేమయి ఉంటుంది?
ఈ రోజు కెసిఆర్ ఆఖిల పక్ష సమావేశంలో మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు
* మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగింది
* ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది
* ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దళితుల అభివృద్ధికి ఏమి చేయాలని మమ్మల్ని అందరినీ పిలిచి సలహాలు తీసుకోవడం.. దళిత సమాజం లో వొక మానసిక ఉత్తేజం కలిగింది. అందుకు మీకు ధన్యవాదాలు
* తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించండి.