ఈ రోజు పెరిగిన పెట్రోల్ ధరలో అనేక రాష్ట్రాల రాజధానుల్లో లీటర్ పెట్రోల్ ధర రు. 100 దాటింది. మొదట ముంబాయిలో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది. ఇపుడు అనేక రాజధానులు ముంబాయి బాటలో నడవాల్సి వస్తున్నది.
పెట్రోల్ డీజిల్ ధరలలో భారతదేశం రికార్డు సృష్టిస్తూ ఉంది. శనివారం నాడు లీటర్ పెట్రోల్ ధర 35పైసలు పెరగడంతో ధరలు మరొక రికార్డు స్థాయికి చేరాయి.
జూన్ నెలలో ఇలా ధరలు పెరగడం 14 వ సారి. దీనితో హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, పట్నా, తిరువనంతపురం పట్టణాలతో సహా మొత్తం 11 నగరాలలలో లీటర్ పెట్రోలు ధర రు, 100 దాటింది. ఇదేవిధంగా కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా పెట్రోలు ధర నూరు దాటింది.
ముంబై కంటే ముందు లీటర్ పెట్రోల్ ధర రు. 100 దాటి చరిత్ర సృష్టించిన పట్టణాలు రాజస్థాన్ లోని శ్రీగంగానగర్, హనుమంత్ నగర్. తర్వాతే ముంబైకి ఈ ఘనత దక్కింది.
హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు 36 పైసలు పెరిగింది. దీనితో రూ.101.96 వద్ద ఉంది. డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.96.63కి చేరింది గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.104.31 ఉంటే, డీజిల్ రూ.98.38 కు చేరింది. వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ రూ.104.11 వద్ద ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.18 కు చేరింది.
అయితే, డీజిల్ ధర లీటర్ రు.100 లోపే ఉండటం కొంత ఉపశమనం అనుకుని సంతృప్తి పడాలి. ఈ పెరుగుతున్న తీరు చూస్తే, డిసెంబర్ నాటికి లీటర్ పెట్రోల్ ధర 150 రుపాయల తాకవచ్చేమో అనిపిస్తుంది.