ఇది‘మన అందరి ఇల్లు,’ ఆకలేస్తే భోజనం చేసుకోవచ్చు, తీసుకెళ్లవచ్చు…

పట్టణాలకు రకరకాల పనుల మీద సుదూర ప్రాంతాలనుంచి ప్రజలు వస్తుంటారు. కొందరు ఆసుపత్రులకు వస్తుంటారు, కొందరు ఏవో సర్టిఫికేట్ ల కోసం వస్తుంటారు. లేదా ఏవో వైద్య పరీక్షలు చేయించుకునుందుకు వస్తుంటారు. ఏవైనా అత్యవసర కొనుగోళ్లకోసం వస్తుంటారు. లేదా ఎవరినైనా వూర్లకు సాగనంపడానికి రావచ్చు. సకాలంలో వీళ్ల పనులు పూర్తి కాకపోతే,  పట్టణంలో సాయంకాలం దాకానో, రాత్రి పొద్దుపోయే దాకానో ఉండిపోవలసి రావచ్చు. అపుడు భోజనమెలా? అసలే కరోనా టైం? లేదా హోటళ్లు తెరిచి  ఉన్నా డబ్బులుండకపోవవచ్చు.అపుడెలా?

ఇలాంటి వారిని ఆదుకునేందుకు  ‘మే ఐ హెల్ప్ యు పౌండేషన్’ (May I Help You Foundation) ఒక అద్భతమయిన ప్రయోగం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మొదలు పెట్టింది. ‘మన అందరి ఇల్లు’ అనే పేరుతో ఒక భోజనశాల ప్రారంభించింది.

ప్రొద్దుటూరు సూపర్ బజార్ రోడ్డులో సింగం భాస్కర్ రెడ్డి ఆసుపత్రి ఎదురుగా ఒక ఇంట్లో పరిశుభ్రమయియన, ఆరోగ్యకరమయిన వాతావణంలో ఈ భోజన శాల ఏర్పాటయింది.

చాలాచోట్ల ఉచిత భోజన ఏర్పాట్లున్నాయి. ఉదాహరణకు  తెలంగాణ కాగజ్ నగర్ లో టిఆర్ ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప భోజన శాల తెరిచారు. రకరకాల పనుల మీద కాగజ్ నగర్ కు వచ్చే కూలీలు, చిరుద్యోగులు, విద్యార్థులు, రోగుల అంటెండెట్లు సుమారు  నాలుగు వందల మంది దాకా రోజు ఇక్కడ భోజనం చేస్తుంటారు. తెలంగాణలలో కోనేరు కోనప్ప  ప్రయోగం బాగా పాపులర్ అయింది. అక్కడ వంట చేసి వడ్డిస్తారు.

ఇక్కడే ప్రొద్దుటూరు ప్రయోగం భిన్నమయింది. ‘మన అందరి ఇల్లు’లో  ఎవరి వంట వారే చేసుకోవాలి ఇక్కడి కిచెన్ సమృద్ధిగా ఉంటుంది. వంట పాత్రలు, రైస్ కుకర్, రెండు స్టౌలు, రెండు సిలిండరల్ , మంచినీళ్లు సిద్ధంగా ఉంటాయి. అదే విధంగా అన్నం, పప్పు, కూరలకు కావలసిన వస్తువులన్నీ సిద్ధంగా ఉంటాయి. ‘మన అందరి ఇల్లు’కు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏపని మీద వచ్చారో రికార్డు చేసి అధార్ కార్డు చూపించి కిచెన్ లోకి ప్రవేశించి మీకిష్టమయినవంటచేసుకో వచ్చు, తినవచ్చు. అవసరమయిన వారికి తీసుకుపోవచ్చు.

బయట ఎక్కడైనా లేదా ఆసుపత్రిలో మీ బంధువులంటే వాళ్లకి కూడా వంట వండుకుని తీసుకుని పోవచ్చు. అయితే, అధార్ కార్డు తప్పని సరి. ఎవరైనా, ఆకలేసినపుడు రావచ్చు.వండుకోవచ్చు. తినవచ్చు. ఒకేసారి వందమంది వచ్చినా వంట చేసుకునేందుకు వీలుగా పాత్రలు, సరుకులు సిద్ధంగా ఉంచినట్లు May I Help You Foundation సిఇవొ మిరియాల మల్లికార్జున్ ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ చెప్పారు.

మిరియాల మల్లికార్జున్, May I Help You Foundation సిఇవొ

‘ మన అందరి ఇల్లు’ ప్రయోగానికి మోటివేషన్ ఏమిటంటే ప్రొద్దుటూరు చుట్టుపక్కల గ్రామాలనుంచి ఆసుపత్రికి  చికిత్స కోసం లేదా మరేదైనా   పనిమీద వెళ్ళినప్పుడు హోటల్లో ఫుడ్ తినడానికి ఇబ్బంది పడేవారిని ఎందరినో మేం చూశాం. చాలా మంది ఆసుప్రతికి రోగులతో పాటు వచ్చే అటెండెంట్లు భోజనం కోసం ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్లని చూశాం. ఇలాగే విద్యార్థులను కూడా మేం గమనించారు. వారందరికి  మా స్థాయిలో మేం తోడుగా ఉండాలనుకున్నాం. దీన్నుంచి వచ్చిందే  ‘మన అందరి ఇల్లు’. ఇక్కడికి వచ్చే వాళ్లు ఎవరైనా  లోనికి వచ్చి, తమ ఇంట్లో వారెలా సమస్యలేకుండా  వంట చేసుకుంటారో, అలా తమకు కావలసిన వంట చేసుకుని తినవచ్చు. వంట చేసుకుని శుభ్రంగా పాత్రలను కడిగి వెళ్లి పోవచ్చు. అపుడు మరొకరికి అవకాశం ఉంటుంది. శుభ్రతకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది ఇక్కడ,’ అని మల్లికార్జున్ తెలిపారు.

మోరే లక్ష్మణ్ రావు , చెయిర్మన్, May I Help You Foundation

‘విజిటర్స్  నచ్చిన విధంగా సాధారణ భోజనం  చేసుకోవడానికి కావలసిన సరుకులు మొత్తం అక్కడ ఉంటాయి. మనం చేయవలసిందల్లా మన ఆధార్ కార్డు చూపించడం, మనం వెళ్ళిన పని, అంటే  ఒకవేళ హాస్పిటల్ లో పేషెంట్ కోసమైతే పేషెంట్ షీట్  చూపించాలి. పేషెంట్ కి కావాల్సిన విధంగా ఆహారం వండుకొని తీసుకు పోవచ్చు. అలాగే  పేషెంట్లకు సహాయకులుగా ఉన్నవారికి వారికి కావలసిన విధంగా స్వయంగా  వండుకొని తీసుకుని పోవచ్చు,’ అని చెప్పారు.

ఇందుకోసం ఎటువంటి డబ్బు చెల్లించే అవసరం లేదు. మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. మన అందరికి ఇల్లుకు రావాలనుకున్నవారు, నేరుగా రావచ్చు లేదా, 8297253484, 9000879801 ఫోన్ చేయవచ్చు.  కిచెన్ సరుకుల కొరత లేకుండా నిరంతరం గమనిస్తూ ఉంటారు.

 నిధులెలా వస్తున్నాయి?

May I Help You Foundation లో 140 సభ్యులున్నారు. ప్రస్తుతానికి ఖర్చంతా వారే చందాలు వేసుకుని భరిస్తున్నారు. ఎవరినుంచి డొనేసన్లు తీసుకోవడం లేదు. అయితే, కొంతమంది బియ్యం,కందిపప్పు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వారి నుంచి తీసుకోవాలనుకుంటున్నారు.

డైనింగ్ రూమ్

జూన్ 19 అందరి ఇల్లు ప్రారంభమయింది.అందరికి స్వాగతం అని మల్లికార్జున చెప్పారు. కడప జిల్లా విద్యాకేంద్రం, వైద్య కేందం. చుట్టుపక్కల సూదూర గ్రామాలనుంచి ఆసుపత్రి పనిమీద వచ్చే వారు చాలాఎక్కువ.రోగులకు మంచి ఆహారం తీసుకెళ్లాలనుకునేవారికి ఇది మంచి సహాయకారిగా ఉంటుంది. ఇలాంటి వారు మన అందరి ఇల్లు సేవలను ఉపయోగించుకోవాలని మల్లికార్జన్ కోరుతున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *