శ్రీ‌వారి ఆల‌యంలో ముగిసిన జ్యేష్టాభిషేకం

స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

తిరుమల, 2021 జూన్ 24: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం గురువారం ఘనంగా ముగిసింది.

మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

చివరి రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామి వారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌ మిచ్చారు.

 ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామి వారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు.

 

ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు శ‌త‌క‌ల‌శ తిరుమంజనం చేపట్టారు.

అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ అనంత‌రం స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ ర‌ద్దు

జ్యేష్టాభిషేకం కార‌ణంగా గురువారం పౌర్ణ‌మి సంద‌ర్భంగా నిర్వ‌హించాల్సిన గ‌రుడ‌సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

జూన్ 22 మంగ‌ళ‌వారం నాడు  తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం  శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవ‌త్స‌రంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.

వ‌జ్ర క‌వ‌చంలో స్వామివారు ద‌ర్శ‌నం

మంగళవారం నాడు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత బుధ‌వారం ముత్య‌పుకవచంతో, గురువారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *