(వడ్డేపల్లి మల్లేశము)
భారత దేశ వ్యాప్తంగా పరిపాలనకు సంబంధించి అత్యున్నత పౌర అధికారులుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చివరికి జాతీయ స్థాయిలో కూడా ఐఏఎస్ అధికారులు కీలకపాత్ర వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. జిల్లా అధికారి గా కలెక్టర్లు అని పిలిస్తే మిగతా స్థాయిల్లో కార్యదర్శులు, కమిషనర్లు అనే వేరు వేరు పేర్లతో పిలువబడిన అప్పటికీ అఖిల భారత సర్వీసులకు సంబంధించి నటువంటి ఐఏఎస్ క్యాడర్ భారతదేశ పరిపాలనలోనే ఉత్కృష్టమైనది.
రాజ్యాంగబద్ధంగా ఒక జిల్లా అధికారి గా కలెక్టర్ జిల్లా సాధారణ పరిపాలన కు సంబంధించినటువంటి సమగ్ర అంశాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి చిత్తశుద్ధి అంకితభావంతో ప్రజల సమస్యల పరిష్కారంలో రాజకీయ పక్షాలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలతో అందరినీ కలుపుకొని పోయి పరిపాలన అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఆచరణలో కలెక్టర్లు ఎదుర్కొంటున్నకొన్ని సమస్యలు:-
జిల్లా మెజిస్ట్రేట్ గా అత్యున్నత అధికారాలు కలిగిన కలెక్టర్ గారు ఎవరి ఒత్తిళ్లకు తలవంచ కుండా నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాల మేరకు పరిపాలన చేస్తున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన టువంటి శాసనసభ్యులు, మంత్రులు, రాజకీయ నాయకులతో పాటు ప్రతిపక్షాలకు చెందినటువంటి కార్యకర్తలు కూడా కలెక్టర్ల పైన ఒత్తిడి తెచ్చి చట్టబద్దంగా లేనటువంటి వాటిని కూడా చేయించుకోవడానికి ప్రయత్నించి అనేక సందర్భాలలో కలెక్టర్లను ఇబ్బందులపాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
భూదందాలు గాని, మిగతా దోపిడీకి సంబంధించి అక్రమార్జనకు పాల్పడినప్పుడు కలెక్టర్లు నిజాయితీ కలిగిన చిత్తశుద్ధి అధికారులుగా ప్రజా ఆస్తులను రక్షించే క్రమంలో వారి నేరాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేసిన సందర్భంలో వెంటనే ఆయా కలెక్టర్లను బదిలీ చేసి వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి.
అక్కడక్కడా రాజకీయ నాయకులు కలెక్టర్లను చులకనగా చూడటం, అసభ్యంగా మాట్లాడటం జరిగినట్లుగా అనేకసార్లు పత్రికలో చూశాము. సామాన్య పౌరుని నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా కలెక్టర్ ను గౌరవించవలసిన టువంటి సంస్కారాన్ని పెంపొందించుకోవాల్సిన ది పోయి నేడు దానికి భిన్నమైన టువంటి పరిస్థితులు కొనసాగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఇది కూడా చదవండి
*ఇండియా స్టీల్ ఫ్రేం వంగిపోయింది… తెలంగాణలో కొత్త అధ్యాయం
గతంలో కరీంనగర్ దిగువ మానేరు ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కలెక్టర్ మిగతా ఉన్నతాధికారులు కార్ వెంట పరిగెత్తడం ఆందోళన కలిగించడమే కాకుండా అవమానపర్చడమే కదా! అలాంటి సందర్భాలు అనేకం జరిగినప్పుడు రాజకీయ వ్యవస్థ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఇటువంటి వారిని నివారించాల్సిన అవసరం ఉన్నది.ఇప్పటికి ఉన్నత అధికారులు,పోలీస్ అధికారులు బండ్ల ముందట పనిమనుషులు పరుగెత్తినట్లు పరుగెత్తడం చూస్తూనే ఉన్నాం.
ఇటీవల హన్మకొండలో ఒక సమావేశం జరుగుతున్న సందర్భంలో ఒక మంత్రిగారు కలెక్టర్‌ను సమావేశానికి సంబంధించి కుర్చీల
ను వేయించ మని బహిరంగంగానే ఆదేశించడం దేనికి సంకేతం?
ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా కూడా అక్కడ అక్కడ జరుగుతున్న విషయం గమనించి పౌరసమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
అంతేకాకుండా కలెక్టర్ వ్యవస్థకు సంబంధించి ఆత్మగౌరవం కోల్పోయిన సందర్భంలో ఐఎఎస్ అధికారుల సంఘం నిర్ద్వందంగా ఖండించిన ప్పుడు మాత్రమే వాళ్ళ అధికారాలకు, వాళ్ళ గౌరవానికి భంగం కలుగక పోగా ఆత్మస్థైర్యంతో ఉల్లాసంగా ప్రజల కోసం పని చేసే అవకాశం ఉంటుంది.
పాదాభివందనం చేసిన కలెక్టర్లు పతాక శీర్షిక
జూన్ నెల 20వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా కలెక్టర్ సమీకృత భవన సముదాయాలను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంలో సిద్దిపేట కలెక్టర్ గారు స్వయానా ముఖ్య మంత్రికి పాదాభివందనము చేసి ఆశీర్వాదం తీససుకుంటున్న ఫోటోలకు పత్రికల్లో వివిధ టీవీ ఛానళ్ళలో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.
ఈ సంఘటన పై అనేక మంది రాజకీయ నాయకులు, మేధావులు, బుద్ధిజీవులు, ఐఏఎస్ ఉన్నతస్థాయి అధికారులు ,సంఘ నాయకులు ఈ సంఘటన పట్ల తీవ్రంగా స్పందించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఐ. ఏ. యస్ నిబంధనావళి మూడవ సూత్రం ప్రకారం గా కలెక్టర్లు గౌరవంగా నిజాయితీగా నిబద్ధత గా ఆత్మగౌరవంతో వ్యవహరించవలసి ఉంటుందని వారిని ప్రభుత్వం కాపాడ వలసిన అవసరం ఉందని తెలియజేస్తూ జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇది ఒక దుర్మార్గపు చర్యగా భావించారు.
Like this story? Share it with a friend!
కలెక్టర్ గా తన పూర్తి అధికారాన్ని ఉపయోగించి కేవలం ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయడం అంటే ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. ఇది బహిరంగంగా జరగడం ద్వారా ఐఏఎస్ అధికారుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇంకా ఆ కలెక్టర్ గారు కేవలం గౌరవంగా ఆశీస్సులు తీసుకోవడం కోసమే పాదాభివందనం చేసినట్టుగా సమర్పించుకోవడాన్ని మరిముఖ్యంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియపరిచారు.
అయినప్పటికీ కూడా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు గాని, మంత్రివర్గ సహచరులు గాని, శాసనసభ్యులు గాని లేదా రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి మిగతా కార్యదర్శులు ఎవరు కూడా ఇంతవరకు స్పందించకపోవడం అంటే జరిగిన సంఘటనను సమర్థించి నట్లు అవుతుంది అని ప్రజలు వాపోతున్నారు.
కలెక్టర్ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేయడం చిలికిచిలికి గాలివానగా మారుతున్న సందర్భంలో దీని పైన ఒక స్పష్టమైన ప్రకటన చేయవలసిన అవసరం మాత్రం ఐఏఎస్ అధికారుల సంఘం పైన, ప్రభుత్వం పైన ఉన్నదని ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు.
తెలంగాణ ఆకాంక్ష లో చివరిది నాలుగవదైన ఆత్మగౌరవం అటు ప్రభుత్వం లోనూ, మంత్రివర్గంలోనూ ,శాసనసభ్యులల్ లేకపోగా ప్రస్తుతం కలెక్టర్లకు కూడా ఆత్మ గౌరవం దక్కకపోవడం విచారకరం.
అయితే కలెక్టర్లు తమ స్వప్రయోజనం, కోసం లేదా పై అధికారుల మెప్పు కోసం ఇలాంటి అకృత్యాలకు బహిరంగంగానే పాల్పడి ఉండవచ్చునని రహస్యంగా జరుగుతే తమకు అభ్యంతరం లేదు కానీ వేదికపైనే జరగడం జీర్ణించుకోలేక పోతున్నట్లు సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి , కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి తో పాటు అనేక మంది రాజకీయ నాయకులు విశ్లేషకులు ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇప్పటికైనా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు పూర్తి వివరణ ఇచ్చుకోవడం ద్వారా అటు ఐఏఎస్ అధికారుల సంఘానికి ఇటు ప్రజల కు బాధ్యత వహించవలసి ఉంటుంది అని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.
( ఈ వ్యాసకర్త రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ. ఆందులో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)