టీటీడీ ఛైర్మన్ పదవిని ఈసారి మహిళలకు కేటాయించాలని, అందునా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో ఒక మహిళకు కేటాయించి వైసీపీ తన విశాల దృక్పథం చాటుకోవాలని తెలుగుదేశం పార్టీ ఒక కొత్త పాయింట్ లేవనెత్తింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఈ ప్రయోగం చేయలేదు. పార్టీ నేతలను టిటిడి ఛెయిర్మన్ గా నియమించారు తప్ప కనీసం ఆగౌరవం నేతల భార్యలకు కూడా ఇవ్వలేదు. ఇపుడు సామాజిక న్యాయం ప్రకారం పాటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఎస్ సి, ఎస్టీ లేదా బిసి మహిళకు కేటాయించాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రభుత్వానికి విజ్జప్తి చేసి. ఇలా మహిళలకు గుర్తింపు నిచ్చి వైసిపి తన విశాఖ దృక్పథం ప్రదర్శించాలని కోరారు.
అయితే, టిటిడి బోర్డులలో మహిళలున్నారుగాని, చైర్ పర్సన్ గా ఇంతవరకు మహిళలను నియమించలేదు. అదేవిధంగా చెయిర్మన్ గా బిసి పురుషులను నియమించారు. దళితులకు ఆ అవకాశం కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ టిటిడి సంస్కరించే పని పెట్టుకోలేదు. అందువల్ల దళిత, గిరిజన వర్గాల నుంచి, అందునా మహిళలను టిటిటి చైర్మన్ ని ఎంపిక చేస్తే అవి విప్లవాత్మక చర్యే అవుతుంది. అధికారంలో ఉన్నపుడు టిడిపి నిర్ణయం తీసుకొనకపోయినా, వైసిపి కి ఈ అవకాశం లభించింది. ముఖ్యమంత్రి జగన్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిటిడిని సంస్కరణలకు అతీతంగానే ఉంచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో భూమన కరుణాకర్ రెడ్డి చెయిర్మన్ గా ఉన్నపుడు దళిత ’గోవిందం‘ పేరుతో దళితలకు శ్రీవారిని సన్నిహితం చేసే ప్రయత్నం జరిగింది. తప్ప ఒక మహిళను టిటిడి చెయిపర్సన్ గా నియమించడం, మహిళా ఐఎఎస్ అధికారిని టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమించడం చేయలేదు. తెలుగుదేశం డిమాండ్ ఎలా ఉన్నాజగన్ హయాంలో ఈ ప్రయోగం జరుగుతుందేమో చూడాలి.
అనిత విడుదల చేసిన ప్రకటన ఇది:
మహిళా సాధికారత విషయంలో ఎంతో చేశామని చెప్పుకుంటున్న వైసీపీ, టీటీడీ ఛైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో ఒక మహిళకు కేటాయించి తన విశాల దృక్పథం చాటుకోవాలి.
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా సంచయిత తొలగింపు అంశాన్ని మహిళా సాధికారతతో ముడిపెట్టడం మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అజ్ఞానానికి నిదర్శనం.
ఆమె వ్యాఖ్యలు హైకోర్టు తీర్పును ధిక్కరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆమెపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలి.
మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ను వాసిరెడ్డి పద్మ చదువుకోవాలి. అర్థరాత్రి హడావుడి జీవోలతో అక్రమంగా అశోక్ గజపతి రాజు గారిని తొలగించి.. దొడ్డిదారిన సంచయితను నియమించారనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.
కోర్టు తీర్పుతో తేలు కుట్టిన దొంగల్లా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్పడం మానుకోవాలి.
మహిళలకు వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన న్యాయం చేసిందో తాడేపల్లిలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనతోనే తేటతెల్లమైంది. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి నిజమైన మహిళా సాధికారతకు కృషిచేయాలి.