మావోయిస్టు హరిభూషణ్ ‘మృతి’ మీద పోలీసుల ప్రకటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విడుదల చేసిన ప్రకటన

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషన్ గత కొంత కాలంగా కరోనా వైరస్ సోకి బాధపడుతూ 21.06.2021 నాడు ఉదయం సమయంలో గుండె నొప్పితో మరణించినట్లు మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నది.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలతో సహా క్రింది స్థాయి సభ్యులు మరియు మిలీషియా కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు గతంలోనే మేము వెల్లడించడం జరిగింది.మావోయిస్ట్ పార్టీ నేతలు కూకటి వెంకన్న,శారద, సోను,వినోద్,నందు,ఇడుమ,దేవె,మూల దేవేందర్ రెడ్డి,దామోదర్ మరియు భద్రులు కూడా కరోనా వైరస్ సోకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నది.

కానీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ నేతలు నంబాల కేశవరావు@బసవరాజు,మల్లోజుల వేణుగోపాల్ రావు@అభయ్ లు మావోయిస్ట్ పార్టీలో ఎవరూ కూడా కరోనా బారిన పడలేదని ప్రకటనలు విడుదల చేయడం జరిగింది.

తెలంగాణ స్టేట్ కమిటీ కార్యదర్శి హరిభూషన్(50) మరణంతో కరోనా వైరస్ తో మావోయిస్ట్ పార్టీలోని అగ్రనాయకులు మరియు క్రింది స్థాయి నాయకులు,సభ్యులు కూడా కరోనా వైరస్ సోకి బాధపడుతున్నట్లు తేటతెల్లం అయినది.సరైన వైద్యం అందక మావోయిస్ట్ నేతలు సోబ్రాయి, నందు,హరిభూషన్ మరియు ఇతర నాయకుల మరణాలకు మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలే భాద్యత వహించాలి.

మావోయిస్ట్ పార్టీలోని నాయకులు మరియు సభ్యులు కరోనా వైరస్ సోకి సరైన వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారు.మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు రావాలని చూస్తున్న నాయకులు మరియు సభ్యులను పార్టీ అగ్రనాయకత్వం బయటకు రానివ్వకుండా అడ్డుపడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషన్ మరణంతో తెలంగాణా రాష్ర్టంలో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తమ ఉనికిని కోల్పోయినట్లయినది.

నిషేధిత మావోయిస్ట్ పార్టీలో కరోనా వైరస్ సోకి ఇబ్బందులు పడుతున్న నాయకులు పోలీసువారి ఎదుట లొంగిపోయి మెరుగైన వైద్యం పొందవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను పోలీసు శాఖ తరపున అందేలా మేము భాద్యత తీసుకుంటాము.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *