పవార్ ‘ఫ్రంట్’ లో కెసిఆర్, జగన్ చేరతారా?

శరద్ పవార్ బిజెపి వ్యతిరేక జాతీయ ఫ్రంటు మీద చర్చే జరగకపోవడం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.ఈ రోజు  నేషనలిస్టు పార్టీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలతో సమావేశమవుతున్నారు. గత 15 రోజులుగా పవర్ ఫ్రంటు గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలను తాకలేదు.

పవార్ ఏర్పాటుచేస్తున్న సమావేశానికి ఆప్ (AAP) ఎంపి సంజయ్ సింగ్, సిపిఐ నాయకుడు డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా,   మాజీ బిజెపి నేతలు యశ్వంత్ సిన్హా,  సుధీంద్ర కులకర్ణీ, సమాజ్ వాది పార్టీ నాయకుడు ఘన్ శ్యామ్ తివారీ, మాజీ జెడియు నాయకుడు  పవన్ వర్మ, మాజీ కాంగ్రెస్ నాయకుడు సంజయ్ ఝా, మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కెటిఎస్ తులసీ తదితర నాయకులు హాజరవుతున్నారు.

అంతేకాదు,  జస్టిస్ (రిటైర్డు) ఎపి సింగ్, జర్నలిస్టు కరణ్ థాపర్, మాజీ ఆప్ నాయకుడు అశుతోష్,  ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ ఎస్ వై ఖురేషీ, ఆర్థిక వేత్త  అరుణ్ కుమార్, జర్నలిస్టు ప్రీతిష్ నంది, బాలివుడ్ రచయిత జావేద్ అక్తర్ వంటి వారుకూడా పవార్ నివాసానికి వస్తున్నారు. అయితే, రాష్ట్రాలలో రూలింగ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రతినిధులెవరూ  హాజరుకావడం లేదు.

2022లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలను, 2024 ఎదురు కానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక బలమయిన బిజెపి వ్యతిరేక జాతీయ వేదిక ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు పశ్చిమబెంగాల్ లో బిజెపి ఓటమి తర్వాత ముమ్మురంగా సాగుతున్నాయి.

దీనికి వెనక ఎనికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ ఈ మధ్య పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో డిఎంకె నేత స్టాలిన్ విజయం సాధించడంలో వ్యూహకర్తగా పనిచేశారు. ఒకపుడు ప్రధాని మోదీకి కూడా సహకరించినా, మోదీ హోదా అంతర్జాతీయ కావడంతో మరొక వ్యూహకర్త అవసరం లేకుండా పోయింది. కారణమేదయినా సరే, ప్రశాంత్ కిశోర్ ఇపుడు మోదీని  2024లో ఓడించి తీరాలంటున్నారు. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, కాంగ్రెస్ తో కూడా కలసి పనిచేస్తానని ప్రకటించారు.

మంగళవారం  నాటి పవార్ ఢిల్లీ సమావేశం వెనక ప్రశాంత్ కిశోర్  కృషి ఉంది. నిన్న ఆయన పవార్ ను కలసి చాలా సేపు చర్చించారు. ఇటీవల ఆయన  పవార్ ను కలుసుకోవడం ఇది రెండోసారి. బిజెపి వ్యతిరేక ఫ్రంటు లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారనేది చాలా స్పష్టం. ప్రశాంత్ కిశోర్ ‘ఫ్రంటు’ గురించి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్రంటులో భాగస్వామి కాకపోతే, ఇది బిజేపియేతర, కాంగ్రెసేతర ఫ్రంటుగా కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే ముక్కోణపు పోటీతో  2024లో మోదీతో తలపడటం సాధ్యం కాదు.

మోదీని ఓడించాలంటే  1990లో ఎన్టీరామారావు ఏర్పాటుచేసినట్లు ఒక జాతీయ ఫ్రంటు (National Front) ఏర్పాటుచేయాలి. ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నింటిని కూడగట్టడంలో ఎన్టీఆర్ విజయవంతమయయ్యారు. బిజెపి కూడా మద్దతునిచ్చింది. ఇందులో ఎక్కువగా సోషలిస్టు నేతలుండేవారు.  అప్పటి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నపుడు కాంగ్రెస్, బిజెపిలు కూడా బయటి నుంచి మద్దతు నిచ్చాయి. ఇలాంటి ఫ్రంట్ ను ఇపుడు వూహించనే లేం.

అయితే, పవార్ ఫ్రంట్ ను  మోదీ  వ్యతిరేకంగా ఫ్రంటుగా మార్చేందుకు సుధీంద్రకులకర్ణి, యశ్వంత్ సిన్హా వంటి వాజ్ పేయి కాలం నాటి బిజెపి విధేయులు  కృషి చేస్తున్నారు. ఇది టిఆర్ ఎస్, వైసిపి, బిజూజనతా దళ్ వంటి పార్టీలకు ఇబ్బంది కలిగించే విషయం.

పవార్ సమావేశానికి యుపిఎ నుంచి ఎవరూ హాజరవుతున్నట్లు లేరు.  తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీలు అంటే యుపిఎలో లేని పార్టీలు  ఇలాంటి ఒక ఫ్రంటు ఏర్పాటు మీద ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఇక్కడ గమనించాలి.

ఇలాంటపుడు,  పవార్ ఫ్రంట్  గురించి టిఆర్ ఎస్, వైసిపిలు ఎలాంటి ధోరణి అవలంభిస్తాయి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బిజెపి వ్యతిరేక ఫ్రంటులో చేరే అవకాశాలు తక్కువ. ఎన్ డిఎలో లేక పోయినా ఆయన బిజెపితో బాగా సఖ్యంగా ఉంటున్నారు. ఇపుడు రాష్ట్ర రాజకీయ, వ్యక్తిగత కారణాల రీత్యా ప్రధాని మోదీని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం జగన్ కు  లేదు.

ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రులను కలుసుకుని వస్తున్నారు. నూతన విద్యావిధానం వంటి పథకాలను ఆంధ్రప్రదేశ్ లో చక్కగా అమలు చేస్తున్నారు.  బిజెపి గురించి జగన్ ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అదే విధంగా రాష్ట్రంలోని బిజెపి నేతలను ఆయన లెక్కలోకి తీసుకోవడమే లేదు.  అందువల్ల బిజెపి వ్యతిరేక కూటమిలో జగన్ చేరే అవకాశాలు లేవు. జగన్ కు కేంద్రం అండ అవసరం. జగన్ వంటి బలమయిన నాయకుడు శత్రు శిబిరంలోకి ఉడాయించకుండా జాగ్రత్త పడటం ప్రధాని మోదీకి అవసరం. ఇరువైపుల నుంచి ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి.

కెసిఆర్ పరిస్థితి ఏమిటి?

కెసిఆర్ 2019 ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంటు అనే పేరుతో ప్రత్యేక విమాన యాత్రలతో చాలా హడావిడి చేశారు. మమతా బెనర్జీని కలుసుకునేందుకు  బెంగాల్ వెళ్లారు, స్టాలిన్ తో చర్చించేందుకు తమిళనాడు వెళ్లారు. నవీన్ పట్నాయక్ ను కలుసుకున్నారు. బిజెపి తెలంగాణాలో వేళ్లూనుకుంటున్నదేమో అనే భయం కలిగినపుడు ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటుంటారు. అది పోగానే ఆయన మళ్ళీ పెడరల్ ఫ్రంటు మర్చిపోతారు.

కెసిఆర్ కూడా మోదీ వ్యతిరేకి కానేకాదు. మనుసులో ఏదయినా వ్యతిరేకత ఉన్నా ఆయన ఎపుడూ మోదీ  మీద గర్జించ లేదు. కాకపోతే, అపుడపుడు చురకలు, ఛలోక్తులు విసిరి నవ్విస్తుంటారు తప్ప బిజెపి శత్రుశిబిరంలో చేరేందుకు ఉబలాటపడలేదు. ఒక వేళ తెలంగాణ బిజెపితో తలనొప్పి వచ్చినపుడు ఆయన ఒక సాలా హస్తినాపురం వెళ్లి వస్తారు. జాతీయ రాజకీయాలతో ఆయన బిజెపిని ఇరకును పెట్టే ప్రయత్నం ఎపుడూ చేయలేదు.  వ్యవసాయ చట్టాలను విమర్శించినా, హర్యానా పంజాబ్ రైతు ఉద్యమానికి మద్దతుగా బంద్ జరిపినా, ఢిల్లీ వెళ్లినపుడు ఆయన రైతులను క కలుసుకుని ఉద్యమోపన్యాసాలు చేసి ప్రధాని మోదీని ఇరుకున పెట్టలేదు. అదే రైతులు రెండోసారి నేషనల్ బంద్ అన్నపుడు కెసిఆర్ ఖాతరు చేయలేదు.

2019కి ముందు ఆయన ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంటు వెనక బిజెపి ఉందేమోన్న అనుమానాలు కూడా ఆ రోజుల్లో వ్యక్తమయ్యాయి. ప్రజలు, రాజకీయ పరిశీలకులు కూడా  కెసిఆర్ ను పచ్చి మోదీ వ్యతిరేకిగా భావించడం లేదు. ఆయనకు అలాంటి ముద్ర లేదు.

2019 ఎన్నికలయిన కొత్తలో ఆయన జగన్ తనతో ఉంటారని భావించి వుండవచ్చు. జాతీయ స్థాయిలో బిజెపిలో బలహీనపడినపుడు, టిఆర్ఎస్, వైసిసి బలం కలిస్తే చాలా పెద్ద శక్తి అవుతానని, రాజకీయానుభవం లేని జగన్ అన్నింటికి తలూపుతాడని వూహించి ఉండవచ్చు.

అయితే, జగన్ ఇపుడు కెసిఆర్ నుంచి బాగా దూరం  జరిగారు. జగన్ ఇపుడు తన దారి తాను చూసుకుంటున్నారు. కెసిఆర్ కు ఆయన రాజకీయ మిత్రుడనలేం. తెలుగు ముఖ్యమంత్రులొక కూటమి అని కూడా అనుకోలేం.

దానితోడు వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ   పెడుతూ ఉంది. ఇలాంటి పరిణామాల  మధ్య కెసిఆర్ ఫెడరల్ ఫ్రంటు బ్యానర్ దుమ్ముదలపడమో లేదా పవార్ ఫ్రంట్ కు మద్దతునీయడమో సాధ్యంకాదు. రాజకీయంగా ఆయన ప్రధాని మోదీతో కయ్యానికి కాలుదువ్వ లేరు.

దానికితోడు, మరొక ముఖ్యమయిన విషయం ముచ్చటించుకోవాలి.

కెసిఆర్ మరొకరి నాయకత్వంలో ఉన్న ఫ్రంటులో పనిచేస్తారా? తెలంగాణా ఉద్యమాన్నివిజయవంతంగా  నడిపిన నేత పవార్ నాయకత్వంలో గాని, మమతాబెనర్జీ నాయకత్వంలో గాని పనిచేసే అవకాశాల్లేవు. తానెవరికంటే తీసిపోనని ఆయన ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు,మోదీ నాయకత్వం బలహీన పడిందని తెలియగానే ఆయన సొంతంగా ఫెడరల్ ఫ్రంటు అంటూ నినాదామిచ్చి జాతీయ రాజకీయాల నాయకత్వం చేపట్టాలనుకున్నారు. వెంటనే టిఆర్ ఎస్  సైన్యం తెలంగాణలో కెసిఆర్ ప్రధాని కాబోతున్నాడని పండగ చేసుకున్నారు. ఎక్కడో మనసులో  ఇలాంటి కల  ఉన్న నేత, పవార్ నాయకత్వంలోని బిజెపి వ్యతిరేక ఫ్రంటులో చేరతారా?

ఒక వేళ మోదీ వ్యతిరేక ఫ్రంటు ‘ప్రధాని’ అభ్యర్థిగా కెసిఆర్ పేరును ప్రతిపాదిస్తే… అపుడు ఆయన ఎలా స్పందిస్తారో ఇపుడే వూహించడం కష్టం.

మొత్తానికి ఇపుడున్న రాజకీయ వాతావరణంలో  కెసిఆర్ ప్రధాని మోదీ మీద నేరుగా యుద్ధం ప్రకటించే అవకాశం లేదు. పవార్ ఫ్రంటులో గాని, మరొక బిజెపి వ్యతిరేక ఫ్రంటులో గాని చేరకపోవచ్చు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *