తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని కేసీఆర్ విశ్వాసమా!

(విజయశాంతి)

తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చెయ్యవచ్చనేది సీఎం కేసీఆర్ గారి గట్టి విశ్వాసం. నిన్నటి వరకూ కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు, రాత్రి మొత్తం లాక్‌డౌన్ పెట్టి… చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారు.

అంతేనా… లాక్‌డౌన్ ఎత్తేసిన రోజునే జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు మొదలుపెట్టారు.

తన దత్తత గ్రామంలో వేలాదిమందితో సామూహిక భోజనాలకు కూడా ప్లాన్ వేశారు. ఇదంతా చూస్తుంటే కరోనా తగ్గిపోయిందని ఈ కార్యక్రమాలు పెట్టారో… లేక ఈ మొత్తం ప్రోగ్రాం కోసం తెలంగాణలో కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించి లాక్ డౌన్ ఎత్తేశారో… ప్రజలు ఆ మాత్రం గ్రహించలేని వెర్రివాళ్ళు కాదు.

ఇది చాలక పేరెంట్స్ వద్దని వేడుకుంటున్నా వినకుండా జులై నుంచి విద్యా సంస్థల్ని తెరిచేందుకు కూడా అనుమతులిచ్చేసి విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు.

ఒక వైపు మన పక్క రాష్ట్రాల్లో ఇంకా కఠిన నిబంధనల మధ్య లాక్‌డౌన్లు నడుస్తున్నాయి. పొరుగుతున్న మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ ప్రజల్ని భయపెడుతోంది. తమిళనాడులో మరో పది రోజులు లాక్‌డౌన్ పొడిగించారు.

(విజయశాంతి twitter picture)

కర్ణాటకలోనూ దాదాపు ఇవే పరిస్థితులు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని తెలంగాణ పాలకులు కేవలం తమ ప్రయోజనాల కోసం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇలాంటి సర్కారు బారిన పడినందుకు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందని రోజు లేదనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *