లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ శుక్లాదేవి అర్చనం శాస్త్రోక్తంగా జరిగింది.
వర్సిటీలోని యాగశాలలో ఉదయం 11 నుండి 12 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
పురాణాల ప్రకారం శ్రీ పార్వతీ దేవి శక్తి స్వరూపాలలో శ్రీ శుక్లాదేవి ఒకరు. గ్రీష్మ ఋతువులో తొలకరి వానలు సరిగా కురిసి, మంచి పాడిపంటలతో సకల మానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ శ్రీ శుక్లాదేవిని అర్చించారు.
ముందుగా తెల్లటి వస్త్రాలు, తెల్లటి పుష్పాలు ధరించిన శ్రీ శుక్లాదేవి అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి ఆవాహన చేశారు.
అనంతరం వర్సిటీ ఆచార్యులు గోలి వెంకటసుబ్రహ్మణ్యశర్మ అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు.
భవిష్య, నారద పురాణాల ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో శ్రీ శుక్లాదేవి ఆరాధన నిర్వహిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం పరిపూర్ణంగా లభించడమే గాక సమస్త ఈతిబాధలు నశిస్తాయని తెలిపారు.
ఆ తరువాత వైదిక సంప్రదాయంలో శ్రీసూక్తపూర్వకంగా సంకల్పం, గణపతిపూజ, శ్రీ శుక్లాదేవి అర్చనం, అష్టోత్తరశతనామావళి పఠించారు. పలు నివేదనలు, నీరాజనాలు అందించిన అనంతరం క్షమాప్రార్థనతో ఈ పూజ ముగిసింది.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు దేవీ సంకీర్తనలు ఆలపించారు.