మనసును మంత్రించే ‘తాంత్రిక లోయ’ (తిరుపతి జ్ఞాపకాలు-35)

(రాఘవ శర్మ)

మండు వేసవిలోనూ చల్లని వాతావరణం. మనసును మంత్రించే ఒక మహాద్భుత దృశ్యం. తిరుమల కొండల్లో కొలువైన తాంత్రిక లోయ.

అర్ధ చంద్రాకారంతో ఆ లోయ అక్కడితో అంతమవుతోంది. ఎత్తైన కొండ అంచుల నుంచి జలధార జాలువారుతోంది. విశాలమైన రాతి నేలపై నుంచి లోతైన గుండంలో పడి పొంగిపోతూ, మెట్లు మెట్లుగా ఏర్పడిన రాతి పలకలపై నుంచి జారిపోతూ, కొండ రాళ్ళ సందుల నుంచి దూరిపోతూ, ముందుకు సాగిపోతున్న నీటి ప్రవాహం.

శేషాచలం కొండల్లో కొలువైన అనేక తీర్థాలలో లింగ తీర్థం ఒకటి. ఇదే తాంత్రిక లోయగా ప్రసిద్ధి చెందింది. కుమారధార, రామకృష్ణ, తుంబురు, శేష తీర్థాలలాగా ఇక్కడ ఏ ఉత్సవమూ జరగదు. చాలా అరుదుగా ప్రకృతి ప్రియులు ఈ తీర్థాన్ని సందర్శిస్తుంటారు.

దశాబ్దం క్రితం ఓ మండు వేసవిలో తాంత్రిక లోయను ఇలా సందర్శించాం. మిత్రులు భూమన్, పదేళ్ళ వయసున్న మా మేనల్లుడు పండు (విశ్వవిరించి) సహా అనేక మంది యువకులు, ఆరేడు దశాబ్దాల వయసు దాటిన వృద్ధులు అంతా కలిసి 23 మంది మా బృందంలో ఉన్నారు.

మా బృందానికి ‘టోక్యో’ మార్గదర్శకుడు.

సూర్యోదయమయ్యే సమయానికి పాపనాశనం డ్యాం వద్ద మా  నడక మొదలైంది. డ్యాం దాటగానే మిట్ట ఎక్కుతూ నడక మొదలు పెడితే, కిలో మీటరు దూరంలో ఉన్న సనకసనందన తీర్థం చేరుకున్నాం.

అక్కడి నుంచి రామకృష్ణ, తుంబురు తీర్థాలకు వెళ్లే దారిలోనే చలువ బండల మీద నుంచే ముందుకు సాగాం.

అక్కడి వరకు దట్టంగా ఉన్న అడవి చలువ బండల నుంచి కాస్త పలుచబడుతుంది. చుట్టూ కొండలు, అక్కడక్కడా చెట్లు.

నీటి ప్రవాహానికి బైటపడ్డ రాళ్ళమీదుగా, కాస్త ఏటవాలుగా ఉన్న దారిలో రాళ్ళూరప్పల మధ్య నడక. ఎడమ వైపు లోతైన లోయ.ఎదురుకుండా ఎత్తైన కొండ. కొండకు కుడివైపున అంచునుంచి తుంబురు తీర్థం వెళ్లే దారి. కొండపైకి ఎదురుగా రామకృష్ణ తీర్థం వెళ్ళే సన్నని కాలి బాట.

ఆ కాలిబాటలోనే కొండ ఎక్కాలి.

మా భుజాలకేసుకున్న సంచుల్లో తిండీ తీర్థాలు, కొందరి నెత్తిన వంటసామాగ్రి. సామాన్లనే కాదు, శరీరాన్ని కూడా అతికష్టం పైన మోస్తున్న ఒకరిద్దరు స్థూలకాయులు! ఎత్తైన కొండ ఎక్కుతుంటే ఎగశ్వాసలు, దిగశ్వాసలు. కాస్త దూరం పోగానే దారులు చీలాయి.

వాయువ్య దిశగా ఉన్న దారిలో వెళితే తాంత్రికలోయ. అందరికంటే ముందు నడవాలన్న అత్యుత్సాహంతో మాలో ఇద్దరు ఎదురుగా ఉండే రామకృష్ణ తీర్థం దారిలో వెళ్ళిపోయారు. మేం తాంత్రికలోయకు చేరాక గానీ వారు అడవిలో తప్పిపోయిన విషయం తెలియలేదు. ఖంగారు పడిపోయాం .

ఆ ఇద్దరు రామకృష్ణ తీర్థం వెళ్ళేసరికి వారికి భయం వేసింది. కనుచూపు మేరలో ఎలుగుబంటు! అది ఏమాత్రం తమ అలికిడి పసిగట్టినా అంతేసంగతులు! బతుకుజీవుడా అంటూ నెమ్మదిగా వెనుతిరిగి సాయంత్రానికల్లా మళ్ళీ పాపనాశనానికి చేరి పోయారు. తాంత్రికలోయ దారిలో ముందుకు సాగిపోతున్నాం.

వెనక్కి తిరిగి చూస్తే దూరంగా పాపనాశనం డ్యాం.కొండంతా ఎర్రచందనం చెట్లే! వాటికి తోడు ఈత, ఉసిరి, కరక్కాయ చెట్లు కూడా ఉన్నాయి. దట్టంగా పెరిగిన బోద మధ్య నుంచి సన్నని నడకదారిలో సాగిపోతున్నాం. ఎక్కడా సెల్ సిగ్నల్స్ అందడం లేదు.

ముందుకు సాగుతున్న కొద్దీ కనుమరుగవుతున్న నాగరికత ఆనవాళ్ళు.కలయ తిరిగి చూశాం. ఎటుచూసినా కొండలే! కొండ కొసకు చేరాం.

ఆ అడవిని విభజిస్తూ కనుచూపు మేరవరకు ప్రహరీగోడగా పేర్చిన రాళ్ళ వరుస (Fire safety wall). ఒక ప్రాంతంలో బోదకు నిప్పంటుకుంటే, మరో ప్రాంతానికి పాకకుండా అటవీ శాఖ వారు ఇలాంటి రాతి గోడలను నిర్మించారు.

తాంత్రిక లోయ లోకి దిగి ఇలా ముందుకు సాగాలి

 

ఆ కొండల్లో అతి ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నాం. కొంత దూరం నడిచాక రెండు కొండల నడుమ నుంచి లోయలోకి నడక మొదలైంది. అక్కడి వరకు మా నడక ఒక ఎత్తైతే, అక్కడి నుంచి మరొక ఎత్తు. టవాలుగా కాకుండా, దాదాపు నిలువులోతుగా లోయలోకి దిగుతున్నాం.

దారంతా వర్షపు నీటి ప్రవాహానికి దొర్లి వచ్చిన బండరాళ్ళు. ఏ మాత్రం ఎండ పొడ కనిపించకుండా దట్టంగా పెరిగిన అడవి. చెట్ల కొమ్మలను, పెద్ద పెద్ద రాళ్ళను పట్టుకుని లోయలోకి జాగ్రత్తగా సాగుతున్నాం.

ఒక వైపు కొండ గట్టు, మరొక వైపు చెట్ల కొమ్మలు పట్టుకుని దిగుతున్నాం.మెలికలు మెలికలుగా లోయలోకి నడకదారి. జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎండిన ఆకులపై కాలుపడితే జర్రున జారిపోవడమే!

కొన్ని సందర్భాలలో చేతులను కూడా కాళ్ళలాగే ఉపయోగించి చతుష్పాదుల్గాగా లోయలోకి దిగుతున్నాం. ముందెళ్ళిపోతున్న వారిని అరవడానికి గొంతు చాల డం లేదు. గట్టిగా ఈల వేయాలి.

దూరంగా వినిపిస్తున్న సెల ఏటి శబ్దాలు మాలో అలుపును తీర్చి ఉత్సాహాన్ని నింపాయి. రాళ్ళపై నుంచి లోయలోకి దిగుతున్నాం. గలగలా వినిపిస్తున్న నీటి ధార.తాంత్రిక లోయలోని పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య నుంచి రామకృష్ణ తీర్థం మీదుగా తుంబరు తీర్థంలోకి సాగిపోనున్న నీటి ప్రవాహం.

స్వచ్ఛమైన నీటిలో స్వేచ్ఛగా కదలాడుతున్న చేపపిల్లలు. ఆ లోయలో రాళ్లను ఎక్కుతూ దిగుతూ ముందుకు సాగిపోతున్నాం. ముందుకు సాగిన కొద్దీ ఎటు చూసినా ఎన్నెన్నో ప్రకృతి అందాలు! సూర్యుడు నడినెత్తికొస్తే తప్ప కనిపంచడు.

మండు వేసవిలో కూడా లోయలో చల్లదనం!

తాంత్రిక లోయ మహా అద్భుత దృశ్యం

రెండు కొండల నడుమ నుంచి మళ్ళీ పైకెక్కాం. ఒక మహాద్భుత దృశ్యం. కలయ తిరిగితే ఆకాశాన్ని తాకుతున్నట్టు అర్ధచంద్రాకారంలో ఎత్తైన అతి పెద్ద రాతి కొండ. దాని ముందు పిపీలకాల్లా మేం. నలుపు, బూడిద, లేత గులాబీ రంగుల్లో ఎవరో చెక్కినట్టు ఒక నైరూప్య చిత్రం.

పలకలు పలకలుగా అమర్చినట్టున్న రాతి కొండపై నుంచి జాలువారుతున్న నీటి ధార. ఒక్కొక్క చోట రాళ్ళ పై నుంచి నీటిని చిమ్ముతున్న విన్యాసం. చెవులకు ఇంపైన జలసంగీతం.దాని ముందు ఏ సంగీతమైనా చిన్నబోదా!? ఆ జలధార కిందే కొందరు స్నానాలు చేశారు. మరి కొందరు నిశ్చల సమాధిలో కెళ్ళిపోయారు.ఆ జలపాతం ముందు యోగాసనాలతో గడిపారు.

పెద్ద పెద్ద అరుపులతో ప్రతిధ్వనించిన తాంత్రిక లోయ. ఆ లోయ అందాలతో తన్మయులైపోయాం. వంటలు, భోజనాలు, తరువాత కాస్త కునుకు తీయడంతో తాంత్రికలోయలో మూడు గంటలు ఎలాగడిచిపోయిందో తెలియదు.

తాంత్రిక లోయ నుంచి తిరుగు ప్రయాణ మై ఇలా లోయ లోంచి పైకి ఎక్కు తూ..

తాంత్రిక లోయను తనివితీరా చూసి మళ్ళీ తిరుగుముఖం పట్టాం. జీవితంలో మళ్ళీ ఈ లోయకు వస్తామో, లేదో!? ఈ తీర్థాన్ని మళ్ళీ చూస్తామో, లేదో!? ఇప్పటివరకు మా అనుమానాలు నిజమయ్యాయి. పదేళ్ళ క్రితం వెళ్ళిన ఈ తాంత్రిక లోయను మళ్ళీ ఇప్పటి వరకు చూడలేకపోయాం. చూస్తామన్న నమ్మకమూ లేదు.

వస్తూ వస్తూ వెనుదిరిగి లోయలోని జలధారకు ఒక నమస్కారం చేశాం. వచ్చేటప్పుడు తేలిగ్గా దిగామే కానీ, ఎక్కడం అంత సులువు కాదు. చెట్ల కొమ్మలు పట్టుకుని, జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఎక్కాం.

వెళ్ళేటప్పుడు చూసిన ప్రకృతి అందాలనన్నిటినీ మళ్ళీ చూశాం. సూర్యాస్తమయం కాబోతోంది. చీకటి పడబోతోంది. మళ్ళీ అదే ప్రయాసతో పాపనాశనం చేరాం.గుండెల నిండా స్వచ్ఛమైన అడవి గాలిని పీల్చుకున్నాం. ఒక మహద్భుత అందాన్ని చూసిన అనుభూతిని మిగుల్చుకున్నాం.

 

నల్ల టీషర్ట్ వేసుకున్న వ్యక్తి టోక్యో

తాంత్రికలోయలో నల్ల టీషర్టు వేసుకున్న వ్యక్తి టోక్యో. తాంత్రికలోయను చూడడానికి మాకు మార్గదర్శకుడు ‘టోక్యో’. ఆ పేరు కాస్త వింతగానే ఉంది. అతను అచ్చమైన తెలుగు వాడు. తిరుమల వాసి.

వాళ్ళ అన్న జపాన్ రాజధాని టోక్యోకు తరచూ వెళ్ళి వస్తుండేవాడు. అక్కడి నుంచి తెచ్చిన దుస్తులు ధరిస్తున్న ఆ బాలుణ్ణి చూసి అంతా టోక్యో అని పిలవడం మొదలు పెట్టారు. చివరికి ఆ బాలుడు పెద్ద యి నా కూడా అతని పేరు ‘టోక్యో’ గానే స్థిరపడిపోయింది.

తిరుమల కొండల్లో అతను తిరగని చోటంటూ లేదు. ఎప్పుడూ ఎదో ఒకటి మాట్లాడే మాటల మాంత్రికుడు. ఎంత కొత్త వాళ్ళనైనా కలుపుకుపోయే ఉత్సాహవంతుడు. ఎప్పుడూ ఒక భిన్నమైన వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకుంటుంటాడు. టీటీడీ ఉద్యోగి. ఇప్పుడు రిటైరై ఉండవచ్చు.

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *