రఘురామ ఇంత రచ్చ రచ్చ చేస్తాడని వైసిపి మేధావులు వూహించలేదు

నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణమరాజు పట్ల పోలీసు వ్యవహరించిన తీరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టి వేస్తున్నది.

ముఖ్యమంత్రిని తిడుతున్నాడు కాబట్టి, నోరు మూయించాలని ఆయన్ను అరెస్టు చేశారు. బెయిల్ కూడా దొరకని కఠినమైన రాజద్రోహం సెక్షన్లు నమోదు చేశారు.

అంత వరకు ఆగి వుంటే ఏ పేచీ వుండేది కాదు. అయితే రఘురామను కొడితే ముఖ్యమంత్రి తమను మెచ్చుకొని మేకతోలు కప్పుతాడన్న దురాశతో అనుచితంగా ప్రవర్తించడం పోలీసు చేసిన మహాపరాధం.

రఘురామ శక్తి, పలుకుబడి, ఆయన వెనుక వున్న బలగం గురించి అంచనా లేకుండా చేసిన తప్పిదం ఇది. సాధారణ వ్యక్తుల విషయంలో పోలీసు చిత్రహింసలు చెల్లిపోతాయి. కొట్టి, మేము కొట్టామని బయటచెప్తే ప్రాణాలు తీస్తామని భయపెట్టి, నోరు మూయించడం వారికి అలవాటే.

కానీ రఘురామ విషయంలో కూడా అదే ప్రయోగం చేస్తే ఎట్లా. అదిప్పుడు వికటించింది. పోలీసు ప్రయత్నాలన్నీ విఫలం చేసి, న్యాయస్థానాలలో ఎవరూ ఊహించని వ్యూహాలు అమలుచేసి, ఒక్కరోజులోవారి చెర నుండి తప్పించుకొన్నాడు రఘురామ కృష్ణమ రాజు. పైపెచ్చు పోలీసు కళ్లు కప్పి నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయాడు.

ఢిల్లీలో క్షణం ఖాళీగా లేడాయన. మొదటిరోజే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగును కలిసి, సైనిక ఆస్పత్రి అధికారుల మీద, టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మీద ఫిర్యాదు చేశాడు. అదిప్పుడు విచారణలో వుంది. ఏమాత్రం ఆయన ఫిర్యాదులో నిజం వున్నా ఆ ఇద్దరు అధికారులకు సమస్య తప్పదు.

  • పూటకొక ఫిర్యాదుతో ఉక్కిరి బిక్కిరి
  • ఢిల్లీలో ప్రభుత్వం పరువు పోతోంది 
  • బెయిల్ రద్దంటూ దుష్ప్రచారం
  • అధికారులగుండెల్లో రైళ్లు పరుగెట్టుతున్నాయి
  • జగన్ ఢిల్లీ పర్యటన వివాదానికీ కారణం అదే!

సిబిసిఐడి అధినేత సునీల్ కుమార్ విషయంలో రఘురామ కృష్ణమరాజు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మీద వీలైనన్ని చోట్ల ఫిర్యాదుల పరంపర కురిపిస్తున్నాడు. అది చాలదన్నట్లు ఆయన చేసిన క్రైస్తవ మత ప్రచారం వీడియోలు కేంద్ర బిజెపి నేతలందరికీ అందజేశాడు. మహారాష్ట్రలో ఒక సంస్థ ద్వారా ఆయన ఉద్యోగానికి సమస్య తెచ్చే స్థాయిలో ఫిర్యాదు చేయించాడు.

మరొక ప్రక్క సుప్రీంకోర్టు, హైకోర్టులలో తన విషయంలో జరిగిన పోలీసు లాకప్ హింసకు సంబంధించి, ఆర్మీ ఆస్పత్రి, ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థల ధృవ పత్రాలను ప్రయోగిస్తున్నాడు. వాటికి న్యాయస్థానాలలో విశ్వసనీయత వుంది. లాకప్ హింస విషయంలో సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా స్పందిస్తుందో గుజరాత్ ఐపిఎస్ అధికారుల ఉదంతాలే నిదర్శనం. వాళ్లను జైలుకు పంపిన దాకా వదలి పెట్టలేదు న్యాయస్థానం.

రేపు పార్లమెంటులో ఇదొక పెద్ద వివాదం కాబోతుంది. అన్ని పార్టీల ఎమ్పీలను కూడగడుతున్నారాయన. ఒక సహచరుడిని పోలీసులు కొట్టారంటే, సహజంగా ఏ MP అయినా సానుకూలంగా వ్యవహరిస్తారు.

లోక్ సభలో దాదాపు అన్ని పక్షాల నుంచి రాష్ట్ర పోలీసు యంత్రాంగం విమర్శలు ఎదుర్కోక తప్పదు. సభాహక్కుల ఉల్లంఘన కూడా తప్పదు. న్యాయస్థానాలకంటే, లోక్ సభలో విచారణ త్వరితంగా జరిగిపోతుంది. లోక్ సభకు, న్యాయస్థానాల వలెనే శిక్షించే అధికారం కూడా వుంది.

ఈ అన్ని పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి నెత్తిన ఏ పిడుగు పడుతుందో అని హడలి పోతున్నారు అధికారులు.

సిబిఐ కోర్టులో ముఖ్యమంత్రి బెయిల్ రద్దు పిటిషన్ మరొక సమస్య. దానిపై సిబిఐ ఎటూ తేల్చని వాదన అవలంభిస్తున్నది. మేము చెప్పేది ఏమీ లేదు, పిటిషన్లోని విశ్వసనీయతను బట్టి న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవచ్చునని చెప్పింది.

ఒక రకంగా ఇది జగనుకు అనుకూలన వాదన. దాని అర్ధం, సిబిఐ అధికారులు జగన్ బెయిల్ రద్దు కోరుకోవడం లేదు. సిబిఐ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో నడిచే సంస్థ. కేంద్రంలోని పెద్దలెవరో జగనుకు అనుకూలంగా పొమ్మని సూచించినందువల్లనే సిబిఐ ఈ నిర్ణయం తీసుకొని వుంటుందని అంచనా. సిబిఐ కోరకుండా ఇంత పెద్ద నిర్ణయానికి కోర్టు తనంత తానుగా తీసుకోవడం అనుమానమే.

కానీ బయట మాత్రం ముమ్మరంగా దుష్ప్రచారం జరిగి పోతున్నది. జగన్ రాజీనామా చేసి, భారతి లేదా షర్మిల ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని కూడా మాట్లాడేస్తున్నారు. అసంబద్ధమైన ఈ ప్రచారాన్ని నిలువరించడం వైకాపా నేతల సాధ్యం కావడం లేదు.

గురువారం రాత్రి జగన్ ఢిల్లీ పర్యటన విషయంలో మీడియాలో రచ్చ, రభస జరగడానికి కూడా ఈ తప్పుడు ప్రచారాలే ప్రాతిపదిక. తన బెయిల్ రద్దు కాకుండా ఆపమని కోరడానికే జగన్ ఢిల్లీ వెళ్లాడనే అర్ధంలో వార్తలు ప్రసారమైనాయి. చర్చలు నడిచాయి.

కోర్టులో విచారణలో వున్న కేసుకు, కేంద్ర నేతలకు ఏమి సంబంధం? ఏ కేంద్ర మంత్రి అయినా న్యాయమూర్తికి ఫోన్ చేసి బెయిల్ ఇవ్వమని కానీ, రద్దు చేయమని కానీ చెప్పగలడా? ఆ నిజం తెలిసి కూడా జగన్ మీద నిందాపూర్వక ప్రచారం చేస్తున్నాయి మీడియా వ్యవస్థలు.

ఒక రకంగా అది ఆయన తప్పు అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనలకు వెళ్లినప్పుడు, ముఖ్యమంత్రి కార్యాలయమే పూర్తి సమాచారం ఇస్తుంది. నిముషాల ప్రకారం పర్యటన వివరాలు ఇస్తారు. ఎవరిని కలుస్తున్నారో, ఎందుకు కలుస్తున్నారో పత్రికా ప్రకటనలు చేస్తారు. కానీ జగన్ వద్ద వున్న ఏ అధికారి కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. దానితో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వార్తలు వ్రాసుకొనే అవకాశం ఇచ్చినట్లు అవుతున్నది.

కేంద్ర హోం మంత్రితో జగన్ సమావేశం అంతరంగికంగా జరిగింది. అంటే, వారిద్దరు తప్ప మరొకరు లోపల లేరు. ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు బయటకు రావాలంటే వారిద్దరు మాత్రమే చెప్పాలి. ఇద్దరికీ మీడియా లీకులు ఇచ్చే అలవాటు లేదు. అందువల్ల లోపల ఏమి జరిగింది అనేది చిదంబర రహస్యం.

కానీ టీవీ ఛానళ్లు,  పత్రికలు మాత్రం రకరకాల వార్తలు ప్రచారంలో పెడుతున్నాయి. బెయిల్ రద్దు, రఘురామపై పోలీసు హింస అంశాలే ప్రధానంగా చర్చలు జరిగాయని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా వైకాపా నేతలకు బేజారెత్తించే ప్రచారం. దాన్ని ఎట్లా తిప్పి కొట్టాలో వారికి అర్ధం కావడం లేదు.

తన ఢిల్లీ పర్యటనలో పారదర్శకత పాటిస్తే, పర్యటన వివరాలు, కలయికలు, సమావేశాల గురించి ముఖ్యమంత్రి కార్యాలయమే ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే, ఇటువంటి పుకార్లకు అవకాశం వుండదు.

 

(ఈ వ్యాసం మొ జమీన్ రైతు సౌజన్యంతో)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *