2021లో రు.3 లక్షల కోట్లు పెరిగిన అదానీ ఆస్తి… అంతు బట్టని రహస్యం

జ్వాలాద్వీప రహస్యం(1965) సినిమాలో మాంత్రికుడు శక్తి ఆరాధన చేసి సర్వశక్తి సంపన్నుడవుతాడు. అపుడు మరొక మాంత్రికుడితో పోటీ వస్తుంది. ఏదీ నీ శక్తి నుపయోగించి ఒక ఇంద్రభవనం సృష్టించు అంటాడు. మాంత్రికుడు జైమాతా  అంటూనే ఇంధ్ర భవనం వస్తుంది. ఇంద్రుని సృష్టించు అంటాడు. అపైన అప్సరసలను సృష్టించు అంటాడు. మాంత్రికుడు క్షణంలో  మొత్తం సృష్టిస్తాడు. ఇలాంటి అల్లావుద్దీన్ తన అద్భత దీపంతో ప్యాలెస్ సృష్టించుకుంటాడు. ఇది కథా కల్పన మాత్రమే. భూమ్మీద ఇలాంటి కనిపించవు.  కాకపోతే, అపుడపుడు దుబాయ్ లో ఏడుకోట్ల జాక్ పాట్ కొట్టిన కేరళ క్యాబ్ డ్రైవర్ అని వార్తలు చూస్తుంటాం. ఇది అల్ప విషయం.  ఆతర్వాత వారెన్ బఫెట్ , రాకేశ్ ఝున్ ఝున్ వాలా వంటి సంపన్నలు వేలకోట్ల ఆస్తులు సంపాదించిన విజయగాధలు వినిపిస్తుంటారు. దానికి దశబ్దాల శ్రమ, మేధస్సు ఉన్నాయి. అలాకాకుండా ఒక్క ఏడాదిలో మూడులక్షలకోట్లు సంపద పెంచుకున్న కథలుంటాయి. సాధారణంగా ఇంత డబ్బు ప్రింటు చేయాలంటే రిజర్వు బ్యాంక్ నాసిక్ సెక్యూరిటీ ప్రెస్  24 గంటలు పనిచేసినా  ఏడాది కాలం కంటే ఎక్కువ కాలం పడుతుంది. రాకెట్ వేగంతో విశ్వ విఖ్యాత బిలియనీశ్వరుడు కావడంలో అదాని చివరకు ఇలాన్ మస్క్, జెఫ్ బెజోస్ లను కూడా తలదన్నేశాడు.

మొత్తం ప్రపంచంలో ఒకే  ఒక్క వ్యక్తి ఒక్క ఏడాదిలో రు. 3.14 లక్షల కోట్ల సంపద సృష్టించారు. ఆయన భారతీయుడు కావడం విశేషం. ఆయన పేరే గౌతమ్ అదాని.

దేశంలో ప్రజలంతా కరోనా పాండెమిక్, లాక్ డౌన్, ఆర్థిక మాంద్యం వంటి ఖాయిలా భాషా  మాట్లాడుకుంటూన్నపుడు, వ్యాక్సినో మొదటి డోస్ కోసమో, రెండో డోస్ కోసమో పడిగాపులు కాస్తున్నపుడు, రెమ్డిసివివ్, టొసిలి జుమాబ్ వంటి ఇంజక్షన్ల కోసం, ఆక్సిజన్ సిలిండర్  కోసం నానా ఆగచాట్లు పడుతున్నపుడు గౌతమ్ ఇంట్లో డబ్బుల వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే ఉంది.

ఆయన కంపెనీల స్టాక్ విలువ  పెరిగి పెరిగి హిమాలయాలంత ఎత్తుకెదిగింది. దీనితో కేవలం ఈ ఏడాదిలో నే ఆయనకు సంపద  రు. 3.14 లక్షల కోట్లు అంటే  43 బిలియన్ డాలర్లు పెరిగింది. దీనితో ఆయన హోదా  2021లో ఆసియాలోనే రెండో సంపన్నుడి స్థాయికి పెరిగింది. మొదటి స్థానం ముఖేష్ అంబానీది.

అదాని మొత్తం సంపద విలువ  రు, 5.6లక్షల  ( 76.7 బలియన్ డాలర్లు)కోట్లకు చేరుకుంది. ఆయనకున్న కంపెనీలలో ఒకటైన అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ లో సంపద  330 శాతం పెరిగింది. అదాని కంపెనీలన్నింటికి పెద్దన్న  అదాని ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంపద 235  శాతం పెరిగింది. అదాని ట్రాన్స్ మిషన్ అనే మరొక కంపెనీ  సంపద 263 శాతం పెరిగింది. ఇదంతా  ఈ జూన్ 10 తేదీ నాటి అంటే నేటి లెక్క. ఇది చాలా సాధారణ మైండ్ కు అర్థం కాని లెక్క. ఎందుకంటే, ఇదే కాలంలో భారతదేశంలో అగ్రశ్రేణి  కి చెందిన 19 కంపెనీల ఉమ్మడి సంపద పెరిగింది కేవలం 24.5  బిలియన్ డాలర్లే.  కాన్ని ఒక్క అదాని గ్రోతే  35.2 బిలియన్ డాలర్లు.

తమాషా ఏంటంటే ఆయన కంపెనీలలో పెట్టుబడిలు పెట్టిన కంపెనీలన్నీ మారిషస్ కంపెనీలు. అదానీ మీద బాగా బాగా బాగా గురి ఉన్న అయిదు కంపెనీలు తమ సంపదలో 95 శాతం అదానీ కంపెనీల్లో ఇన్వెస్టు చేశాయి.ఆశ్చర్యం.

అదాని కంపెనీలలో భారత దేశ ఇన్వెస్టర్లు బాగా తక్కువ. ఇలా  ఆదానీ గ్రూపు బాగా ఏపుగా పెరిగిపోతన్నా ఆ కంపెనీల మీద స్వదేశీ ఇన్వెస్టర్లకు నమ్మకం ఎందుకు కుదరడం లేదో అర్థం కాదు.

మారిషస్ కు చెందిన ఇలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (Elara India Opportunities Fund), ఎపమ్స్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్,  (Apms Investment Fund), క్రెస్టా ఫండ్ (Cresta Fund), ఎల్బులా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(Albula Investment Fund), ఎల్టీఎస్ ఇన్వెస్టు మెంట్ ఫండ్ (Lts Investment Fund), ఏసియా ఇన్వెస్ట్ మెంటు కార్పొరేషన్(Asia Investment Corp)అనే కంపెనీలు తమ సంపదలో 95 శాతం అదానీ చేతుల్లో పెట్టాయి. ఈ మోజు రహస్యమేమిటో?

అదానీ సామ్రాజ్యంలో రేవుల నుంచి విద్యుత్ దాకా కంపెనీలున్నాయి.   అదానీ కంపెనీల షేర్లన్నీ 200 రోజులనాటి ధరలతో పోలిస్తే  150 శాతం నుంచి 200 శాతం దాకా గ్రోత్ చూపిస్తుంటాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *