అమరావతి ఎంపి పదవికి గండం, SC సర్టిఫికేట్ రద్దు చేసిన బాంబే హైకోర్టు

మహారాష్ట్ర అమరావతి (ఎస్ సి) లోక్ సభ ఎంపి నవ్ నీత్ కౌర్ రాణా పదవి పోయే ప్రమాదం ఏర్పడింది. తాను ఎస్ సి అని ఆమె ఎన్నికల సమయంలో సమర్పించిన  క్యాస్ట్ సర్టిఫికేట్ ను బాంబే హైకోర్టు కొట్టి వేసింది.

ఆమె సమర్పించిన క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లదని చెబుతూ చట్టప్రకారం అన్ని పర్యవసానాలు ఉంటాయని కోర్టు చెప్పింది.

నవ్ నీత్ కౌర్ రాణా ఇండిపెండెంటు సభ్యురాలు. ఆమె ఎన్ సిపి మద్దతుతో 2019 ఎన్నికల్లో లోక్ సభ కు ఎన్నికయ్యారు. ఆమె బోగస్ డాక్యుమెంట్లు సమర్పించి ‘మోచీ’ కులమని ఎస్ సి సర్టిఫికేట్ పొందారని, అది చెల్లదని కోర్టు పేర్కొంది.

ఆరువారాలలో తన క్యాస్ట్ సర్టిఫకేట్ ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది.

అంతేకాదు, ఇలా ఫ్రాండ్ జరిపినందుకు కోర్టు ఆమెకు 2 లక్షల కోర్టు ఖర్చు  కూడా విధించింది. ఈ మొత్తాన్ని ఆమె  రెండు వారాలలోపు మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ అధారిటీకి చెల్లించాలని జస్టిస్ ఆర్ డి ధనుకా, జస్టిస్ విజి బిస్త్ ల డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె తప్పుడు  ఎస్ సి సర్టిఫికేట్ సమర్పించారని, ఈ బోగస్ సర్టిఫికేట్ ద్వారానే ఆమె రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత పొందారని కోర్టు వ్యాఖ్యానించింది.

క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తున్నట్లు, అది స్వాధీనం చేసుకున్నట్లు భావించాలని కోర్టు పేర్కొంది.

ఆమె లోక్ సభ సభ్యత్వం ఎమవుతుందో స్పష్టం చేయకపోయినా, ఎస్ సి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దయినందున,దానికి ప్రకారం పర్యవసానాలు చట్ట ప్రకారం ఉంటాయని కోర్టు పేర్కొంది.

నవ్నీత్ రాణా సర్టిఫికేట్ బోగస్ అని దానిని రద్దు చేయాలని  అనంద్ రావు అడ్సూలే అనే సోషల్ వర్కర్ వేసిన పిటిషన్ మీద  కోర్టు  ఈ తీర్పు ఇచ్చింది.

రాణ  మోచి అనే ఎస్ సి కులానికి చెందిన వ్యక్తి అని ధృవీకరించే ఈ సర్టిఫికేట్ ని  2013 ఆగస్టు 30న ముంబై డిప్యూటీ కలెక్టర్  జారీ చేశారు.

దీని మీద అడ్సూలే ముంబై డిస్ట్రిక్ట్ క్యాస్ట్ సర్టిఫకేట్ స్క్రుటినీ కమిటీకి దరఖాస్తు చేశారు. అయితే, ఈ కమిటీ రాణాకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది.  హైకోర్టు కమిటీ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *