ఆంధ్ర ప్రదేశ్ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసన దీక్ష చేపట్టింది.
రాజమండ్రి నుంచి జరిగిన నిరసన దీక్షలో పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు, ముఖ్యనాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘భరోసాల పరిపాలన’ను విమర్శించారు.
‘పాలన అంటే కానుకల్లా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పెద్దపెద్ద ప్రకటనలతో భరోసాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. భరోసాలతో పాలన సాగదు. పాలన అంటే కానుకలు కాదు. రైతును రక్షించాలి. వైద్యాన్ని, విద్యను సరిగా అందించాలి. ఈ ప్రభుత్వం వ్యాపారులు, మిల్లర్లతో లాలూచీ పడింది. నిజమైన పాలన ఎలా ఉంటుందనేది భాజపా చూపిస్తుంది. ముఖ్యమంత్రికి భాజపా పరిపాలన నేర్పాలనుకుంటుంది,’ అని సోము వీర్రాజు అన్నారు.
రైతులను నట్టేట ముంచారు : జీవిల్ నరసింహారావు, రాజ్యసభ సభ్యులు
“ఫాస్టర్లకు జీతాలు పెంచడానికి, వాలంటీర్లకు జీతాలు ఇవ్వడానికి నిధులుంటాయి కాని రైతులకు ఇవ్వడానికి మాత్రం నిధులుండవు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అనవసర విషయాల్లో తప్ప తనకు సంబంధించి విషయాల్లో మాట్లాడటం లేదు. కొడాలి నాని వైఫల్యంపై ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదు. వరి సేకరణకు 1,500 కేంద్రాలు పెట్టామన్నారు. అవి పని చేస్తున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. మద్దతు ధరకన్నా 30 శాతం తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ము కుంటున్నారంటే మీ ప్రభుత్వ వైఫల్యమా? లేక వ్యాపారులు, దళారులతో మీరేమైనా భాగస్వామ్యం కలిశారా అని ప్రజలు అనుమానిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కి బూతుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. బూతులు ప్రచారం చేసే మంత్రిగా ఆయన పనికొస్తారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సూక్ష్మసేద్యం పథకం కింద కేంద్ర పెద్దస్థాయిలో రాయితీలు ఇస్తోంది. కాని వాటిని రెండేళ్లుగా అమలుచేయడం లేదు.”
రైతుల వెన్నుపోటు ప్రభుత్వం : సునిల్ డియోధర్, భాజపా జాతీయకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జి.
“వైకాపా ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పొడిచింది. జగన్ రైతులకు నమ్మకం ద్రోహం చేశారు. రైతులకు న్యాయం చేస్తానని చెప్పి మోసం చేశారు. నిర్ణయించిన లక్ష్యంలో సగం ధాన్యం మాత్రమే కొని రైతులకు డబ్బు చెల్లించడం లేదు. ఆ డబ్బు ఇస్తేనే ఖరీఫ్ కు పెట్టుబడులు పెట్టుకుంటారు డ్రిప్ ఇరిగేషన్కు రూ.400 కోట్లు అవసరం. కేంద్రం 40 శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండేళ్ల నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. ఫాస్టర్లు, ఇతర వర్గాలకు ఇస్తున్నారు. రైతులకు డబ్బు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. 48 గంటల్లో రైతులకు బకాయిలు చెల్లించాలి. 7 రోజులోల మొత్తం ధాన్యం సేకరించాలి.”