ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ ప్రక్షాళన చేపట్టాలనుకుంటున్నారా?
టిఆర్ ఎస్ కు చెందిన చాలా మంది నాయకులు నిజమేనంటున్నారు. నిజానికి కెసిఆర్ మనుసులో ఏముందో ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే, కెసిఆర్ ఏ ఒక్క ఎమ్మెల్యేతో గాని, ఎంపితో గాని, మంత్రితో గాని కొద్ది సేపు మనసు విప్పి మాట్లాడటమనేది జరగదని చెబుతారు. ఆ అవసరం కూడా లేదు.
ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపిలకు ఆయన ఎపుడు చనువీయడని చెబుతారు. అందుకు ఫలానా ఎంపి ముఖ్యమంత్రి కెసిఆర్ సన్నిహితుడనో, ఆంతరంగికుడనో అనే బ్రాండ్ ఎవరికీ లేదు. కాబట్టి కెసిఆర్ మనుసులో ఏముందో టిఆర్ ఎస్ లో మరొక నరమానవుడికి తెలిసే అవకాశం లేదు.
పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులకు గ్రూపులు ఉండేవి. కొందరు మంత్రులకు, లేదా ఎమ్మెల్యేలకు, లేదా ఇతర నాయకులకు ఆయన సన్నిహితులనే పేరుండేది. వారు ముఖ్యమంత్రి చేంబర్ లోకి, నివాసంలోకి నేరుగా తలుపు తోసుకుని వెళ్లి వచ్చే వాళ్లు. ముఖ్యమంత్రి వాళ్లతో కొద్దిసేపు డిన్నర్లోనో, బ్రేక్ ఫాస్ట్ లోనో, కనీసం సాయంకాలం స్నాక్స్ తింటూనో గడిపే వారు. ఆ అదృష్టం వున్నవాళ్లని ‘ముఖ్యమంత్రి కోటరీ’ అని ముద్దుగా పిలిచే వాళ్లు.
హైదరాబాద్ లో, ఢిల్లీ చాలా కోటరీ రాజకీయాలను చాలా సామీప్యంనుంచి గమనించారు కాబట్టి కెసిఆర్ కోటరీని ప్రోత్సహించలేదు. పూర్వం తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన ప్రొఫెసర్ జైశంకర్ లాంటి వాళ్లతో సాయంకాలం కాలక్షేపం చేసే వారని చెబుతారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇలాంటి చనువు మరొకరెవరికీ ఆయన ఇవ్వడం లేదని టిఆర్ ఎస్ నేతలు చెబుతారు
దానికి తోడు తెలంగాణ ఉద్యమ సారధిగా విజయవంతమయిన నాయకుడు కాబట్టి, సరదాగా మాట్లాడుకునేందుకు కెసిఆర్ కు సమ ఉజ్జీలెవరూ లేరు.చివరకు కె కేశవరావు లాంటి వాళ్లను కూడా ఆయన ఆమడ దూరంలోనే పెట్టారు. ఉన్న వాళ్లంతా చేలాలే. చేలాలతో ఏమ్మాట్లాతారు. అందువల్ల కెసిఆర్ ది ‘ఒన్ మాన్ కోటరీ’ యే. ఆయన మనుసులో ఏముందో తెలిసే అవకాశం చాలా తక్కువ.
అయితే, ఈటెల క్యాబినెట్ నుంచి పంపించాక, ఈటెల సంపాదన, ‘భూకబ్జా’ అరోపణల మీద విచారణ మొదలుపెట్టాక, తదుపరి ఎవరూ అనే ప్రశ్న సర్వత్రా వినపడుతూ ఉంది. ఈ ప్రశ్న క్యాబినెట్ లో కొందరిని భయపెడుతూ ఉందని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. మీడియా సర్కిల్స్ దీన్నొక పెద్ద జోక్ లాగా చెప్పుకుంటున్నారు. కెసిఆర్ అరచేతిలో ఎపుడూ క్యాబినెట్ సభ్యుల జాతకాలన్నీ ఉంటాయని, సమయం చూసి టిఆర్ ఎస్ కు వ్యూహాత్మకంగా ప్రయోజనకరంగా ఉండేలా ‘ఈటెల బాణం’ వేస్తారని మీడియా వాళ్లు చెబుతున్నారు. అందుకే ఈటెల తర్వాత ఎవరు అనే ప్రశ్న మొదలయింది.
కెసిఆర్ ధోరణిని జాగ్రత్తగా గమనించిన వాళ్లు మాత్రం ఈ వ్యవహారం ఈటెలతో ముగియదని, కనీసం మరొకరో ఇద్దరో ముఖ్యమంత్రి రాడార్ లో ఉంటారని చెబుతున్నారు. అదెవరై ఉంటారు?
కొన్ని సర్కిల్స్ వినబడుతున్న దాని ప్రకారం, ఇటీవల కర్నాటక లోని హంపీలో విందుచేసుకున్న మంత్రి ఒకరు కెసిఆర్ నెక్స్ట్ టార్గెటు అని చెబుతున్నారు.
ఆ మధ్య ఈ మంత్రి తన కుమారుడి బర్త్ డే ని ఘనంగా జరిపేందుకు హంపీని ఎన్నుకున్నారు. తెలంగాణలో బర్త్ డే ఘనంగా చేస్తే ఆ వార్త బయటకు పొక్కుతుంది కాబట్టి ఆయన కర్నాటకలోని హంపీని ఎంచుకున్నారు. ఆయన తనకు ఇష్టమయిన మరికొందరు ఎమ్మెల్యేలను, టిఆర్ ఎస్ ప్రముఖలను పార్టీకి ఆహ్వానించి, ఆ చల్లని వాతావరణంలో కొద్దిసేపు రాజకీయాలు, టిఆర్ ఎస్ వ్యవహారాలు, రాష్ట్ర పాలన గురించి సరదాగా ముచ్చటించుకున్నారు. తెలంగాణకు, ప్రగతి భవన్ కు బాగా దూరంగా ఉన్నామని, తమ విందుకు ఎవరికీ కనిపించదని, తాము మాట్లాడేది ఎవరికి వినిపించదని భ్రమపడుతూ చాలా సీరియస్ విషయాలను కూడా చర్చించారట.
తెలంగాణాలో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా పాటలు పాడతారని తెలిసిందే గదా.
ఇందులో ఒక పెద్ద మనిషి ఏకంగా టిఆర్ ఎస్ రాజకీయాల మీద, పరిపాలన మీద చక్కటి పాట పాడి వినిపించనట్లు చెబుతున్నారు.
ఈటెల రాజేందర్ మీద కూడా ఈ ఇన్ ఫార్మల్ మీటింగులో చర్చ జరిగిందని చెబుతున్నారు.
అంతేకాదు, కెటిఆర్ ముఖ్యమంత్రిగా వారసత్వం తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనే ది కూడా ‘సభ’లో చర్చకు వచ్చిందట.
అయితే, హంపీలో ఉన్నామని, ఎవ్వరూ తమని చూడ్డం లేదని, వినడం లేదని, పసిగట్టడం లేదని వీళ్లనుకున్నారు.
కాని ప్రగతి భవన్ లో చాలా పవర్ ఫుల్ యాంటెనాలు ఉన్నాయి. టిఆర్ ఎస్ నేత అనేవాడు ఎక్కడ తిరిగినా, ఎవరిని కలిసినా, ఏమ్మాట్లాడినా, ఏ పాటపాడినా, డ్యాన్స్ చేసినా ఈ యాటెనాలు లైవ్ సిగ్నల్స్ అందుకుంటాయి.
హంపీ విందు చర్చలు గురించి ప్రగతి భవన్ కు క్షణ్ణంగా తెలిసిపోయిందని, తొందర్లో ఈ మంత్రిని కూడా ఈటెల బాటలో నే పంపిస్తారని వూహాగానాలు వినబడుతున్నాయి.