పాకిస్తాన్ కు, భారత్ కు చాలా విషయాల్లో సాంస్కృతిక అనుబంధం ఉంది. ముఖ్యంగా బిర్యానీ నుంచి పులావ్ దాకా పాకిస్తాన్, భారత్ లకు పెద్ద తేడా ఉండదు. కరాచీ నుంచి కలకత్తా దాకా, అక్కడి హైదరాబాద్ నుంచి ఇక్కడి హైదరాబాద్ దాకా బిర్యానీ పులావ్ లు రెండూ ఇరు దేశాలను బాగా దగ్గర చేస్తాయి.
ఇదే ఇపుడు రెండు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీస్తున్నది.
యూరోప్ లో బాస్మతి బియ్యం హక్కుల గురించి రెండు దేశాలు తగాదా బడుతున్నాయి. బాస్మతి రైస్ కు పూర్తి హక్కు భారత్ కే ఉందని బాస్మతి టైటిల్, ట్రేడ్ మార్క్ ని మరొకరెవరూ వాడేందుకు వీల్లేదని భారత దేశం దరఖాస్తు చేసింది. అయితే, దీనిని పాకిస్తాన్ వ్యతిరేకించింది. బాస్మతి బియ్యానికి భారత్ కే చెందినట్లు ప్రొటెక్టెడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్(Protected Geographical Indication: PGI) మంజూరుచేయడానికి వీల్లేదని పాకిస్తాన్ వాదిస్తున్నది. ప్రపంచంలో బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశాలు రెండే , అవి భారత్, పాకిస్తాన్ లు.
ఇది పాకిస్తాన్ బాస్మతి బియ్యం మార్కెట్ ను కాజేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నమని పాకిస్తాన్ వాదిస్తూ ఉంది. భారత్ ప్రయత్నాలతో పాకిస్తాన్ బియ్యం పరిశ్రమ దెబ్బతింటుందని ఆదేశం ఆగ్రహం.
అయితే, ఇందులో ఒక తిరకాసు ఉంది. బాస్మతి రెండు దేశాల ఉమ్మడి వారసత్వ సంపదే అయినా, పాకిస్తాన్ నిశబ్దంగా బాస్మతి బియ్యానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) టాగ్ సంపాదించింది. ఈ విషయాన్ని 2021 జనవరి 27న పాకిస్తాన్ కామర్స్ అడ్వయిజర్ అబ్దుల్ రజాక్ దావూద్ ప్రకటించారు.
I am glad to inform that Pakistan has registered Basmati Rice as Geographical Indication (GI) under Geographical Indications Act 2020. Under this Act, a GI registry has been formed which will register GIs and maintain the basic record of proprietors & authorised users of GI. 1/2 pic.twitter.com/lqBJVlPSMJ
— Abdul Razak Dawood (@razak_dawood) January 27, 2021
పాకిస్తాన్ ఇలా జిఐ ఇండికేషన్ సంపాయించినందుకే భారత్ ఇపుడు PGI కు దరఖాస్తు చేసింది. నిజానికి 2020లో భారతదేశానికి ఎక్స్ క్లూజివ్ GI టాగ్ ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ (Council on Quality Schemes for Agricultural and Foodstuffs)కు దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ 2020 సెప్టెంబర్ 11నే వెల్లడించింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ డిసెంబర్ 7న ఫిర్యాదు (Notice of Opposition) చేసింది.
ఇండియా పాకిస్తాన్ ల మధ్య 1947 నుంచి వైరం ఉంది. యుద్ధాలు జరిగాయి.వైమానిక దాడులు జరిగాయి. ఇపుడు తొలిసారి బాస్మతి జగడం నడుస్తూ ఉంది.
ఇండియాలో బాస్మతి బియ్యాన్ని జమ్ము, కాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగడ్, ఢిలీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, ఉత్తర ప్రదేశ్ లలో పండిస్తారు. 2010 మే లో ఈ రాష్రాల తరఫున APEDA (Agricultural and Processed Products Export Development Authority)కు బాస్మతి జిఐ టాగ్ వచ్చింది.
పాకిస్తాన్ లో కాలర్ బౌల్ (Kalar Bowl)ప్రాంతంలో బాస్మతి వరి పండిస్తారు. ఇది రావి,చీనాబ్ నదుల మధ్య ఉంటుంది.
సంప్రాదాయికంగా భారత్ లో బాస్మతి పండించే ఇండోగంగా మైదాన ప్రాంతాలకు ఈ మధ్య మధ్య ప్రదేశ్ రాష్ట్రం కూడా తోడయింది. బాస్మతి రైస్ తమ రాష్ట్రంలో కూడా పండిస్తున్నారని, తమ రాష్ట్రానికి కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ టాగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ కోరారు.
తాము హై క్వాలిటీ బాస్మతి బియ్యాన్ని అమెరికా, కెనడాలకు ఎగుమతి చేస్తున్నామని, మధ్య ప్రదేశ్ లోని 13 జిల్లల్లో బాస్మతి పండిస్తున్నారని చెబుతూ తమకు జిఐ టాగ్ ఇవ్వాలని ఆయన కోరారు. మధ్య ప్రదేశ్ ఇండో గాంజెటిక్ మైదాన ప్రాంతంలో లేదని, ఈ రాష్ట్రానికి సుదీర్ఘమయిన బాస్మతి చరిత్ర లేదని చెబుతూ జిఐ టాగ్ ఇవ్వడానికి వీలు కాదని ఎపెడా (APEDA) వాదిస్తూ ఉంది. అయితే, ఇండో గాంజెటిక్ మైదాన ప్రాంతాలలో పండించే బాస్మతికి మధ్య ప్రదేశ్ బాస్మతి బియ్యం ఏ మాత్రం తీసిపోవు కాబట్టి తమని కూడా బాస్మతి క్లబ్ లో చేర్చాలనేది ఈ రాష్ట్రం వాదన.
ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. కోర్టు మధ్య ప్రదేశ్ వాదనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.
మధ్య ప్రదేశ్ జిఐ టాగ్ కోరడంతో పాకిస్తాన్ అప్రమత్తమయి యూరోపియన్ లో జిఐ టాగ్ పొందేందుకు ప్రయత్నించి విజయవంతమయింది.
గత మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్ యూరోపియన్ కు బాస్మతి బియ్యం ఎగుమతులను పెంచింది. యూరోపియన్ లో ఏడాది మూడు లక్షల టన్నుల డిమాండ్ ఉంది. ఇందులో మూడింట రెండొంతుల బియ్యం పాకిస్తాన్ ఎగుమతి చేస్తూ ఉంది.
బాస్మతి మధ్య రెండు దేశాలు గొడవ పడవద్దని భావించే వాళ్లు, రెండు దేశాలు ఉమ్మడి దరఖాస్తు చేసుకోవచ్చని కొందరు సూచిస్తున్నారు. రెండు దేశాలు రాజీ పడతాయో, న్యాయపోరాటంలో ఇరక్కు పోతాయో చూడాలి.