తిరుమల అడవిలో జాపాలి తీర్థానికి ట్రెక్

(భూమన్)

జాపాలి తీర్థం తిరుమలకు 5 కిమీ దూరాన ఉండే అద్భతమయిన ప్రదేశం. అక్కడ ప్రతి యేడాది హనుమజ్జయంతి బాగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కుతూహలం కొద్ది ఈ సారి జాపాలి తీర్థం మళ్లీ వెళ్లాలనుకున్నాం.

అయిదారు మంది మిత్రులం కలసి ‘బ్రీఫ్ ట్రెక్’ అనుకుని బయలుదేరాం. ఆకాశగంగ దగ్గిర అంజనాద్రి దేవాలయం ఉంది. దానిని జాపాలి తీర్థాన్ని కలిపి అంజనాద్రి పర్వతం అంటారు.

అంజనాద్రి ఈ మధ్య వార్తలకెక్కింది. ఈ అంజనాద్రియే హనుమంతుని జన్మస్థానమని, ఇక్కడే ఆయన జన్మించారని ఈ మధ్య టిటిడి ప్రచారం చేయడంతో అంజనాద్రి సంచలన  వార్త అయింది.

ఈ వార్తల అనంతరం జూన్ 4 న టిటిడి ఇక్కడ హనుమజ్జయంతి జరుపుతున్నందున, ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఇపుడే  ఒక సారి చూసొద్దామని మేం బయలుదేరాం.

ఇది చాలా అందమయన, ఆహ్లాదరకరమయిన ప్రదేశం. వేదిక్ పాఠశాల సమీపంలోని లోయలో దిగి వెళితే, జాపాలి తీర్థానికి  15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

తిరుమలలో బాటగంగమ్మ గుడి ఉంది. అక్కడి నుంచి జాపాలికి మంచి దారి ఉంది. ఇది పాత తిరుమల దారి.

ఇపుడు రింగ్ రోడ్ రావడం వల్ల అది బ్లాక్ అయింది. స్థానికులకు తప్ప దీని గురించి ఇతరులకు తెలియదు. పాపనాశం పోయే దారి నుంచి టిటిడి వారు ఒక సిమెంట్ మెట్లదారి వేశారు. ఇపుడు చాలా మంది జాపాలికి సిమెంట్ మెట్ల దారిగుండానే వెళ్తుంటారు.

మేం మొదట ఆకాశ గంగను చేరుకున్నాం. అక్కడి నుంచి అంజనాద్రి పర్వతం అంజనాద్రి గుడి చేరుకున్నాం.

ఇక్కడే హనుమంతుని తల్లి పన్నెండేళ్లు తపస్సుచేసి ఆంజనేయుడిని కన్నదని చెబుతారు. ఇక్కడ ఆకాశ గంగ నీళ్లు ఎపుడూ పారుతూ ఉంటాయి. ఎక్కడ నుంచి వస్తాయో గాని, ఎండాకాలంలో కూడా నీళ్ల కరువు ఉండదు.

ఈ నీళ్లతోనే వేంకటేశ్వరస్వామికి అభిషేకం చేయాలనే సంప్రదాయం నంది భక్తుడు మొదలుపెట్టాడు. ఇప్పటికీ ఇదే సంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇద్దరు పురోహితులు తెల్లవారుజామున అయిదు కిలో మీటర్ల దూరాన ఉన్న ఈ ఆకాశ గంగకు వచ్చి అభిషేకానికి నీళ్లు తీసుకువెళతారు. వాళ్లు ఇప్పటికీ పాత దారిలోనే వచ్చిపోతుంటారు.

ఇదలా ఉంచితే, అంజనాద్రి, జాపాలి తీర్థం ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులు  బాగా ఇష్టపడే సుందరమయిన అటవీ ప్రాంతాలు. జాపాలి తీర్థంలో ఒక కొనేరు ఉంది.బ్రహ్మాండమయిన వృక్షాలు, చెట్లు,పొదలు,పూలు కనిపిస్తాయి.

జాపాలి దారిలో కనిపించే అరుదైన కోడిగుడ్డు పువ్వు

అనేక అరుదైన జంతువులు ఇక్కడ మనకు కనబడతాయి. మనకు పక్కనే ఉన్న ఇంత అందమయిన ప్రదేశాలను కాదని ఎక్కడిక్కడికో వెళ్తుంటాం.  తిరుమల నుంచి అయిదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే అందమయిన ప్రకృతితోపాటు, ఆకాశగంగ ప్రాజక్టును చూడవచ్చు.జాపాలి తీర్థం సందర్శించవచ్చు.

మేము నిన్న జాపాలి తీర్థానికి ఉన్న నాలుగు దారులనూ కలియ తిరిగాం. వేదిక్  పాఠశాల పక్క లోయలో నుంచి ఉన్నదారి, ఆకాశం గంగ పక్కనుంచి ఉన్న దారి, పాత మెట్ల దారి, బాటగంగమ్మ దారి  అన్నీ చుట్టేశాం. వేదిక్ పాఠశాలనుంచి వస్తున్నపుడు ధృవ తీర్థం అనే మరొక తీర్థం  కనిపించింది. ఇక్కడ కూడా ఆకాశ గంగలో మాదిరే  కొండల మధ్య నుంచి నీళ్లు నిరంతరం వస్తూ ఉంటాయి. ఇక్కడొక విచిత్రం  చూశాం.

ఇక్కడి నీళ్లను కరెంటు సాయం లేకుండా కేవలం పైపుల ద్వారా ఒక కిలో మీటర్ దాకా జాపాలి తీర్థం వాళ్లు తీసుకువెళ్లే ఏర్పాటు అద్భుతంగా చేశారు. జాపాలి తీర్థం హథీరాం మఠం ఆధ్వర్యంలో  ఉంది. ఈ దట్టమయిన అడవిలోచిరుతల,పాముల సంచారం మధ్య కొందరు ఉత్తరాది పూజారులు చాలా కాలంగా నివసిస్తున్నారు.  ఇది అందమయిన ప్రదేశం. ముందు మందు ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఆంజనా దేవిఆలయం రాబోతున్నది. ఈ నిర్మాణలు వచ్చి, జనసంచారం ఎక్కువయిన ఇక్కడి అటవీ ప్రశాంతత భగ్నమయ్యే అవకాశం ఉంది. అందుకే  ఇపుడే ఒక సారి చూసి వద్దామని నిన్న వెళ్లాం.(ఫోటోలు కొన్ని గత ట్రెక్ నాటివి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *