నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని ఎందుకు కాపాడుకోవాలంటే…

రాయలసీమ ప్రజలు, రైతాంగానికే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలకు ఆ మాటకొస్తే భారత ప్రజలందరికి  “నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం” (RARS) విశిష్టతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ పరిశోధన సంస్థకు చెందిన భూముల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల  నిర్మిస్తున్నది. నిజానికి నంద్యాల చుట్టూర ఎంతో భూమి ఉంది. అయినా సరే ప్రభుత్వం ఒక పరిశోధనా సంస్థకు చెందిన పచ్చని భూమిని ఎంపిక చేసింది. ఈ భూములు ఇలా  మెడికల్ కాలేజీకి వెళ్లిపోతే, రేపు పరిశోధనా సంస్థ ఉనికి కే ముప్పు రావచ్చు. ఈ నేపథ్యంలో  ప్రజలకు  నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం” గురించి ‘రాయలసీమ సాగునీటి సాధన సమితి’ విడుదల చేసిన అవగాహనా పత్రం.

1.. నవ నందుల నిలయమైన నంద్యాల పట్టణంలో 115 సంవత్సరాల క్రితం వెలసిన ఆధునిక దేవాలయం నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం.

2.. నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానము 1906 సంవత్సరంలో ప్రత్తి పరిశోధనా స్థానముగా ఏర్పాటు అయ్యింది. భారత దేశ స్వాతంత్ర్యం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు అయ్యింది.

3.. ఈ పరిశోధన స్థానం గత 115 సంవత్సరాల కాలంలో ప్రత్తి పరిశోధనా స్థానంగా, అత్యల్ప వర్షపాత మండల (కర్నూలు, అనంతపురము జిల్లాలకు) పరిశోధన స్థానంగా, ప్రాంతీయ పరిశోధనా స్థానంగా రూపాంతరం చెంది మానవాళికి ఎనలేని సేవ చేస్తున్నది.

4.. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన పంట రకాల పరిశోధనా ఫలితాలను ఈ కేంద్రం రూపొందించింది.

5.. ఈ పరిశోధనా స్థానము కృషితో అభివృద్ధి చేసిన పత్తి :- నరసింహ, HYPS 152 రకాలు, వరి :- నంద్యాల సోనా రకం, జొన్న:- తెల్లజొన్న – 1,2,3 పచ్చ జొన్న – 13, 14, 15 రకాలు, శనగ:- NEBG – 47, 49, 119 రకాలు, కొర్ర:- నరసింహరాయ, సూర్యానంది, ఎస్.ఐ.ఏ. – 3156 రకాలు, పొగాకు:- నాటు పొగాకు – 1 రకం, తదితర రకాలు రైతులు అభివృద్ధికి తోడ్పడంతోపాటు జాతీయ అవసారాలకు కావాల్సిన వ్యవసాయ ఉత్పాదన సాధనలో అత్యుంత కీలకమైన పాత్ర వహించాయి.

6.. అధిక దిగుబడి పంట రకాలతో పాటు ఉత్తమ యాజమాన్యం, పురుగు మరియు తెగులును తట్టుకొనే నూతన సాంకేతికత విధానాలను ఈ పరిశోధనా స్థానం అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నది. దీని ద్వారా రైతుకు పంట సాగులో వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చును తగ్గించి లాభసాటి వ్యవసాయము వైపు దిశా నిర్ధేశం చేస్తున్నది.

7.. రాష్ట్రములోనే మొట్టమొదటి సారి నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానము నందు మధ్యస్థకాలిక విత్తన బీజనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని పంటల బీజ భద్రత చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు విత్తన రక్షణ కేంద్రముగా అభివృద్ధి జరుగుతున్నది. ‌.

8.. వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాలలో ఉండుట వలన ఈ ప్రాంతం విత్తన ఉత్పత్తి దారులకు మార్గదర్శకంగా మారింది. అదేవిధంగా నైపుణ్యము ఉన్న విత్తనోత్పత్తి రైతులు మరియు గ్రామాలు అభివృద్ధి చెందాయి. దీనితో ఈ ప్రాంతం విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందటంతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు, అనేక ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి దోహదం పడుతున్నది.

RARS భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు కేటాయించిన భూములకు బదులుగా నూతన స్థానంలో కేటాయించిన భూములలో వ్యవసాయ పరిశోధనా స్థానం ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి జరిగే నష్టం పై, ఈ నష్ట నివారణకు ఉన్న మార్గాలపై కూడా రాయలసీమ ప్రజానీకానికి అవగాహనకై క్రింద సంక్షిప్త సమాచారం పొందపర్చడమైనది‌.

వ్యవసాయ రంగానికి జరిగే నష్టాలు :-

1.. నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానంను వేరొక ప్రాంతానికి మార్చడం వలన పరిశోధనలకు కొనసాగింపులో అంతరాయం వలన నూతన విత్తానాల అభివృద్ధికి తీవ్ర విఘాతం జరుగుతుంది.

2.. పరిశోధనా స్థానంను ఇంకొక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే మౌళిక వసతుల కల్పనకు చాలా సంవత్సరాల సమయం పట్టడంతో విత్తన పరిశోధన అభివృద్ధిలో తిరిగి కోలుకోలేని నష్టం జరుగుతుంది.

3.. పరిశోధనా స్థానంను ఇంకొక ప్రదేశంలో ఏర్పాటు చేయాలనుకుంటే మౌళిక వసతుల ఏర్పాటుకు, భూమిని పరిశోధనలకు అనుకూలంగా అభివృద్ధి చేసుకొనడానికి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ప్రజా ధనం దుర్వినియోగం చేయడం ఏ మాత్రం తగదు మరియు రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఇది వాంఛనీయం కాదు.

4.. వ్యవసాయ పరిశోధనలలో అంతరాయం వలన రైతులు విత్తనాలకై బహుళజాతి విదేశీ సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో ఎక్కువ ధరలకు విత్తనాలు కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.‌

5.. మన నేల, మన విత్తనం, మన రైతన్నల కృషి తో దేశం ఆహారభద్రత సాదించింది. దీనితో అంతర్జాతీయ ఒత్తిడులకు లోను కాకుండా, స్వతంత్ర నిర్ణయాలతో మన దేశం అణుశక్తిని అభివృద్ధి చేసుకోగలిగింది. విత్తన పరిశోధన స్థానాలను నిర్వీర్యం చేస్తే నూతన విత్తనాల అభివృద్ధి జరగక, విత్తనాలకై విదేశీ బహుళజాతి సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మన దేశ ఆహార భద్రతకు, మన దేశం అంతర్జాతీయ ఒత్తిడులకు వ్యతిరేకంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనడానికి ప్రతిబంధకం అవుతుంది‌‌.

 

బొజ్జా దశరథరామిరెడ్డి,
అధ్యక్షులు,
రాయలసీమ సాగునీటి సాధన సమితి.

నష్ట నివారణ మార్గాలు :-

1.. వైద్య కళాశాల ఏర్పాటుకు నంద్యాల ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న భూములు వినియోగించుకునే అవకాశం ఉంది.

2.. నంద్యాల ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు లేవనుకున్నా, పరిశోధనా స్థానం ఇంకొక ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో వైద్య కళాశాలకు అవసరమైన భూములను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది‌.

3.. 30 కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసి ఆదోని లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్న విధంగానే, నంద్యాలలో భూములు కొనుగోలు చేసి వైద్య కళాశాల ఏర్పాటుకు అవకాశం ఉంది.‌

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *