* అటవీ సంరక్షణ చట్టాల అమలు నామమాత్రమే
(సత్య బొలిశెట్టి)
పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత… కానీ నేడు ఆ ప్రభుత్వాల బారి నుంచే పర్యావరణాన్ని పరిరక్షించుకునే పరిస్థితులు దాపురించడం మన దురదృష్టమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సత్య బొలిశెట్టి పేర్కొన్నారు.
పర్యావరణ చట్టాలను పక్కాగా అమలు చేసే అధికారులు, అర్ధం చేసుకునే ప్రజలు ఉన్నప్పుడు మాత్రమే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.
ప్రజాప్రతినిధులుగా గెలిచిన ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుంటే.. ఏడాదికోసారి ఇలా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం ‘మన నుడి – మన నది’ విభాగం నుంచి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక వెబినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్య బొలిశెట్టి మాట్లాడుతూ “గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది.
మానవుడు విచక్షణారహితంగా సహజ వనరులను కలుషితం చేయడం వల్ల భూతాపం పెరిగి పర్యావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. తద్వారా జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మనిషి సృష్టిస్తున్న కాలుష్యం వల్ల ప్రతి ఏడాది దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల జీవజాతులు అంతరించిపోతున్నాయి.
మరో 10 లక్షల జీవరాశులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని 2019లో యునైటెడ్ నేషన్స్ తన రిపోర్టులో పేర్కొంది. పర్యావరణ విధ్వంసమే కరోనాకు కారణమని ఇటీవల ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా చెప్పిన విషయం మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి.
లెక్కలన్నీ కాగితాలకే పరిమితం
అడవుల సంరక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. అయితే చట్టాలు అమలు మాత్రం అంతంత మాత్రంగానే చేపట్టడంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయాయి. 2003 సంవత్సరంలో నేషనల్ ఫారెస్టు కమిషన్ అని పెట్టి 20 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దీని కోసం దాదాపు రూ. 20 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించాయి. అయితే ఆ లెక్కలన్నీ కాగితాలకే పరిమితం కావడంతో అడవులు ఎక్కడా పెరిగిన దాఖలాలు కనిపించలేదు. గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొస్తే తప్ప పర్యవరణ పరిరక్షణ సాధ్యం కాదు.
నదులను ఎలా ఆక్రమించాలి, సహజ సంపదైన ఇసుకను ఎలా దోచుకోవాలి, గనులను ఎలా కొల్లగొట్టాలనే రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు తప్ప. సహజ వనరులను భవిష్యత్తు తరాల కోసం కాపాడాలన్న స్పృహ ఉన్న ఒక్క నాయకుడు కూడా ఆసియా మొత్తం మీద నాకు కనిపించలేదు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే.
అందుకే పార్టీ సిద్ధాంతాలలో పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి ప్రస్థానం అని పెట్టారు. అలాగే మన నుడి మన నది అనే బృహత్తర కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి సహజ వనరుల దోపిడిపై జనసేన మన నుడి మన నది విభాగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా మహమ్మారి శాంతించాక వీటిపై పార్టీ దృష్టి సారిస్తుంది” అన్నారు.
(సత్య బొలిశెట్టి , పర్యావరణ ఉద్యమకారుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి)