మేజీషియన్ గౌతమ్ గా బహుళ ప్రాచుర్యం పొందిన ఇఫ్టూ ఉద్యమకారుడు కామ్రoడ్ గురునాయుడు మృతికి
(ఇఫ్టూ ప్రసాద్ పిపి)
ఇఫ్టూ (IFTU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పొలారి అన్నయ్య గౌతమ్ విజయవాడ లో సుందరయ్య నగర్ లోని తన ఇంటివద్ద శుక్రవారం మరణించాడు.
గౌతమ్ ఏలూరు జూట్ మిల్ వర్కర్ గా పనిచేస్తూ 40ఏళ్ల క్రితం 1981 మే నెలలో ఇఫ్టూకి ఆకర్షితుడయ్యాడు. ఏలూరు లో ఇఫ్టూ లో చురుగ్గా పాల్గొనే వాడు. కుటుంబ కారణాల వల్ల ఆ తర్వాత విజయవాడ కి షిఫ్ట్ అయ్యాడు. జూట్ వర్కర్ గా, హోటల్ వర్కర్ గా, రిక్షా వర్కర్ గా, ఆటో వర్కర్ గా వివిధ శ్రమ వృత్తుల్లో పనిచేశాడు. ఏ పని చేయడానికి బేషజం ఉండేది కాదు. శ్రమ సంస్కృతి ఆయన ప్రవృత్తిగా ఉండేది.
విజయవాడ లోని మనోరమ హోటల్ లో రూమ్ బాయ్ (హోటల్ వర్కర్) గా పనిచేసే కాలంలో హోటల్ లో దిగిన వృత్తిపరమైన ఒక మేజీషియన్ తో 1980 వ దశాబ్దం చివరలో స్నేహం ఏర్పడింది. ఆయన వద్ద ఆ వృత్తిని నేర్చుకున్నాడు. అదే వృత్తిని మూఢనమ్మకాల వ్యతిరేక హేతువాద ప్రచార లక్ష్యానికి సద్వినియోగం చేసాడు. బెంగుళూర్, చెన్నై, ముంబై వంటి చోట్ల ప్రదర్శనలు ఇచ్చి విశేష ఆదరణ పొందాడు. ఆ వృత్తిని హేతువాద చైతన్యం కలిగించేందుకు సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాజకీయ ప్రచార కర్తవ్యాన్ని చేపట్టాడు.
సుమారు నాలుగేళ్ళ క్రితం పక్షవాతం వచ్చింది. ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు మరణించాడు.
గౌతమ్ అసలు పేరు గురునాయుడు. ఇఫ్టూతో పాటు సీపీఐ ఎమ్.ఎల్. విప్లవ రాజకీయ నిర్మాణంలో కూడా పనిచేసాడు. అలా పని చేసే క్రమంలో గౌతమ్ గా పేరు మార్చుకున్నాడు. నేటికీ ఏలూరులో జూట్ కార్మికులు, బాల్య స్నేహితులు ఆయన్ని గురునాయుడుగానే ప్రేమతో పిలుస్తారు.
కామ్రడ్ గౌతమ్ కుటుంబం 80వ దశాబ్దంలో విజయవాడ కి షిఫ్ట్ అయ్యుంది. తరువాత విజయవాడ లో కూడా ఇఫ్టూ సంస్థ ప్రారంభకుల్లో ఒకడిగా మంచి పాత్రను పోషించాడు. ఆటో వర్కర్ గా ఆటో యూనియన్ స్థాపక పాత్రను పోషించాడు. గౌతమ్ భార్య దుర్గ POW రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, విజయవాడ నగర కమిటీ అధ్యక్షురాలు కూడా!
గౌతమ్ చిన్న తమ్ముడు రమణ ఇఫ్టూ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప.గో. జిల్లా ఇఫ్టూ అధ్యక్షుడు. ఏకైక చెల్లెలు పైడి తల్లి భర్త నూకరాజు కూడా ఏలూరు జూట్ మిలు వర్కర్ గా ఇఫ్టూ కార్యకర్తయే! గౌతమ్ తల్లి అదెమ్మ గారు, తండ్రి అప్పల నాయుడు గారు కూడా ఏలూరు జూట్ మిల్ కార్మికులే!
గౌతమ్ కు అరుణ్, భాస్కర్, అనిల్ ముగ్గురు కొడుకులు, జ్యోతి, శకుంతల, భారతి కోడళ్ళు వున్నారు. అందరూ ప్రజా ఉద్యమాల పట్ల సానుభూతి పరులే!
వీరిది పూర్వం విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం. జీవన పోషణ కోసం వీరి తండ్రి బాల్యంలో ఏలూరు వచ్చి జూట్ మిల్ లో కార్మికులుగా చేరారు. వీరి కుటుంబం మూడు తరాలుగా శ్రమ పునాది కలిగి వుండటం గమనార్హం. ఈ శ్రమజీవుల కుటుంబీకుడైన పొలారి నేడు ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా, జాతీయ కమిటీ సభ్యుని గా, సీపీఐ ఎం.ఎల్. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేతగా ఎదగడం విశేషం!
మేజీషియన్ గా పేరొందిన గౌతమ్ మూఢనమ్మకాలకు వ్యతిరేక ప్రచారకునిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సుపరిచితుడు. ఇళ్ళెందు నియోజకవర్గ ఎన్నికలలో సీపీఐ ఎం.ఎల్. పార్టీ అభ్యర్థి గుమ్మడి నర్సయ్య గారి తరపున రెండు లేదా మూడుసార్లు మేజీషియన్ రూపంలో ప్రచారకునిగా వారాల తరబడి పాల్గొన్నాడు. ఊరూరూ తిరిగిన నేపధ్యం ఉంది. నెల్లిమర్ల కార్మికోద్యమ కాలంలో కూడా ఇదే పాత్రను పోషించారు. ఇంకా ఇలా ఎన్నో, ఎన్నెన్నో! కామ్రేడ్ గౌతమ్ అమర్ రహే!