‘భంగపడిన రోజే బయటకు రావలసి ఉండింది”

ఆత్మగౌరవం నినాదము కాకూడదు, భంగపడిన రోజే బయటకు వచ్చి బహుజనులకు బాసటగా నిలబడాల్సి ఉండింది.

 

( వడ్డేపల్లి మల్లేశము)

ఆత్మ గౌరవం అనేది తెలంగాణ ఉద్యమ కాలం నుండి తెరమీదికి వచ్చిన వ్యక్తి ఉనికికి సంబంధించిన గౌరవ వాచకం.

తెలంగాణకు సంబంధించిన నాలుగు ఆకాంక్షలలో చివరిగా ఆత్మగౌరవాన్ని పేర్కొన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత నే ఆత్మగౌరవం కనుమరుగు కావడం అత్యంత విషాదకరం.

అవమానాలకు, వివక్షతకు కనీస మానవ విలువలకు నోచుకోని ఎంతో మంది రాజకీయ నాయకులు ముఖ్యంగా తెరాస నుండి దాదాపుగా పది సంవత్సరాల కాలంగా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం అని బయటికి వచ్చిన సందర్భాలు అనేకం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలకు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం కోసం అంతర్గత ఆత్మ గౌరవం కోసం పార్టీలో, మంత్రివర్గంలో కుమ్ములాటలు జరుగుతుంటే నిజంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు కదా!

భంగపాటు- పదవీ వ్యామోహం:

రాజకీయ పార్టీల నిర్మాణం లో ఉన్నటువంటి అసంబద్ధత ల కారణంగా పలు రాజకీయ పార్టీలు కూడా అగ్రవర్ణాల నాయకత్వంలోనే కొనసాగడం బహుజనులు అందరూ కూడా ఓటర్లుగా, జెండాలు మోసే కార్యకర్తగానే మిగిలిపోవడం, రాజ్యాధికారానికి దూరం కావడం, చట్టసభల్లో కనిపించకపోవడం దొరికిన ఆ పదవిని కాపాడుకోవడం కోసం బహుజనుల నుండి వచ్చినటువంటి వాళ్లు తొలినాళ్ళలో అనేక అవమానాలను భంగపాటు లను ఎదుర్కొని ప్రశ్నించకుండా తలవంచుకుని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుని పదవిని కాపాడుకునే ప్రయత్నంలో కొనసాగడం విచారకరం.
కొద్దిమంది ఆత్మగౌరవాన్ని నమ్మేవాళ్ళు తొలి నుంచే నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సూచనలు చేస్తున్నప్పటికీ నాయకత్వం యొక్క నిరంకుశత్వం ,నియంతృత్వం కారణంగా తలవంచుకొని బ్రతకాల్సిన సందర్భాలు భారత దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకం.
దేశ అత్యున్నత పదవి నుండి గ్రామ వార్డు సభ్యులు వరకు కూడా తమ వృత్తి ధర్మం లో ఆధిపత్య భావజాలాన్ని అంగీకరించకూడదు. అవసరమైతే పదవిని తృణప్రాయంగా భావించి బయటికి రావాలి కానీ అంత సాహసం చేయడం లేదు కారణం పదవీ వ్యామోహం. ఎక్కడో ఒకరు ఎదిగిన
బహుజన నాయకులు తమ సమస్యలు పరిష్కరిస్తారని తమ కోసం జీవితాలను ఇస్తారని, అణచివేత నిర్బంధాలు ఎదుర్కొంటున్న సమయంలో తమకు భరోసాగా నిలబడతారని ఆశించిన టువంటి ప్రజలను ఆత్మవంచన చేసినట్లే కదా! మరొక రకంగా ఇది ప్రజలను తాకట్టు పెట్టడమే.

మంత్రి పై వేటు ప్రశ్నించినందుకే నట:

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసినటువంటి ఈటెల రాజేందర్ గారిని భూకబ్జా సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలపై నా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మంత్రి పదవి నుండి తొలగించడం తో పాటు మనోవేదనకు గురి చేయడం 19 సంవత్సరాలుగా ఉద్యమ నేపథ్యంలో ఎదిగి పార్టీ కోసం పని చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల మద్దతు పొందడం లో కీలక భూమిక పోషించిన వీరు అప్పుడప్పుడు పార్టీ పట్ల నాయకత్వం పట్ల తన మనోభావాలను నిక్కచ్చిగా తెలపడంతో పాటు తమ నాయకుడిని కలవడానికి అనుమతి లభించలేదని వాక్కులు పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం లో, మంత్రివర్గంలో ,పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నట్లేనా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవ్వాళ మంత్రి వర్గంలో ఉన్నటువంటి సభ్యులతోపాటు శాసన సభ్యులు అందరూ కూడా అవినీతికి భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినబడుతూనే ఉన్నవి. అలాంటప్పుడు ఉమ్మడిగా అందరి పైన విచారణ జరిపించాలి .కానీ ప్రశ్నించినందుకు మాత్రమే సీనియర్ మంత్రి పైన ఎలాంటి విచారణ లేకుండానే బర్తరఫ్ చేయడం ఒక ఎత్తయితే ఇన్ని అవమానాలను భరించి ఇంత కాలంగా ప్రభుత్వంలో కొనసాగడం కూడా అ సమంజసమని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

” ఇంతకాలానికి అయినా మా బీసీ నాయకుడు ప్రతిఘటన బావుటా ఎగరేసే ఆత్మ గౌరవ నినాదం తో బయటకు వచ్చాడు. ఇప్పటికైనా మా బహుజనులకు రక్షణ ఉంటుంది .ఒక్కొక్కరుగా అధికార పార్టీ నుండి ప్రభుత్వము నుండి గెంటివేయబడ్డటు వంటి ఉద్యమకారులతో కలిసి ఐక్య వేదిక ను నిర్మించి అవినీతికి తావు లేకుండా సమసమాజ నిర్మాణం నినాదంగా పని చేస్తాడని ప్రజలందరo కలలుగన్నాం.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికే నిరసిస్తున్న టువంటి అనేక సంస్థలు ప్రజాసంఘాలు పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్నవి. బహుజనులను ఉద్ధరించడానికి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించ డానికి ఐక్య వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో నూతన వ్యవస్థ ఆవిష్కరించబడు తుందని కలలు కన్నాం. కానీ బహిష్కృత నేత తాజా నిర్ణయం మాకు నిరాశే మిగిల్చింది”. అని రాష్ట్రంలోని ప్రజలు వాపోతున్నారు.

నిన్న పార్టీకి రాజీనామా చేస్తూ మరో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం ఇది ప్రజల కోసమా లేదా వాళ్ళ ఆత్మ రక్షణ కోసమా అని మరికొందరు బాధపడుతున్నారు.

తెరాస పార్టీలో సీనియర్ నాయకులు గా ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి మంత్రిగా శాసనసభ్యునిగా పార్టీలో తిరుగులేని అటువంటి నాయకత్వాన్ని కొనసాగించి తనకంటూ శ్రేణులను నిర్మించుకున్న మాజీ మంత్రివర్యులు తమకు ఉన్నటువంటి బలాన్ని సరిగా అంచనా వేయలేదేమోనని ఈ సరైన సమయంలో ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో మెరుగైన పరిస్థితులు వచ్చేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా వారు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉంది.

వ్యక్తివాదం వద్దు- వ్యవస్థ కోసం పనిచేయడమే ముద్దు:

తెరాస నుండి ఇతర పార్టీల నుండి అనేక కారణాల రీత్యా ఆత్మగౌరవం కోల్పోయి అవమానాలతో బతకలేక స్వతంత్ర జీవనం గురించి ఆలోచిస్తున్న టువంటి బహిస్కృత అసమ్మతి నాయకులు తెలంగాణ ఆకాంక్షల యొక్క ప్రస్తుత స్థితి గతులను మరొక్కసారి మననం చేసుకొని లక్ష్యసాధనలో ఎందుకు విఫలమైనం?

ప్రజాస్వామిక విలువలు ఎందుకు పతనమవుతున్న వి? తెలంగాణ ఆకాంక్షల సారం ప్రజలకు అందినదా? అణచివేత నిర్బంధాలు స్థితిగతుల పైన ఒక అంచనాకు వచ్చి ఉన్నత విలువల ప్రాతిపదికగా సరికొత్త వ్యవస్థ నిర్మాణం కోసం ఆలోచించవలసిన అవసరం బుద్ధిజీవులు మేధావులు విజ్ఞులపైన ఉన్నది. గౌరవ మాజీ మంత్రివర్యులు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

“ఉద్యమిస్తే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప”. ఈ చారిత్రక సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఐక్య ఉద్యమం నిర్మాణం చేయడం ద్వారా నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని రూపుమాపు వలసిన అవసరం ఉన్నది.

వ్యక్తులు, వారి ఆస్తులు, అక్రమ సంపాదన పరిరక్షణ, భవిష్యత్ పదవులు, మెరుగైన రాజకీయ జీవితం గురించే ఆలోచించే వాళ్ళు ఉన్నంతకాలం ఈ ప్రజాస్వామ్యం విఫలం అవుతూనే ఉంటుంది. అందుకే అంబేద్కర్ గారు రాజ్యాంగంను సమర్పించే ముందు అన్న ఒక మాటను మనం చేసుకోవాలి. “రాజకీయాలలో వ్యక్తిగత హీరోయిజం పనికి రాదు అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది”.

కానీ ఇవ్వాళ దేశంలోనూ రాష్ట్రంలోనూ వ్యక్తిగత వాదమే కొనసాగుతూ మంత్రులు ముఖ్యమంత్రుల పేర్లమీద పథకాలు, నగరాలు, కాలనీలు భవనాల మీద వారి చిత్రపటాలతో పరిపాలన కొనసాగుతుంది అంటే అది వ్యక్తి వాదం కాకుండా మరేమవుతుంది? భంగపడ్డ రోజే బయటికి రావాలి కానీ పదవీ కాంక్షతో ప్రజలను మభ్యపెట్టడాన్ని రాజకీయ నాయకులు ఇక నుండి మానుకోవాలి.

Vaddepalli Mallesam

(ఈ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకుడు  కవి,రచయిత హుస్నాబాద్. జి.సిద్దిపేట)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *