తెలంగాణ సమస్య రావణ కాష్టంలాగా రగులూతూనే ఉంది… అని తెలంగాణఉద్యమ కాలంలో వార్తలు రోజూ వచ్చేవి.
ఇక ఆంధ్రా విషయానికి వస్తే, ప్రత్యేక హోదా సమస్య రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది… అని ఈ మధ్య వార్తలొస్తున్నాయి.
ఇలా రావణ కాష్టంలాగా రగులుతున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు కాశ్మీర్ సమస్య, పాలస్తీనా సమస్య రావణకాష్టంలాగా ఎప్పటినుంచో రగులుతూనే ఉన్నాయి. అయితే, ఈ రావణకాష్టం లాగా రగలడం ఎపుడో మొదలయింది, ఇప్పట్లో ఆరేటట్లు లేదు అని అనిపిస్తుంది.
ఇంతకీ రావణ కాష్టం అంటే ఏమిటి? ఆ మాట ఎలా వచ్చింది. ఇపుడు తెలుసుకుందాం.
రావణుడిని రావణబ్రహ్మ అని కూడా అంటారు కదా.
బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు. అతని కొడుకు విశ్వవసుబ్రహ్మ. అతని కొడుకు రావణుడు.
రావణుడు ఎన్నో యజ్ఞాలు చేసాడు. యజ్ఞం చేయడానికి కావలసిన వస్తువులెన్నో ఉంటాయి. అవన్నీ కర్రతోనే తయారు చేస్తారు. యజ్ఞానికికావలసిన సోమలతను తేవాలంటే ఒక కొత్త బండిని తయారుచేసి దానిమీద తీసుకురావాలి. ఆ సోమలతను దంచడానికి కావలసిన కొత్త రోలు, రోకలి తయారు చేసుకోవాలి. అగ్నిని మండించే సాధనాలు, అరణి , పాత్రలు అన్నీ చెక్కతో చేసినవే ఉంటాయి. ఒకసారి వాడిన వస్తువులను వేరొక యజ్ఞానికి వాడకూడదు. ఇలా వాడిన వస్తువులను, యజ్ఞం చేసినవారు దాచుకోవాలి. చనిపోయాక ఆ వస్తువులన్నీ అతని చితిమీద వేస్తారు.
రావణుడు అనేక యజ్ఞాలు చేసాడు. అందువల్ల ఆ యజ్ఞాల తాలుకు వస్తువులన్నీ అతని చితిమీద వేసారు. అంతే కాకుండా అతను నిత్యకర్మలో భాగంగా వాడిన వస్తువులు అన్నిటినీ కూడా చితిపైన వేసారు. అన్ని వస్తువులు వేసిన చితి ఎప్పటికీ ఆరిపోకుండా మండుతూనే ఉంది.
ఎప్పటికీ పరిష్కారం కాకుండా, హింసకు కూడా దారితీస్తున్న సమస్యలను, ఎప్పటికీ తెగని, పరిష్కారం కాని తగవులను రావణకాష్ఠం తో పోల్చి చెప్పడం ఒక జాతీయం అయింది.
(సోర్స్: పేసు బుక్ )