(దివి కుమార్)
ఈ ‘మరో యజ్ఞం కోసం’… నాటిక నేను పదిహేనేళ్ళ క్రితం రాసినది. ఇది చేతి వ్రాత రూపంలో ఉన్నప్పుడు కాళీపట్నం రామారావు గారికి శ్రీకాకుళంలో జరిగిన ఒక సభ సందర్భంగా చూపించాను. స్వయంగా తన చేతులతో ఆయన ముగింపు వాక్యాలు లేక ముగింపు సంభాషణ రాసి నాకు ఇచ్చారు .
కామ్రేడ్ భీమవరపు గురవారెడ్డి (కృష్ణా జిల్లా ప్రొద్దుటూరు గ్రామ మాజీ సర్పంచ్ ) కాళీపట్నం రామారావు పాత్రలోనూ,
రచయితనయిన నేను మాజీ సర్పంచ్ శ్రీరాములు నాయుడు గానూ, ప్రయోగాత్మకంగా కొన్ని సాహిత్య సభలలో (హైదరాబాదు నుండి అనంతపురం దాకా తిరుపతి నుండి విశాఖపట్నం దాకా) ఈ మరో యజ్ఞం కోసం సాహిత్య రూపకాన్ని ప్రదర్శించాము.
తిరుపతి ప్రదర్శన జరిగినప్పుడు మేడిపల్లి రవికుమార్ గారు చూశారు. విశాఖపట్నంలో వెలుగు సంస్థ వారు నిర్వహించిన ఒక సభలో మేము ప్రదర్శించినప్పుడు ప్రేక్షకులలో కాళీపట్నం రామారావుగారు, అట్టాడ అప్పలనాయుడుగారు కూడా ఉన్నారు. దానిని కానేటి మధుసూదన్, ఆనంద్ ల చొరవతో విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో వారు రికార్డు కూడా చేశారు .
ప్రఖ్యాత రచయిత కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కథ పూర్వాపరాలు గురించి వివరణ కోరిన ఒక సాహితీ మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్ గారికి 6 నెలల క్రితం రాసిన ఉత్తరం
యజ్ఞం కథ ముగింపు పైన రంగనాయకమ్మ గారి తీవ్ర విమర్శకు ఒక జవాబు లాంటిది ఇందులో ఉంది. గమనించగలరు.
వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక నవల ముగింపు సంఘటనలో భూస్వామి పాత్ర తో చెప్పిoచిన మాటలూ, రంగనాయకమ్మ గారి జానకి విముక్తి నవల మొదటి భాగం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
మరీచిక నవల లో వ్యక్తుల ఖతం లేక హతం ద్వారా వ్యవస్థ మారదనీ, పునాదులతో సహా దాన్ని పెకిలించి నప్పుడే అది నిజంగా మారుతుందని చెప్పారు. ఇక జానకి విముక్తి నవలలో పీడిత ప్రజలు లాంటి జానకిలు, తమ విముక్తిని తమ పోరాట చైతన్యంతో సాధించుకోవాలి, అలా మాత్రమే సాధించుకోగలరు, అందుకు ఇతరులది సహాయక పాత్ర … అని చెప్పిస్తారు రంగనాయకమ్మ గారు.
ఇవన్నీ మన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని విప్లవాత్మక మార్పుకి గురిచేయడానికి సంబంధించిన అవగాహనలు, దృక్పథాలు!
ఇప్పుడు యజ్ఞం కథ దగ్గరకు వద్దాం. దానిని 1964లో కారా మాస్టారు రాశారు. అది 1966లో గానీ అచ్చు కాలేదు . కథా ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో 1968 – 70 సంవత్సరాల నడుమ గిరిజన ప్రజా ఉద్యమం తిరుగుబాటుగా పరిణమించి అనేక తీవ్ర నిర్బంధాలకు గురి అయిన నేపథ్యంలో , 1970లో విరసం ఏర్పడిన తర్వాత, ఆ కథకు గొప్ప ప్రాచుర్యం వచ్చింది.
యజ్ఞం కథ చాలా రాజకీయ ప్రాముఖ్యత కలిగినది. ఆ కథ రాసిన 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. మితవాద కమ్యూనిస్టుపార్టీ – అతివాద కమ్యూనిస్టు పార్టీ అనేది ఆనాటికి ప్రాచుర్యంలో ఉండిన స్థూలమైన పేర్లు.
మార్క్సిస్టు రాజకీయ పరిభాషలో చెప్పుకోవాలంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అండదండలతో కొనసాగిన భారతీయ ఫ్యూడల్ వ్యవస్థ స్థానంలో, ప్రగతిశీలమైన జాతీయ బూర్జువా ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ , దాని ప్రధాన నాయకుడైన జవహర్లాల్ నెహ్రూ ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ వారి అవగాహన.
నెహ్రూ సామ్రాజ్యవాద వ్యతిరేకి కూడా కనుక ఆయన సాగిస్తున్న ప్రగతిశీలమైన ‘ప్రశాంత’ జాతీయ ప్రజాస్వామిక విప్లవానికి కమ్యూనిస్టులు విమర్శనాత్మక మద్దతుతో ఇంటా బయట సహకరించి, అభివృద్ధి నిరోధకుల నుండి వచ్చే అడ్డంకులను తిప్పికొడుతూ , ప్రభుత్వం సాగిస్తున్న ‘యజ్ఞం’ పూర్తి కావడానికి దోహదపడాలనేది మితవాద కమ్యూనిస్టులుగా ముద్రపడిన సి. పి. ఐ. వారి భావన లేక అవగాహన!
అంతేగాక వ్యవస్థపై విప్లవాత్మక తిరుగుబాటు లేక సమరశీల ప్రజాప్రతిఘటన అవసరం లేదని చట్టబద్ధమైన ప్రగతిశీల మార్పులతో వ్యవస్థను శాంతియుత పరివర్తన ద్వారా ప్రజానుకూలంగా అంతిమంగా సోషలిజంగా నిర్మించుకోవచ్చు ననేది వారి స్థూల సైద్ధాంతిక దృక్పథం.
పై అవగాహనకు విరుద్ధంగా భారతదేశంలో పాలకులు అభివృద్ధి నిరోధక స్వభావం కలవారు మాత్రమేనని, బడా బూర్జువా– భూస్వామ్య వ్యవస్థను వారు కాపాడుతున్నారని లేక కొనసాగిస్తున్నారని, కనుక సమరశీల ప్రజాపోరాటాలతో ఈ వ్యవస్థను సమూలంగా మార్చి, జనతా ప్రజాస్వామిక వ్యవస్థ అనగా ‘పీపుల్స్ డెమోక్రటిక్ స్టేట్’ నిర్మించాలని
సి . పి. ఐ. ఎం . అనగా మార్క్సిస్టు పార్టీ వారి ఆనాటి స్థూల అవగాహన.
ప్రతీకాత్మక ప్రాతినిధ్య పాత్రలతో కథను నిర్వహించడం కాళీపట్నం రామారావు గారి ఒకానొక శైలీ సంవిధానం.
యజ్ఞం కథలో పంచాయతీ సర్పంచ్ అయిన శ్రీరాములు నాయుడు భారత ప్రభుత్వానికి, దాని తొలి దశాబ్దన్నర కాలపు ప్రధాని అయిన నెహ్రూ పాత్రకు ప్రతీక . ఆ పాత్ర అభివృద్ధి నిరోధక మైనది, ప్రజావ్యతిరేక మైనది అంటూ రాస్తే ఇంకా పాఠకుడి ఆలోచనకు తావు ఇచ్చినట్లు అవదు కదా!! కనుక శ్రీరాములు నాయుడు లాంటి *జవహర్లాల్ నెహ్రూ ఎంత వ్యక్తిగత నిజాయితీగా తన విధానాలను అమలు పరిచినప్పటికీ , ఆ విధానాలు పేద మధ్యతరగతి ప్రజలను కేవలం బులిపించేదిగాను, సారాంశంలో వారికి వ్యతిరేకముగా పనిచేసి, సంపన్నులను మరింత సంపన్నులుగా బలిపించేదిగా రూపొందుతాయి* అని చెప్పడం ఈ యజ్ఞం కథలోని ముఖ్యాంశం.
Like this article? Please share it with friends!
అధికార మార్పిడి అనంతరం సాగుతున్న ‘యజ్ఞం’ లేక భారత పాలకుల నూతన వ్యవస్థ నిర్మాణం, సారాంశంలో సంపన్న వర్గాల ప్రయోజనం వైపుకే నడుస్తోందని, అందులో పేద ప్రజలు శ్రమజీవులు సమిధలు కాకతప్పదని కాళీపట్నం రామారావు గారి వ్యక్తీకరణగా అర్థం చేసుకోవటమే ఈ కథలోని కీలక అంశం!! అదే గతితార్కిక చారిత్రక దృష్టి.
ఆనాటికి సిపిఎం పార్టీ వారి అవగాహనతో కాళీపట్నం రామారావు గారికి ఏకీభావం ఉందన్నట్లు ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోగలం.
యజ్ఞం కథ ముగింపులో మొండెం నుండి వేరు చేయబడిన మూడేళ్ళ పసిపిల్లవాడి తలను సభికుల ముందు దబ్బున నేల మీద పడవేయటం అనే దృశ్యంలో ఒక నాటకీయమైన ముగింపు ఉందని నా అభిప్రాయం.
బలమైన వాస్తవాన్ని ప్రేక్షకుల ముందు ప్రదర్శించటానికి అవాస్తవికమైన రూపాలను ఎంచుకోవటం ఒక పద్ధతిగా లేక కళా సంవిధానంగా నాటక కళకు ఉందన్న విషయం కళా విమర్శకులoదరికీ తెలుసు.
ఉత్ప్రేక్షాలంకారాల్లాంటి సాహిత్య వ్యక్తీకరణల సంగతి మీకు నేను ఏం చెప్పగలను? యజ్ఞం కథలోని ఆ మూడేళ్ల బాలుడు భవిష్యత్తులో ఆత్మహత్యా సదృశమైన పరిస్థితులలో జీవించబోయే పేద, మధ్యతరగతి, కౌలు రైతాంగ ప్రతీకగా కారా మాస్టారు భవిష్యత్ చిత్రపటాన్ని ఆనాడే సమాజం ముందు ముఖం మీద గుద్ధి చూపిoచినట్లుగా నేను అభిప్రాయపడ్డాను.
1964 నాటి కమ్యూనిస్టు పార్టీ చీలికలో ఏర్పడిన భిన్నాభిప్రాయాలను, సామాజిక వాస్తవమైన , ప్రతీకాత్మక పాత్రల ద్వారా దృశ్యమానం చేసిన స్థూల వ్యక్తీకరణే యజ్ఞం ‘ కథ ‘!*
తెలుగునాట సాహిత్య దృక్పథంలో ప్రజాకోణాన్ని ఆవిష్కరించిన
అభ్యుదయ రచయితల సంఘం ఆనాటికి (1964) నిస్తబ్దంగా, నిర్మాణ రాహిత్యంగా, కదలిక లేకుండా ఉందని చెప్పుకోవటం స్థూలంగా సరైనదే అయినప్పటికీ, సాహిత్య శక్తులు నిస్తబ్దంగా లేవు. 196లో రాసిన కొడవటిగంటి కుటుంబరావుగారి బకాసుర కథను, దానిపై నేను చేసిన విశ్లేషణనూ ఒకసారి పరిశీలించండి.
జనసాహితి ప్రచురణ ‘సమరశీల కలం యోధుడు సి వి’ పుస్తకానికి ముందుమాట చూడండి. అలాగే రావిశాస్త్రి గారి పిపీలకం మరియు వేతన శర్మ’ కథలపై నా విమర్శను పరిశీలించండి ,ప్రజాసాహితి 2010లో వచ్చిన శ్రీ శ్రీ ప్రత్యేక సంచికలోని కాల వేగమున ప్రసరించిన మహాకవి వ్యాసాన్ని చూడండి! అరసం నిస్తబ్దమై విరసం ఏర్పడేలోగా నడిమి కాలంలో సామాజిక రాజకీయ సంఘర్షణల యొక్క సాహిత్య ప్రతిఫలనాలు మీకు స్థూలంగా అర్థమౌతాయి. అంతేకాదు అరసం విరసం కోణాలలో నుండి చూసే సాహిత్య చరిత్రకూ, జనసాహితి కోణం నుండి చూస్తున్న సాహిత్య చరిత్రకు గల విభజన రేఖలు కూడా అప్పుడే మీకు అర్థ మవుతాయి.
మరొకసారి మాట్లాడుకుందాం! ప్రస్తుతానికి సెలవు!!
21-11-2020