కథా నిలయం కాళీపట్నం రామారావు (కారా) మాష్టారు ఈ రోజు 4వతేదీ ఉదయం 8.30కి తన ఇంట్లో మరణించారు. తెలుగు కథకి ఆయన కొత్త అడ్రసు. గురజాడ కన్యాశుల్కం తెలుగు సాహిత్యాన్ని ఎంతగా ప్రభావతం చేసిందో రామారావు మాస్టారు ‘యజ్ఞం’ (1966)కథ తెలుగు కథా సాహిత్యాన్ని అంతగా ప్రభావితం చేసింది. యజ్ఞం కథ తెలుగు కథ ఎటు నడవాలో చెప్పింది. 1995లో ఈ కథకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
కారా మాస్టారుగా పిలువబడే “కాళీపట్నం రామారావు” 1924, నవంబర్ న శ్రీకాకుళం లో జన్మించారు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివాడు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల. స్థిరముగా ఇమడగలిగింది మాత్రం ఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము. 1972 నుండి నేటివరకు పెన్షనరు గానే జీవితము గడుపుతున్నాడు.అతను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసాడు.
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ ప్రయాణం ఆ పరిమితిని శైశవ దశలోనే దాటి సామాజికోద్రేకాలను అద్దుకొంటూ సాగి, ఆనాడు ఉత్తరాంధ్రలోని కొనసాగుతున్న ఉద్యమాలకు అనుసంధానమయ్యి పరిపక్వతను సంతరించుకొంది.
62-72 మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉడుకు రామారావు గారి కలాన్ని పదును పెట్టినట్లుగా తోస్తుంది. ఉద్యమాలు ఈ కలాన్ని ఆవహించాయా లేక ఇలాంటి కధలు ఉద్యమాలను ఉత్తేజపరిచాయా అన్నంతగా పెనవేసుకొని ఆయన సాహిత్యప్రయాణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో ఈయన రాసిన కధల్లో గాఢత బాగా చిక్కబడింది. వ్యక్తి నుండి వ్యవస్థకు ఈయన సాహిత్య ప్రయాణం ఈ కాలంలోనే జరిగింది. ‘ఆదివారం’, ‘చావు’, ‘ఆర్తి’, ‘కుట్ర’, ‘శాంతి’, ‘జీవధార’, ‘భయం’, ‘నో రూమ్’, ‘హింస’ కధలు ఈ కాలంలోనే వెలువడ్డాయి.
రామారావుగారి కధల్లో ఎక్కువ కధలు ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. పరిష్కారం చెప్పక పోయినా సమాజంలో ఉన్న దరిద్రం, ఆకలి ఇంకా చాలా సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించే పని చేయటం ప్రజా సాహిత్యకారుల కనీస కర్తవ్యం. కధలకు ఉండాల్సిన ఈ సామాజిక ప్రయోజనం కారాగారి చివరి కధల్లో వంద శాతం నెరవేరిందని నిర్ద్వంద్వం గా చెప్పవచ్చు. తమవి కాని జీవితాల్లోకి వెళ్ళి కధను పండించటం అంత చిన్న విషయమేమీ కాదు. రచయితలు డీక్లాసిఫై అవ్వాలని ఆ నాడు విరసం ఇచ్చిన పిలుపును స్వాగతించారు రామారావుగారు.
72 తరువాత ఆయన కధలు రాయటం మానేశారు. (92 లో సంకల్పం కధ రాశారు) ఎందుకు రాయలేదు అన్న ప్రశ్నకు ఒక దగ్గర “వూరికే కధ రాయటం ఎంతసేపు? కానీ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే అలవోకగా రాయలేక పోతున్నాను” అన్నారు. పదుల్లో గొప్ప కధలు రాసిన వ్యక్తికి కలం సాగక పోవటానికి చాలా సహేతుకమైన సందిగ్ధత ఇది. ప్రయోజనం లేని బఠానీ కధలు రాయలేక పోవటం వలన, వర్తమాన సమాజంలోని రాజకీయ సంక్లిష్టతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటం వలన .. ప్రజల కోసం నిజాయితీగా రాయాలనుకొన్న రచయితలు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితే సహజమే అయినప్పటికీ ఈ విరామం సుధీర్ఘం. అయితే ఆయన కాలం కంటే కూడా ముందుకు వెళ్ళి తన చుట్టూ ఆవహించిన సమాజాన్ని అంచనా వేయగలిగారు అనిపిస్తుంది. చూసిన సంఘటనల నుండి తనకు గల స్థిరమైన ప్రాపంచిక దృక్పధం వలన కలిగే చైతన్యం.. ఆ చైతన్యం అంతస్సారంగా స్రవించిన కధలివి. పాత్రల నమూనాల్లోనూ, సంఘటనల్లోనూ, ఆలోచనా రీతుల్లోనూ, వైరుధ్యాల్లోనూ, ఘర్షణలలోనూ ఆయన కలం ఇప్పటి పరిస్థితులకు సారూప్యత ఉన్న సృజనను అందించింది. అది ఆనాటి తరానికే కాదు, ఈ తరం చదువరుల వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా రక్తమాంసాలు ఇచ్చిందని అనటానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. తరువాత ఇంకొన్ని తరాల రచనల మీద ఈయన ముద్ర గాఢంగా పడింది.
(పూర్తి వివరాలు అందాల్సి ఉంది)