భూ కబ్జా ఆరోపణల మీద దర్యాప్తులు మొదలుకావడం, ఆపైన మంత్రి పదవి పోవడంతో ఈటెల రాజేందర్ ఏమిచేస్తారో కోటాను కోట్ల ప్రజలు వూహించారు.
ఆయన బిజెపిలోకి వెళ్లి పోతారని వూహించని వాళ్లే లేరు.ఇంకొక ఆలోచనే ఎవ్వరికీ రానేలేదు. టూ ప్రెడిక్టబుల్.
కారణం, అయనకు తక్షణం కావలిసింది ఆత్మరక్షణ. అరెస్టు కాకుండా, జైలుకు పోకుండా ఉండటం చాలా అవసరం. దీనికి అనువయిన పార్టీ బిజెపి ఒక్కటే. ఒక తెలంగాణ రెబెల్ కు ఆశ్రయమిచ్చే పార్టీ భారతదేశంలో ఇపుడేదీ లేదు. ఎన్నికలపుడు సీట్లు రాకపోతే, జనతా పార్టీ నుంచో,సమాజ్ వాది పార్టీ నుంచో,బిఎస్ పినుంచో పోటీచేయ్యవచ్చుగాని, అవి ఇలాంటపుడు పనికిరావు.
కాబట్టి ఆయన బిజెపిలోకే వెళతాడని అంతా అనుకున్నారు. ఆయన వెళ్తున్నాడు. అంతే. దీనికి లోతైన విశ్లేషణా సామర్థ్యం అవసరం లేదు.
అయితే, చూడాల్సింది, ఇది ఈటెల రెబెల్ రాజకీయానికి ఇది అంతమా ఆరంభమా అనేది. ఎందుకంటే, కెసిఆర్ మీద తిరుగుబాటు చేసే రెబెల్స్ ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. వాళ్లంతా ప్రకటనలకు పరిమితమయ్యారు. కొందరైతే మాయమైపోయారు.కొందరు బయటకురాలేదు,టిఆర్ ఎస్ లో ఉండలేక అడ్జస్టయిపోతున్నారు.
ఈ రోజు విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడిన విషయాలను బట్టి చూస్తే ఇది దేనికి ఆరంభం కాదు,ముఖ్యంగా ఆత్మగౌరవ పోరాటానికి ఆరంభమే కాదు అనిపిస్తుంది.
ఈటెల విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలంటే చెప్పకుండా వదిలేసిన విషయాలు చాలా ఉన్నాయి.
ఆయన కెసిఆర్ మీద చేస్తున్నవిమర్శలు టిఆర్ ఎస్ ఇన్ సైడర్ వెల్లడించిన పరమ సత్యాల్లాగానే లేవు.
రోజూ ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు వంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, బిజెపి అధికార ప్రతినిధులు, తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారు చెబుతున్నవే. ఈటెల ఈ రోజు కెసిఆర్ గురిచి వేగ్ గా చెప్పిన వన్నీ నిజమే కావచ్చు. నిజానికి ఉన్న పదును ఈటెల మాటలకు కనిపించలేదు. అంటే మంత్రులకు ఏంజరుగుతుందో అంతుబట్టనంతగా కెసిఆర్ క్యాబినెట్ ఉందని ఈ రోజు ఈటెల చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇంతకు మంచి ఆర్థిక అక్రమాల చిట్టా ఈటెల విప్పుతాడని అనుకోలేం.
నిజానికి శ్రవణ్ దాసోజు, రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ లే ఈటెలకంటే శక్తివంతంగా విమర్శిస్తున్నారు. కెసిఆర్ డబ్బు రాజకీయాలు, కుతంత్రాలు, అణచివేతలు…అనే విమర్శ, భారత దేశంలో ప్రతి ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి వర్తిస్తాయి. ఇది బాగా చచ్చు విమర్శ. టూ జనరల్ విమర్శ.నాది కమ్యూనిస్టు డిఎన్ఎ, ప్రజల వత్తిడి మేరకే బిజెపిలో చేరాల్సి వస్తున్నదన్నాడంటే డిఫెన్స్ లో పడిపోయినట్లే లెక్క. కెసిఆర్ ఈ దర్యాప్తుల్లో చిక్కిపోతాననే భయం ఎక్కడో ఆయనలో ఉన్నట్లుంది.
ఒక వ్యవస్థతో ఒక వ్యక్తి పోటీ పడగలడా? పార్టీ పెట్టాలనే నిర్ణయం డబ్బుతో కూడుకున్నది. అందుకే వెనక్కి తగ్గాల్సి వచ్చిందనేది కూడా పస లేని వాదన. కాన్సీ రామ్ ఎలా పార్టీ పెట్టారు, ఎంత డబ్బుతో పెట్టారు. అంటే డబ్బురాజకీయాలు చేద్దామని ఉంది, డబ్బులేదు, బిజెపి దగ్గిర డబ్బుందనేనే దీనర్థం.
మంచి నాయకుడి లక్షణాలున్న ఈటెల రాజేందర్ ఎక్కడో దారి తప్పుతున్నారనిపిస్తుంది.
అప్పాయంట్ మెంటు ఇవ్వడంలేదు, అవమాన పరుస్తున్నాడు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు గౌరవం లేదనేది, ప్రగతి భవన్ బానిసల నిలయం అనేది కూడా పాత విమర్శలే. ప్రొఫెసర్ కోదండరామ్, వి. హనుమంతరావు, డి శ్రీనివాస్ లాంటి వాళ్లు చెప్పినవే. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరే ఇంకా ఎక్కువ విషయాలు చెప్పి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రాంతీయా పార్టీల్లో అంతా చూస్తున్నదే.
టిఆర్ ఎస్ నుంచి బయటకు వెళ్లిన వాళ్లంతా చెబుతున్నవే ఈటెల చెప్పారు. నిజానికి కెసిఆర్ మీద పదునైన విమర్శలు చేసిన వ్యక్తి ఒక్కడే రేవంత్ రెడ్డి. ఆయన తన దగ్గిర ఉన్న సమాచారంతో కోర్టుకెక్కిన సందర్భాలున్నాయి. ఇపుడు జనాకర్షణ ఉన్న ప్రతిపక్షనాయకుడెవరైనా ఉన్నారంటే మొదట చెప్పుకోవలసిన పేరు రేవంత్ దే. రేవంత్ విమర్శలతో పోలిస్తే ఈటెల వేసినవన్నీ మొద్దు బాణాలు. కనీసం ఈటెల రేవంత్ సృష్టించినంత సంచలనం సృష్టించగలిగినపుడే ఆయన పోరాటం ముందుకు సాగుతుంది.
అంటే ఈటెల దగ్గిర భూకంపం సృష్టించే సమాచారమేమి లేదు,రాజకీయ విమర్శలు తప్పఅని అనుకోవాలి. మంత్రులుగా ఈటెలతో సహా అందరిని కెసిఆర్ అల్లంతా దూరాన పెట్టి, ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో తెలియకుండా చేశాడు కాబట్టే, ఈటెలయే కాదు, ఏ మంత్రి కూడా కెసిఆర్ రహస్యాలను, అక్రమాలను బయట పెట్టలేరు.
అయిదేళ్లుగా తాను అవమానాలు పడుతున్నానని ఈటెల ఒప్పుకుని తన వాదనని తానే బలహీన పర్చుకున్నాడు. అయిదేళ్లు కెసిఆర్ తో అడ్జస్టు అయిపోయిందెందుకు? ఈ గొడవరాకపోతే ఇంకా కూడా అడ్జస్టయి ఉండేవాడే కదా. అడ్జస్టయి పోయినపుడే ఖేల్ ఖతమయి పోయింది.కెసిఆర్ గొప్పతనమదే. కెసిఆర్ పదవి ద్వారానో, మరొక రూపంలోనో లబ్ది అందించి రాజకీయంగా వాయిస్ లేకుండా చేసే నేర్పరి. రాజకీయమంటే అదే. రక్తపాతాలు, అరుపులు, హూంకరింపులు పాతపద్ధతి.
పార్టీ నుంచి బయటకు వచ్చి, రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన జరిపి, కెసిఆర్ ప్రభుత్వ అక్రమాలను, భూకబ్జాలను, అవినీతిని డాక్యుమెంట్లతో సహా బయటపెట్టి, రాష్ట్రంలో రాజకీయ పెను తుఫాన్ సృష్టించే శక్తి ఈటెలకు లేదు అని ఈ ప్రెస్ కాన్ఫ రెన్స్ వల్ల స్పష్టమయి పోయింది.
ఆయన కెసిఆర్ మీద ఆత్మగౌరవ పోరాటం చేయలేడు. బిజెపి ఎజండా అమలు చేస్తాడు. ప్రజల గుండెల్లో గుడూ కట్టుకున్నానన్నపుడు, సర్పంచు ఎన్నికలనుంచి జడ్ పిటిసి ఎన్నికల దాకా 80 శాతం నుంచి 100 శాతం దాకా గెలిపించే శక్తి ఉన్నపుడు, బిజెపిలో చేరడమేమిటి?
కెసిఆర్ బలమేమిటో ఈటెలకు బాగా తెలుసు. దానిని ఆత్మగౌరవంతో, తెలంగాణ సెంటిమెంట్ తో ఎదిరించడం చాలా కష్టం. అందువల్ల తనకొక అండకావాలి. అండ ఇచ్చే శక్తి తెలుగుదేశం పార్టీకి లేదు. ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీకి లేదు. కాంగ్రెస్ కు లేదు. ఇక మిగిలింది బిజెపియే. ఇది ఆయన ఆత్మరక్షణ వ్యూహం, బతుకు దెరువు వ్యూహం అని సులభంగా అర్థమవుతుంది.
సిఎం ఆఫీసులో బిసిలు లేరు, ఎస్ సి లేరని ఇపుడు చెప్పడంతో ఈటెల క్రెడిబిలిటి పోయింది. ఈ విషయం ఆయన ఇపుడు చెబుతున్నారు గాని, ప్రజలు ఎపుడో గమనించారు. కెసిఆర్ ప్రభుత్వం ఏ కులానిదో,వర్గానిదో ఈటెల ఇపుడు గుర్తించారేమో గాని, ప్రజలు ఎపుడో గుర్తించారు. అసలు ఈ రోజు ఈటెల చెప్పిన కొత్త విషయమేమీ లేదు .చెప్పిన ప్రతివిషయం ప్రజలకు బాగా తెలిసిందే. అందువల్ల ఈటెల, ఆత్మగౌరవ పోరాటం ముందుకు సాగుతుందా అనేది అనుమానమే.
కెసిఆర్ తో పేచీ వచ్చి బయటకు వచ్చిన నాయకులలో చాలా మంది నిజాయితీగా పోరాడిన వాళ్లున్నారు. ప్రొఫెసర్ కోదండ్ రామ్, చెరకు సుధాకర్ , ఇన్నయ్య వంటి వాళ్ల నిజాయితీ, ఆత్మగౌరవాన్ని శంకించలేం. వాళ్ళకంటే ఈటెల చెబుతున్న వి కొత్త విషయాలు కాదు.
తనకు అవమానం జరిగిందని ప్రజల్లోకి వెళతారా? అది చెల్లదు.దాన్ని ప్రజలు స్వీకరించరు. కెసిఆర్ కుంభకోణాలు బయటపెడతారా? మంత్రిగారి దగ్గిర సరుకు లేదు.
కెసిఆర్ పాలనలో కోట్లాది నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. విద్యార్థులు నష్టపోయారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిప్పుల కొలిమి ఉస్మానియా యూనివర్శిటీ ఆగ్రహించింది. మల్లన్నసాగర్ రైతులు ఎన్ని రోజులు దీక్ష చేశారో. ఇవేవీ కెసిఆర్ ని బలహీన పర్చలేదు.
కెసిఆర్ తో పోరాడేందుకు అవసరమయిన అస్త్రాలు ఇంకా తెలంగాణ రెబెల్స్ ఎవరికీ దొరకలేదు. అవి దొరికే దాకా, కెసిఆర్ తో గొడవపడినోళ్లంతా కనుమరుగై పోతుంటారు. ఈటెల అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఆ ప్రాసెస్ మొదలయింది. రేపు బిజెపిలో చేరడంతో అది మరొక అడుగు ముందుకు వెళ్తుంది. ఆయన బిజెపి భాష మాట్లాడగానే చాప్టర్ క్లోజ్.
ఇది పూర్తి కాకుండా తను రాజకీయాల్లో ఒక శక్తిగా ఉండాలంటే ఈటెల వ్యూహం పకడ్బందీగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీకి దగ్గిర కాకూడదు. అందరిని కూడగట్టాలి. అంత శ్రమపడే శక్తి ఈటెలకు ఉన్నట్లు లేదు?
తెలంగాణ ఉద్యమ నేత,మేధావి,నిజాయితీ పరుడు ప్రొఫెసర్ కోదండ రామ్ మాటలనే ప్రజలు వినడం లేదు. ఏడేళ్లు మంత్రి పదవిలో ఉంటూ, కెసిఆర్ తో చక్కగా అడ్జస్టు పోయినన ఈటెల మాటలు తెలంగాణ ప్రజలు వింటారా?
ఆయన బిజెపిలో చేరాక బిజెపి వ్యూహమే ఉంటుంది కాని, ఈటెల వ్యూహం ఎలా ఉంటుంది? అందుకే ఈటెల రాజకీయజీవితానికి అంతమా ఆరంభమా అనేది చాలా తొందరగా తేలిపోతుంది.
హూజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత అంతా ప్రశాంతమే. నాగార్జున బైపోల్ తర్వాత బిజెపి దూకుడే తగ్గింది. ఈటెల చేసేదేముంటుంది? హూజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేయాలావద్దా అనేది తేల్చుకోవడమే ఆయనకు పెద్ద సమస్య కావచ్చు.