(రాఘవ శర్మ )
ఆధునిక వైద్య శాస్త్రాన్ని ఒక తెలివితక్కువ శాస్త్రం (stupid scince) అని చెప్పడం ఇప్పుడు ఒక అద్భుతమైన తాత్వికత!
టీవీ యోగా సద్గురువు రామ్‌దేవ్(బాబా) అధికారికంగా ఇప్పుడు ఒక తత్వవేత్త!!
అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా తనను తాను ఒకతత్వవేత్తగా అభిషేకం చేసుకున్నారు.
మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలోని తత్వ శాస్త్ర పాఠ్యాంశంలో ఆదిత్యనాథ్, రామ్‌దేవ్ పుస్తకాలను జోడించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుతం సిఫార్సు చేసినట్టు విశ్వవిద్యాలయ అధికారులు నిర్ధారించారు. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో నడుస్తున్నది.
రామ్‌దేవ్ రాసిన ‘యోగాచికిత్స రహస్యం ‘ రోగాలను ఎలా నయంచేయాలో చెపుతుంది.దీంతోపాటు ఆదిత్యనాథ్ రాసిన ‘హటయోగా : స్వరూప యేవం సాధన ‘ కూడా పాఠ్యాంశంలో చేర్చనున్నారు.
తత్వశాస్త్రపితామహులుగా ఖ్యాతిగడించిన ప్లేటో, అరిస్టాటి ల్ తో పాటు వీరి గ్రంథాలను కూడా బోధించనున్నారు.
అలోపతి వైద్యాన్ని ‘తెలివి తక్కువ శాస్త్రం ‘ అని రామ్‌దేవ్ వ్యాఖ్యానించిన తరువాత, వారం క్రితం ఈ సిఫార్సులు తమకు అందాయని విశ్వవిద్యాలయాధికారులు తెలిపారని ‘ది టెలిగ్రాఫ్’ రాసింది.
‘మాకు మేం సొంతంగా ఈనిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఫారసులువచ్చాక అండర్ గ్రాడ్యుయేట్ తత్వశాస్త్ర పాఠ్యాంశంగా వీటిని చేర్చాం’ అని ఈ విశ్వవిద్యాలయం ప్రొ వైస్ చాన్సలర్ వై, విమల సోమవారం తెలిపారు.
‘ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ పని చేశాం’ అని ఆర్ట్స్ డీన్ ఎన్.సి.లొహాని చెప్పారు.
కొన్ని నెలల క్రితం విశ్వవిద్యాలయ బోర్డుకు కాషాయ రంగు వేశారు.
” వాళ్ళు చాలా భయంకరమైన సిఫారసులను చేస్తున్నారు. ఏ మాత్రం ప్రామాణికం కాని తమ పుస్తకాలను బోధించాలని బలమైన వ్యక్తులు మా పైన ఒత్తిడి చేస్తున్నారు.” అని నిరాశతో ఈ విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఒకరు అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్నది చూస్తే నా చిన్న తనం లో చూసిన ఒక నాటకం లోని పాటలోని కొన్ని చరణాలు గుర్తుకు వస్తున్నా యి.
” కాషాయ గుడ్డలు కట్టర బాబు
కర్మను గురించి చెప్పర బాబు
భిక్ష లు లక్షలు వస్తాయి బాబు
కుక్షి కి లోపం ఉండదు బాబు
సాష్టాంగములే పడెదరు బాబు
జగద్గురువు అయెదవు బాబు “