రాయలసీమ ప్రజలు పెట్టుకున్న ఆశలు – మీరు ఇచ్చిన హామీ అమలుకు కార్యాచరణ కావాలి.
(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. విపక్ష నేత హోదాలో ఎన్నికల సమయంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని నేను చేసిన వినతికి సానుకూలంగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి గారు హేతుబద్ద సమాధానం ఇచ్చారు. నాడు నేను ప్రస్తావించిన రెండు అంశాలను మరోసారి గుర్తుచేస్తున్నాను.
1. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి.
ఏపీలోని అన్ని ప్రాంతాలు ఒకే రకమైన అభివృద్ధి చెందలేదు. రాయలసీమ , ఉత్తరాంధ్ర , పల్నాడు వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతాలకు మధ్య వ్యత్యాసాన్ని తొలగించే పద్దతులకు భిన్నంగా అమరావతి పేరుతో కేంద్రీకృత అభివృద్ధి నమూనా అమలుకు సిద్ధపడ్డారు. ఈ విధానాన్ని మార్చాలని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని పాలనా ప్రాధాన్యతలను రూపొందించుకోవాలని కోరాము. సానుకూలంగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్రీకృత అభివృద్ధికి భిన్నంగా ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించే విధంగా ముందుకు సాగుతామని అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆచరణలో అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు ఫలితాలు అందుతాయి.
రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి-
కీలకమైన అంశం రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరాను. సీమ నీటి సమస్యకు కారణం. నీటి లభ్యత లేకపోవడం కాదు అందుబాటులో ఉన్న నీటి వనరులను సీమ పొలాలకు అందించే ఏర్పాట్లు చేయకపోవడం. వరదలు వచ్చినప్పుడు త్వరితగతిన నీటిని సరఫరా చేసే విధంగా కాల్వల సామర్థ్యాన్ని పెంచడం , పోతిరెడ్డిపాడు వెడల్పు , తుంగభద్ర నీటిని నిల్వ చేసుకోవడానికి వీలుగా గుండ్రేవుల , సమాంతర కాల్వ , కీలక పరిష్కారం కోసం సిద్దేశ్వర నిర్మాణం , గాలేరు నగరి కోసం సోమశిల కండలేరు కాల్వ సామర్థ్యాన్ని 4 TMC లకు పెంచడం , చెరువులు పరిరక్షణకు ప్రణాళికలు. ముఖ్యంగా దుమ్ముగూడెం టెల్ పాండు పథకాన్ని అమలు చేయాలని కోరాను.
సానుకూలంగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి విపక్ష నేతగా నాడు అంగీకారాన్ని తెలుపుతూ శ్రీశైలం నీటిని రాయలసీమ , నెల్లూరు , ప్రకాశం జిల్లాలకు పరిమితం చేసే విధంగా ప్రణాళికలు చేయాలని అభిప్రాయ పడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు , కుందూ నదిపై జోలదరాసి , రాజోలు కు శంకుస్థాపన , గండికోట నిర్వాసితుల సమస్య పరిష్కారం , కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించినారు. ఆశలు కలుగుతున్నాయి. కానీ కీలకమైన సిద్దేశ్వరం , గుండ్రేవుల , సమాంతర కాల్వ , దుమ్ముగూడెం టెల్ పాండు , సోమశిల కండలేరు సామర్థ్యం పెంపు, చెరువుల పునరుద్ధరణ , నికర జలాల సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి తగిన ప్రణాళికలు చేయాల్సి ఉంది. ముక్యంగా కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయకుండా విశాఖలో ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం రాయలసీమ ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు సమయం ఉన్నందున సీమ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక నీటి సమస్య పరిష్కారం కావాలని రాయలసీమ సమాజం ఆశిస్తోంది.
సానుకూలంగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి విపక్ష నేతగా నాడు అంగీకారాన్ని తెలుపుతూ శ్రీశైలం నీటిని రాయలసీమ , నెల్లూరు , ప్రకాశం జిల్లాలకు పరిమితం చేసే విధంగా ప్రణాళికలు చేయాలని అభిప్రాయ పడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు , కుందూ నదిపై జోలదరాసి , రాజోలు కు శంకుస్థాపన , గండికోట నిర్వాసితుల సమస్య పరిష్కారం , కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించినారు. ఆశలు కలుగుతున్నాయి. కానీ కీలకమైన సిద్దేశ్వరం , గుండ్రేవుల , సమాంతర కాల్వ , దుమ్ముగూడెం టెల్ పాండు , సోమశిల కండలేరు సామర్థ్యం పెంపు, చెరువుల పునరుద్ధరణ , నికర జలాల సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి తగిన ప్రణాళికలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయకుండా విశాఖలో ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం రాయలసీమ ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు సమయం ఉన్నందున సీమ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక నీటి సమస్య పరిష్కారం కావాలని రాయలసీమ సమాజం ఆశిస్తోంది.