(టి. లక్ష్మీనారాయణ)
నా చిన్నతనంలో, అంటే యాభై ఏళ్ళ క్రితం, మా గ్రామంలో, త్రాగుడుకు బానిసైన వారిని త్రాగుబోతులంటూ సమాజం చిన్నచూపు చూసేది.
ఇప్పుడు మద్యం సేవించని వారిని అనాగరికులని భావించే దశకు సమాజం ఎదిగింది. ప్రభుత్వాలకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా, లాభసాటి వ్యాపార వస్తువుగా మద్యం తయారయ్యింది.
మా వూరిలో ఒక మంచి మనసున్న వ్యక్తి ఉండేవాడు. ఏ కుటుంబంలో మంచి చెడులు జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యే వాడు. ఆ కుటుంబ సభ్యులతో మమేకమై చేదోడు వాదోడుగా ఉండేవాడు. అతన్ని ఎవరూ పిలవాల్సిన పనేలేదు. తనకు తానుగా వెళ్ళిపోయి భాగస్వామి అయ్యేవాడు. ఆర్థికంగా పేదవాడే, కానీ, సంస్కారంలో పేదవాడు కాదు.
కానీ, ఒకే ఒక్క దురలవాటుకు బానిసైనాడు. అదే త్రాగుడు. ఎప్పుడూ త్రాగుడు మత్తులోనే తూలిపడుతూ ఉండేవాడు. ఎక్కడబడితే అక్కడ నేలపై శవంలా పడిపోయి ఉండేవాడు. ఆ స్థితిలో అతన్ని చూస్తే బాధ కలిగేది. సారా అతన్ని ఆ దుస్థితికి దిగజార్చింది.
నేను మా వూరికి వెళ్ళినప్పుడు అతను కనిపించకపోతే చనిపోయి ఉంటాడని అనుకొనే వాడిని. కానీ, చాలా కాలం బ్రతికాడు. అన్నం తినకుండా నాటు సారాతోనే ఎలా బ్రతకగలుగుతున్నాడో! ఆశ్చర్యమేసేది. ఎవరైనా అతని మీద పరిశోధన చేస్తే బాగుంటుందేమో! అనిపించేది.
మద్యం, నాటుసారా ఎదైనా మనిషిని పతనావస్తకు చేర్చుతుందనడానికి నా కళ్ళ ముందు దశాబ్ధాలుగా కదలాడుతున్న ప్రత్యక్ష సాక్ష్యం అతని జీవితం. త్రాగడానికి డబ్బు కోసం అతను దొంగతనానికి అలవాటుపడలేదు. ఇతరులను బ్రతిమలాడి ఎంతో కొంత తీసుకొని నాటుసారా త్రాగేవాడు. నన్ను చాలా అభిమానించేవాడు. కానీ, డబ్బు ఇచ్చేవాడిని కాదు. డబ్బు కోసం వేచి ఉంటే గమనించి అన్నం తింటావా? అని అడిగే వాడిని. వద్దని వెళ్ళిపోయేవాడు.
మా వూరిలో దాదాపు అందరూ ఒకే కులస్తులే. అతన్ని అందరూ పేరుతో కాకుండా “గుతకోడు” అంటూ పిలిచే వారు. నాకు మనస్సు చివుక్కుమనేది. ఒక వ్యక్తి త్రాగుబోతుగా మారిపోతే ఆ వ్యక్తిని సమాజం ఏ విధంగా చిన్నచూపు చూస్తుందో ఆ పిలుపుతోనే అర్థమైపోతుంది. ఆ విధంగా అతని వ్యక్తిత్వం పలచనైపోయింది. కానీ, అతన్ని అందరూ అభిమానంగానే అలా పిలిచేవారు సుమా!
నేను మాత్రం ఏం మామా! అని సంభోదించే వాడిని. అందుకేనేమో! అతనికి నేను త్రాగడానికి ఎప్పుడు డబ్బు ఇవ్వకపోయినా నా పట్ల ప్రత్యేక అభిమానాన్ని కనబరిచే వాడు.
మనిషికి వ్యక్తిత్వమే మణిహారం. మంచి వ్యక్తిత్వాన్ని ఎవరికి వారు అలవరుచుకోవాలి, నిర్మించుకోవాలి, పరిరక్షించుకోవాలి.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)