(వడ్డేపల్లి మల్లేశము)
విద్యా, వైద్య రంగాలలో ప్రభుత్వాలు సామాజిక బాధ్యతను మరిచిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులు నామమాత్రంగా మిగిలిపోవడంతో అనేక వింత సంఘటనలు జరగడం తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూశాం.
నామమాత్రపు బడ్జెట్ తో ప్రభుత్వ ఆస్పత్రులను ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తూ తాము పెంచి పోషిస్తున్న టువంటి ప్రైవేటు రంగాన్ని ముఖ్యంగా వైద్యశాలలను దోపిడీకి చిరునామాగా మార్చిన సందర్భాలు ఇటీవలి కరోనా నేపథ్యంలో మనందరం కళ్లారా చూస్తూ ఉన్నాము.
ఈ రెండింటి నడుమ పేదవాళ్లు అనాధగా, అభాగ్యులు గా, దిక్కు లేని వారిగా, దీనులు గా మారి అప్పులపాలై అలమటిస్తూ లక్షలాది రూపాయలను ఖర్చు చేసిన శవాలతో ఇంటికి వస్తున్నటువంటి దయనీయ గాథ లను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. దారుణం.
ప్రభుత్వ ఆసుపత్రుల తీరు- అవినీతి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ,జిల్లా స్థాయిలో ,రాష్ట్ర స్థాయిలో అనేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని వాగ్దానం చేసింది. కొత్తవి నిర్మించక పోగా ఉన్నవాటిలో కనీస సౌకర్యాలు కూడా కనుమరుగై ఎక్స్-రే ,ల్యాబ్ ,సిటీ స్కాన్, రక్త మూత్ర పరీక్షలు కూడా లేకపోవడం, అందుబాటులో ఉండక పోవడం ,నిపుణులు లేకపోవడం, సిబ్బంది నిరాకరించడం వంటి అనేక చర్యల వలన ప్రైవేటు ప్రయోగశాలల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది.
ఇటీవలి కరోనా నేపథ్యంలో జిల్లాస్థాయి ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ వంటి కనీస సౌకర్యాలు లేక ఎందరో చనిపోగా ఇటీవలనే ఎంజీఎం ను సందర్శించిన ముఖ్యమంత్రి గారి పర్యటన అనంతరం మందులు ,వివిధ వైద్య పరికరాల కుంభకోణం బయటపడడం దారుణం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి ఆస్పత్రిలో ఇటీవల టీకాలను, పరీక్ష కిట్లను వందలాది రూపాయలు తీసుకొని బ్లాక్లో అమ్ముతున్న టువంటి సందర్భాలను కనులారా చూస్తున్న అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దేనికి సంకేతం?.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల పట్ల నిఘా ఉంచకపోవడం, పేద వర్గాలకు అందించకపోవడం వలన ప్రభుత్వ వైద్యశాలల పట్ల విశ్వాసం కోల్పోయిన వాళ్లు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగడం దారుణం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
ఇటీవల చనిపోయిన శవాలను కూడా మార్చి ఒకరిది ఒకరికి ఇచ్చిన సంఘటనలు, ఖాళీ ఆక్సిజన్ సిలిండర్ ను అమర్చడం, ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా అనేక ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రు లలో ఆక్సిజన్, వెంటిలేటర్ లేక వందలాది సంఖ్యలో చనిపోయిన వార్తలు విన్నాము .కానీ ప్రభుత్వానికి అయ్యో అనిపించక పోవడం దారుణం.
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి- ప్రభుత్వ అజమాయిషీ వైఫల్యం:
ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ రాష్ట్రంలోను రోజు రోజు కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గకపోగా కొనసాగుతూనే ఉన్నది.
ప్రభుత్వ ,ప్రైవేటు వైద్యశాలలో అనేక సంఘటనలు జరుగుతూ రోజు పిట్టల్లా రాలిపోతున్న విషయాన్ని పత్రికల్లో చదువుతూ టీవీలో వింటూ ఆవేదన చెందుతున్న సగటు ప్రజల గురించి పట్టించుకునే వారే లేరా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైనా కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చినారు. కానీ తెలంగాణలో అలాంటి సౌకర్యం లేదు. ఇన్ని ఒత్తిళ్లు చేసిన ప్రభుత్వం అంగీకరించకపోవడం శోచనీయం. ఆరోగ్య కార్డులు కలిగిన అనేక వర్గాలకు కూడా సౌకర్యం లేకపోవడం వలన ప్రభుత్వ వైద్యశాలలో ఈ సౌకర్యం లేక విశ్వాసం లేకపోవడం వలన ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తున్నది.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి 248 ఉత్తర్వు ప్రకారం గా ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యానికి ఫీజుల రేట్లు నిర్ణయించినప్పటికీ ఆస్పత్రుల్లో ఒకరోజు వైద్యానికి లక్ష, లక్షకు పైగా వసూలు చేస్తూ చివరికి శవాల కుకూడా వైద్యం చేసి శవాలు అప్పగించిన ఉదంతాలు మానవత్వానికి మచ్చ
ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులు వసూళ్లపై నిఘా ఉంచ కపోగా
ప్రైవేటు ఆస్పత్రులకు మద్దతు ఇచ్చిన సందర్భాలు చూసీ చూడనట్టు ఉన్నటు వంటి విషాద సంఘటనలు అనేకం.
తమిళనాడు, గోవా ,మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ అనేక రాష్ట్రాలలో తక్షణ పరిష్కారం కింద ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని వాటిని ఆదేశించడం తో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన చికిత్సకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు దోపిడిని కట్టడి చేస్తూ ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి సౌకర్యానికి నోచుకోక పోగా ప్రైవేటు దోపిడిని అరికట్టక పోవడంతో ముఖ్యంగా పేదవాళ్లు లక్షలాది రూపాయల అప్పు చేసుకుని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో శవాలను మూటగట్టుకొని ఇల్లు చేరుతున్న టువంటి దీనగాథ లు. తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షలు ఇవేనా? ఇదేనా బంగారు తెలంగాణ?
ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉన్నటు వంటి అనేక కుటుంబాలు ఆసరా లేక, అనాధలుగా, అప్పులతో, కరోనా సోకిన సందర్భంలో అయోమయంలో, ఏమీ తోచని నిస్సహాయ స్థితిలో, ప్రాణాల మీద ఆశ తో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే ప్రభుత్వాలు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ ఆస్పత్రిలో జరుగుతున్నటువంటి సంఘటనలు పట్టించుకోకపోవడం ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని అందరూ ఆలోచించాలి.
– అసలు కరోనాకే చికిత్స లేదన్నటువంటి సందర్భంలో లక్షలాది రూపాయలు దేనికి ఖర్చు అవుతున్నట్లు?
-ప్రభుత్వ పెద్దలకు, శాసనసభ్యులు, మంత్రులకు కరోనా సోకిన నేపథ్యంలో
హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రి గాని ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో చేరక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరడం లోని ఔచిత్యం ఏమిటి?
– హోం ఐసోలేషన్ కు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే నాలుగు వేల రూపాయలు మంజూరు చేస్తూ ప్రైవేటు ఆస్పత్రులను ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యం కాదా ?లేక చిత్తశుద్ధి కొరవడినo దుకా?
– ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి ఎలాంటి మాస్కులు, గ్లౌజులు, పీపీ ఇకిట్లు ,రక్షణ సౌకర్యాలు లేనేలేవు.
– గ్రామాలలో పట్టణాలలో ఐ సొల్యూషన్ లో ఉన్నటు వంటి వారికి ఇళ్లల్లో సౌకర్యం లేని కారణంగా పోషకాహారం అందుబాటులో లేక చాలీ చాలని ఆర్థిక పరిస్థితుల్లో సరఫరా చేస్తున్నటువంటి నాసిరకం మందుల కారణంగా తిరిగి బయట మందులు కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తున్నది.
– ముఖ్యంగా రెండవ దశలో యువకులు ఎక్కువగా చనిపోతున్న నేపథ్యంలో 18 నుండి 44 సంవత్సరాల లోపు వారికి ముందుగా వ్యాక్సినేషన్ సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేషెంట్లకు అయినటువంటి ఖర్చును ప్రభుత్వమే చెల్లించి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అరికట్టడంతో పాటు ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ వైద్యశాలల పట్ల విశ్వాసాన్ని పెంచి పోషించవలసిన రక్షణ కర్తవ్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆపద సమయంలో ఆదుకున్న ట్లయితే ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.
మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించడం ద్వారా ప్రభుత్వం ప్రజల మనసులను చూరగొనే అవకాశం కరోనా సందర్భమే.
అవకతవకలకు , అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వం సరఫరా చేసినటువంటి పరికరాలు, మందులు , ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న టువంటి ప్రభుత్వ వైద్యశాలలో ని సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తూ శవాలకు కూడా వైద్యం చేస్తున్నటువంటి ప్రైవేటు దోపిడిని వెంటనే అరికట్టి ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించు కోవలసిన అవసరం నేడు ఎంతగానో ఉన్నది. ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన వారికి ఇంటికే ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. వైద్యానికి నిధులు ఎక్కువ కేటాయించింది. మనమూ ఆబాటలో నడిస్తే మంచిదే కదా!
( ఈ వ్యాసకర్త కవి రచయిత రాజకీయ సామాజిక విశ్లేషకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)