పదాలకు అర్థాలు కాలాన్ని బట్టి మారిపోతుంటాయి. నిన్నమొన్నటి దాకా ప్రపంచమంతా ఆర్థిక సంస్కరణలు (Reforms)అంటే ప్రైవేటీకరణ అనే అర్థం ఉండింది. విద్యుత్ సంస్కరణలు అంటే విద్యుత్ మండళ్ల(Electricity boards)ను జనరేషన్,ట్రాన్స్ మిషన్ ,డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లుగా విడగొట్టడమే. మెల్లిగా వాటిని ప్రయివేటు వాళ్లకు అప్పగించడం. ఇది తొందరల్లో జరగుతుందని అంతా అనుమానిస్తున్నారు.
ఇండస్ట్రియల్ రిఫార్స్మ్ అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ప్రయివేటు వాళ్లకు అమ్మేయడం.
ఇపుడు భారత దేశంలో రైల్వే రిఫార్మ్స్ పేరుతో కొన్ని రైలు మార్గాలను ఎంపిక చేసి ప్రయివేటు కంపెనీలకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అయితే, ఇండియాలో ఇది ఇంకా వూపందుకోలేదు.
2015లో నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్ రాయ్ సూచనల మేరకు ఇండియన్ రైల్వేల మీద ప్రభుత్వం గుత్తాధిపత్యం వదులుకోవాలనుకుంటున్నది. ఆయన సూచనల ప్రకారం రైల్వే బడ్జెట్ ఎత్తేసి జనరల్ బడ్జెట్ లో కలిపారు. ఆయన తన రిపోర్టులో పేర్కొన్న లిబరలైజేషన్ అనే మాటకు అర్థం ప్రయివేటు వాళ్లను ఆహ్వానించడమే.
దానికి తోడు విపరీతంగా ఉన్న రైల్వే ఆస్తులనుంచి కేంద్ర ప్రభుత్వం లబ్ది (నాన్ ఫేర్ రెవిన్యూ) పొందాలనుకుంటూ ఉంది. ఇవన్నీ ప్రయివేటీకరణకు దారితీసే చర్యలే. అదే జరిగితే, కోట్లాది భారతీయులకు సబ్సిడితో నడిచే రైలు అందుబాటులో లేకుండా పోతుంది. ప్రయాణాలు బరువవుతాయి.
అయితే, ఇపుడు ఇంగ్లండులో రిపార్మ్ అంటే అర్థం మారిపోతూ ఉంది. అక్కడ ఇపుడు రిఫార్మ్ అంటే నేషనైలైజేషన్ (Nationalization) అని అర్థం మారింది. రైల్వేలను ప్రయివేటుకంపెనీలనుంచి వెనక్కు తీసుకునేందుకు ప్రధాని బొరిస్ జాన్సన్ ప్రభుత్వం సిద్ధమయింది. పార్లమెంటులో ప్రకటన చేసింది.
గతంలో ప్రభుత్వం పాలనలో ఉన్న రైల్వే వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని, బ్రిటన్ రైల్వేలను ప్రయివేటీకరిస్తే రైల్వే వ్యవస్థలో స్వర్ణయుగం నడుస్తుందని భావించారు రైలు వ్యవస్థను ప్రయివేటీకరించారు.
అయితే, అది తారుమారయింది. ప్రయివేటు కంపెనీల పాలనలో రైల్వే వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా తయారయిందంటే, ప్రజలు రైలెక్కడమే మానేశారు. దీనితో ప్రభుత్వం ఇపుడు రైల్వే లను రిఫార్మ్ చేయాలనుకుంటున్నది. అంటే మళ్లీ జాతీయచేయాలనుకుంటున్నది.
మొదట్లో ఇంగ్లండులో నాలుగు ప్రయివేటు కంపెనీలు రైళ్ళను నడిపేవి. 19వ శతాబ్దంలో బ్రిటన్ రైలు వ్యవస్థ ప్రపంచంలోనే నెంబర్ వన్ లాగా ఉండింది. అయితే, 70 సంవత్సరాల కిందట 1948లో రైల్వేలను జాతీయం చేశారు. జాతీయం చేశాక రైల్వేకు నష్టాలు రావడం మొదలయింది. రోడ్ ట్రాన్స్ ఫోర్ట్ తో రైల్వేలు పోటీ పడలేక పోయాయి. చాలా రైళ్లను రద్దు చేశారు. రైల్వేని సంస్కరించాలని 1994లో రైలు మార్గాలను మళ్లీ ప్రయివేటీకరించారు. బ్రిటిష్ రైల్ తో కలిపి 25 కంపెనీలు రైళ్లను నడపడం మొదలుపెట్టాయి. రైలు ట్రాక్స్ ను, సిగ్నిలింగ్ ను, స్టేషన్ల మెయింటెన్స్ ను రైల్ ట్రాక్ అనే కంపెనీ చూస్తుంది. అయితే, వచ్చిన లాభాలను రైల్వేను మెరుగు పరిచేందుకు రైల్ ట్రాక్ గాని, ఇతర ప్రయివేటు కంపెనీలు గాని ఖర్చు చేయలేదు. దీనితో రైల్వే నెట్ వర్క్ పాడయిపోయింది. రైళ్లు లేటుగా నడవడం మొదలయింది. రైళ్లు రద్దు కావడం చాలా మామూలయింది, టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రయాణికులకు ధీటుగా రైళ్ళ సంఖ్య పెరగడక పోవడంతో రైళ్లన్నీ కిటకిట లాడటం మొదలయింది. ప్రమాదాలు పెరిగాయి. బ్రిటన్ రైలు ఆలస్యంగా నడవడానికి పర్యాయ పదమయింది. ప్రజలతంతా ఈ ప్రయివేటు రైళ్లు వద్దురా దేవుడా అని మొత్తుకోవడం మొదలు పెట్టారు. దీనితో రైల్వేలను సంస్కరించాలని నిర్ణయించారు. అంటే జాతీయం చేయాలని నిర్ణయించారు. రైల్వే వ్యవస్థ మీద ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో బ్రిటిష్ ప్రభుత్వం ‘రైల్ ట్రాక్’ కంపెనీని జాతీయ చేసింది.
కరోనా పాండెమిక్ బ్రిటిష్ రైలు వ్యవస్థ లోని లోపాలను భయంకరంగా ఎత్తి చూపింది. ప్రజలు రైలు ప్రయాణాలను బాగా తగ్గించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో నాటికి 100 శాతం ఉన్న రైల్వేల వినియోగం 4-6 శాతానికి పడిపోయింది. రైళ్లను నడపడం అసాధ్యమయింది. బ్రిటిష్ ప్రభుత్వం అత్యవసర సర్వీసులను నడిపేందుకు వర్కర్లను గమ్యస్థానాలకు చేరవేసేందుకు 3.5 బిలియన్ పౌండ్లు వెచ్చించాల్సి వచ్చింది. ప్రభుత్వం మీద రైల్వే సబ్సిడీ భారం బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలో రైల్వేలను సంస్కరించేందుకు అనేక సర్వేలు, అధ్యయనాలు నిర్వహించారు. అన్ని రీనేషనలైజేషన్ (పున:జాతీయం) చేయడానికే అనుకూలంగా వచ్చాయి. ఫిబ్రవరి 7న వెల్ష్ ప్రభుత్వం తన పరిధిలోని రైల్వేలను స్వాధీనం చేసుకుంది. బ్రిటన్ లోని ఇతర ప్రాంతాలలో కూడా ఇదే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతూ ఉంది. ప్రధాని బోరిస్ జాన్సన్ కన్సర్వేటివ్ ప్రభుత్వం నేషనలైజేషన్ కు సుముఖంగా ఉంది. ఇది తొందరల్లో చట్టంగా మారితే 2023 నాటికి గ్రేట్ బ్రిటిష్ రైల్వేస్ (Great British Railways) ఏర్పడుతుంది.
భారతదేశంలో రైల్వేల పరిస్థితి
భారతీయ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు గుండెకాయ వంటివి. 2019-20 లో రోజూ రైల్వే డిపార్ట్ మెంటు 13,169 ప్యాసింజర్ రైళ్లను, 8,479 గూడ్స్ రైళ్లను నడిపింది. మొత్తంగా 2.2 కోట్ల మంది ప్రయాణికులు రోజూ రైళ్లలో ప్రయాణించారు. ఇది పాండెమిక్ ముందుమాట.
రైల్వేకు చాలా సంపద ఉంది. 2019-20 హ్యాండ్ బుక్ ప్రకారం రైల్వేలకు 4.81 లక్షల హెక్టేర్ల భూమి ఉంది. 12,729 రైళ్లున్నాయి.2,93,077 గూడ్సో బోగీలున్నాయి. 76,608 బోగీలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఎక్కువ ఉద్యోగాలిస్తున్న సంస్థ కూడా ఇదే. సాంఘికన్యాయానికి రైల్వేశాఖ పునాది వేసింది. ఇలాంటి వ్యవస్థ మీద ప్రైవేటు వాళ్ల కళ్లు పడతాయి. రైల్వే ప్రయివేటీకరణ మొదలయింది. మోదీ ప్రభుత్వం ఏమయినా సరే ప్రయివేటీకరణను ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నది. ఈ చర్యను చాలా మంది ప్రజలు, రైల్వే ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
ఇలాంటపుడు కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రయివేటు సంస్థలు రైల్వే నెట్ వర్క్ వాడుకుని వదిలేసే ప్రమాదం ఉంది. అందువల్ల రైల్వేని పటిష్టం చేసేందుకు యోచించాలి తప్ప ప్రయివేటీకరణ పరిష్కారం. ట్రేడ్ యూనియన్లు, భారీ ఉద్యోగ కల్పన వంటి వాటి మీద వ్యతిరేకత ఉంటే తప్ప రైల్వేలను ప్రయివేటీకరించడం సబబుకాదనే చాలా మంది చెబుతున్నారు.