(నిమ్మ రాంరెడ్డి)
పల్లవి:
‘నేను పాడలేను
ఈ విషాద గీతాన్ని
నేను చూడలేను
ఈ విలయ ప్రకోపాన్ని’
చ1.
చివరి పిలుపులన్న లేక
గేటులు పెట్టేస్తివి
చివరి చూపులన్న లేక
మూటలు కట్టేస్తివి
రెండు చుక్కలన్న చెంత
కార్చ లేని కడలినైతి
రెండు చేతులున్న సుప్త
మోయలేని మోడైతి
‘ నేను పాడలేను’
చ2.
అల్లుకున్న పొదలు నరుక
అలుగు దుంకె వాగులన్ని
తల్లివేరు తలలు నరుక
తల్లడిల్లె మొలకలన్ని
మేడలన్ని కూలిపాయె
వాడలు ఎడారులాయె
ఎగరలేక పక్షులన్ని
చెట్టుకొకటి పుట్టకొకటి
‘ నేను పాడలేను’
చ3.
అక్షరాల పూత లేదు
కాలోన్ముఖ కాత లేదు
నిశ్చింత నిశీధులాయె
నిశ్శబ్ద బజారులాయె
ఆకలి కేకల సప్పుడు
అరలో సమాధియాయె
ఆశాపాశాలన్ని
అగ్గిలోన బలియాయె
‘నేను పాడలేను’
చ4.
మాస్కుల మచ్చలు చూస్తు
దూరపు భారాన్ని మోస్తు
సబ్బు సాని గబ్బుల్లో
బానిసగా బతుకీడుతు
భయం భయం గుప్పిట్లో
ఒంటరి ఏకాకిలాగ
ఆయువునర చేతవట్టి
ఊపిరికై ఉక్కవట్టి
‘ నేను పాడలేను ‘