స్టే హోం… స్టే సేఫ్… హ్యాపీనెస్ కు గ్యారంటీ లేదు…

(అహ్మద్ షరీఫ్)

స్టే హోం… స్టే సేఫ్… కరోనా బారిన పడకుండా, ఇంట్లోనే వుండండి, జాగ్రత్త గా వుండండి అంటూ అందరూ చెబుతున్న ఈ రెండు మాటలకు  బీ హ్యాపీ” అనే మూడో మాట చేర్చలేదు.  కావాలనే చేర్చలేదా!

కరోనా చూట్టూరు పాకుతూ వస్తున్నపుడు, ఏ రూపంలోనైనా కరోనా వచ్చే అవకాశం ఉన్నపుడు,  కిటికి సందుల్లోనుంచి కూడా గాలి ద్వారా దూరుతుందేమో నన్న భయం వెన్నులో పుట్టినపుడు, ఇంట్లో ఉండి, సురక్షితంగా ఉండలేకపోతున్నపుడు, మనిషి అలికిడే కీడేమోననే అమానం పీడిస్తున్నపుడు,  ముట్టుకుంటే చాలా కరోన పట్టుకుందేమో ననే భయం చుట్టు ముట్టినపుడు  హ్యాపీగా ఉండటం  సాధ్యమా?…. అందుకేనేమో స్టే హోం, స్టే సేఫ్ …అని గట్టిగా చెబుతున్నా హ్యాపీనెస్ కు గ్యారంటీ ఇవ్వడం లేదు.

కరోనా….దాదాపూ ఒకటిన్నర సంవత్సరంగా ఉదయం కళ్ళు తెరిచి నప్పటినుండి తిరిగి నిద్ర పోయేంతవరకు వినిపిస్తున్న మాట ఇదే. అంతా మాట్లాడుతున్న మాట ఇదే. కనిపిస్తున్నదిదే. కలవరపెడుతున్నదిదే. 

 కోవిడ్ పాండెమిక్ భీభత్సం, చావులూ, నిజాల, అబధ్ధాలు, అర్థ సత్యాలు, సంచలన  వార్తలూ, మెడికల్ ఎమెర్జెన్సీలు, ఆక్షిజన్ కొరత, మందుల కొరత,పడక కొరత, ఆసుపత్రి వరండామీద, ఇంకా పడక చేరుకునే లోపే చేతుల్లో నే ప్రాణాలు విడిచిన ఆత్మీయులు, ఇంటిల్లి ప్రాణాలు కుప్పపోసి అమ్మినా రానంత పెద్ద ఆసుపత్రి బిల్లు… శ్మశానాల్లో అన్నీ అనాథ శవదహనాలే. ఒక్కపారి గా మనిషి అనాథ అయిపోతున్నాడు.  ఆహ్ …మన చుట్టు  ‘భయం’ తుఫాను. 

మనకు తెలీకుండానే  మానసిక నిలకడ పటాపంచలయింది. మనం తీకుంటున్న జాగ్రత్తలు మనల్ని చాలా వరకు కాపాడుతున్నట్లు భ్రమకలిగిస్తాయి. కాని   మనకు తెలీకుండానే ఒక  ప్రమాదకరమయిన పురుగేదో రంధ్రం తొలుచుకుంటూ  మనలోకి ప్రవేశిస్తున్నట్లుంది.  ఎపుడైనా గమనించారా?

అదేమిటి? ఎలా ఉంటుంది. ఏమో నాకు తెలియదు. నాకు తెలిసిన వాళ్లెవరికీ తెలియదు. అందరిలోంచి అది బ్లాక్ ఫంగస్ లాగా పుట్టుకొస్తున్నమా ట మాత్రం నిజం.

 అది కరోనా వైరస్ కొత్త వేరియాంట్  కాదు. మరేదో అంతకంటే ప్రమాదకరమయిన   అదృశ్య కీటకం.  ఇది శరీరానికి హానిచేయదు. జ్వరం రానీయదు, ఆక్సిజన్ లెవెల్ పడిపోనీయదు, వొళ్లునొప్పులే తీసుకురాదు. కాని ఏదో మనిషిని లోపలి నుంచి తొలిచేసి,  అక్కడ ఏమీ  లేకుండా చేస్తున్నది. పైకి మనం మనిషిలా కనిపిస్తాడు. కాని లోన మనిషే లేడు. ఖాళీ. డొల్ల, ఫేక్.

రాత్రి అవుతుంది, తెల్ల వారుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది మళ్లీ తెల్లవారుతుంది…నిరంతర చక్రంలాగా మనకు స్పర్శేమీ కలిగించకుండా కాలం గడచి పోతున్నది. రోజేమిటో, రాత్రేమిటో అర్థంకాదు. నిన్నమొన్నటి వరకు వెలుతురు పూలు పూచిన దినమంటే ఎంతో హాయిగా ఉండేవి. సాయంకాలం చల్లటి స్పర్శ హాయినిచ్చేది. రాత్రి ప్రశాతంగా వూరంతా వీచేది. అవన్నీ ఇపుడు అవన్నీ మాయమయ్యాయి… సర్వగతులు లేని రాగంలాగా.

ఈ ’ఖాళీ‘ జబ్బుతో జీవితమే ముందుకు సాగుతున్నట్లు అనిపించడం లేదు. బంధువులతో, స్నేహితులతో  మాట్లాడుతున్నపుడు మాట్లాడుతన్న ఎక్సీపిరియన్స్ ఉండదు. ఆప్యాయతలూ పంచుకుంటున్నట్లు లేదు. వార్తలు చదువుతూన్నాను, , వార్తలు వింటున్నాను… కానీ ఎక్కడ ఒక్క విశేషం కనిపించడం లేదు. అంతా ఒకలాగే ఉంది. అంతా ఒకే వార్త.  జీవన వైవిద్యం చెరిగిపోయి, అంతా ఒక్కలాగే కనిపిస్తావుంది. మనుషులంతా ఒక్కలాగే కనబడుతున్నారు, ప్రపంచమంతా ఒక్కలాగా కనిపిస్తూ ఉంది. ఊర్లన్నీ ఒక్క లాగే ఖాళీగా కనబడుతున్నాయి. ఎపుడో పొద్దున కొద్దిసేపు మనుషులంతా మార్కెట్లో మనుషులు… ఒక్కలాగే పరుగుతీస్తున్నారు. ఏమయింది? మరొకటేదీ కినిపించకుండ కళ్లలో పొరలొచ్చాయా? లేక ఇదంతా మన చుట్టూ అల్లుకుపోతున్న పొగమంచా?

ఒక మంచి పాట విని ఆనందించలేక పోతున్నాము.  పాటలు వింటున్నట్టే ఉంది.  పాటలోని మాధుర్యం మనసుకు తాకడం లేదు,  సాహిత్య   కదిలించడం లేదు. రాగం చెవి సోకకుండా ఎటో పారిపోతున్నది.పుస్తకం పేజీలు తిరగుతున్నాయ్… చదువుతున్న రుచి కనిపించడమే లేదు.

చుట్టూరు స్నేహితులున్నామనసు విప్పి మాట్లాడలేక పొతున్నాము.భాష భయంకరంగా కుంచించు పోయింది. ఓ టీ టీ లు వచ్చాయ్ అనుకున్నాం, హాయిగా స్నాక్స్ నములుతూ ఆందమయిన వ్యాపార ప్రకటనల్లో లాగా అటు ఇల్లాలు, ఇటుపిల్లలు… చిద్వివాలసంతో నట్టింట్లో సోషామీద కూర్చొని ఇష్టమొచ్చిన సినిమా చూడొచ్చు అనుకున్నాం. ఏది ఎక్కడ?  మనసుకు ఏదీ నచ్చడం లేదు. జీవించడము లేదు, నటించడం లేదు. 

నిరాసక్తి. ఏదీ సంతోషం ఇవ్వలేక పోతున్నది. ఎదీ సంతోషమిస్తుందో తెలియడం లేదు. పోనీ సంతోషం నటిద్దామనుకుంటే… నటించడం కూడా కష్టంగా ఉంది.

అన్నింటిని మించి ఋతువుల ప్రభావం కూడా తెలీటం లేదు. వేసవి వచ్చింది, దాదాపు గా వెళ్ళి పోతొంది. దాని సెగ  అనుభవించలేదు. వానా కాలం వస్తున్నట్లుంది.ఏదీ ప్రీమాన్సైన్ తొలకరి మట్టి వాసన.   

ఉత్సాహం ఉన్నట్లుండి ఆవిరయింది. అటూ ఇటూ ప్రాణంపారాడుతున్నట్లు  జీవితంలో కదలిక ఉండాలి. కొద్దిసేపయిన ప్రకృతితో అనుసంధానం ఉండాలి. బతుకులో ఎగుడు దిగుళ్ళు ఉండాలి. కొద్ది కష్టం, నష్టం, కన్నీళ్లు ఉండాల్సిందే. అవి లేక పోతే జీవితం స్తబ్ధమై పోతుంది? కానీ ఇపుడేంటి… ఎవీ కనిపించడంలేదు.అంతా ఒక ఖాళీ తనం కప్పేసిన నిశబ్దపు గ్రహంలాగా, ఏమిటిది?

  జీవితం ఇలా తడారయిపోతున్న దేమిటి? జీవితం ముందుకు సాగుతున్నట్లే ఉంది… ట్రేడ్ మిల్ మీద పరిగెత్తినట్లు.  

కరోనా మనుషుల జీవితాల్లో ఒక తెలీని  పార్శ్వాన్ని తెరిచింది. మనుషులంతా ఒకలా తయారయ్యారు. అందరి జీవితాలు భరించలేనంతగా  ఏక రూపం (Monotony)లోకి జారుకున్నాయి. మనిషి బాగున్నట్లు కనిపిస్తున్నాడు. కాని మనుసు మంచాన పడింది. ఎపుడు తెలవారుతుంది. ఎపుడు ఆ సూర్య కిరణాలు మళ్లీ మన మీద వాలతాయి. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి…

 

(అహ్మద్ షరీఫ్, కవి, రచయిత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *