ఈ ఫోటోలోని వ్యక్తి ఒక పెద్ద రాజకీయ నాయకుడంటే తెలుగు వాళ్లెవరూ ఒప్పుకోరు. ఎందుకంటే తెలుగు వాళ్ల రాజకీయ సంస్కృతి వేరు. రాజకీయ నాయకుడంటే చుట్టూర చాలా హంగామా ఉంటుంది. ఖరీదయిన ఖాదీ, అందునా నలగని ఖాదీ యూనిఫారం, ఇన్నోవా కారు, పక్కన రెండు మూడు అనుచరుల కార్లు, ఒక అరడజను మంది అనుచరులు ఉండాలి. ఇంతా హడావిడి లేకుండా తెలుగు రాజకీయ నాయకులు రోడ్ల మీదకు రావడానికి సిగ్గుపడ్తారు. నామోషి అనుకుంటారు. సైకిలెక్కడం కెమెరాలకోసం చేసే డ్రామా మాత్రమే.
ఎందుకంటేఆర్టీసీ బస్సుల్లోవాళ్లకి ఇప్పటికీ సీట్లు రిజర్వు చేసినా, బస్సుల్లో ప్రయాణస్తున్న దాఖలా లేదు. ఇక సైకిల్లేమి వాడతారు.
వాళ్ల కార్లు రోడ్డెక్కితెే రోడ్ల మీద ఉండే ఇతర వాళ్లంతా టెర్రరైజ్ అయిపోయి దారి ఇచ్చేంత స్పీడుగా దూకుడుగా వెళ్లిపోతుంటారు. కాబట్టి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి, అందునా పాతసైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి, పాత ఫోనొకటి పట్టుకుని నిలబడుకున్న వ్యక్తి… రాజకీయ నాయకుడంటే తెలుగు నాట ఎవరూ ఒప్పుకోరు.
తెలుగు వాళ్ల కంటికి ఇలాంటి వాళ్లు ఆనరు. ఇలాంటి వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే తెలుగు వాళ్ల కసితీర ఓడగొడతారు. తెలుగువాళ్ల ప్రమాణాల ప్రకారం ఆయనకు రాజకీయనాయకుడు అయ్యేందుకు అర్హతలే లేవు.
కాని, ఏం చేద్దాం, ఆయన కేరళలో పెద్ద రాజకీయనాయకుడు. సిపిఐ పార్టీకి చెందిన వాడు. మొన్న ఎన్నికల్లో చేర్తాలా నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రి అయ్యాడు.
ప్రసాద్ పర్యావరణ ఉద్యమకారుడు. అనేక ఉద్యమాలకు నాయకత్వ వహించాడు.భారతదేశమంతా ప్రభావితమయిన ప్లాచిమాడ కొకొకోలా ఉద్యమానికి నాయకత్వం వహించారు.
2016 ఎన్నికల్లో మొదటి సారి హారిపద్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే, అపుడు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల చేతిలో ఓడిపోయారు. ఈ సారి చేర్తాల నుంచి పోటీ చేసికాంగ్రెస్ అభ్యర్థి ఎస్ శరత్ ను 6148 ఓట్ల తేడా తో ఓడించారు.
తొలుత ఎఐఎస్ఎప్ లో చురుకుగా ఉండే వారు. తర్వాత పర్యావరణ ఉద్యమాల వైపు మళ్లారు. 2011లో బినయ్ విశ్వం అటవీ శాఖ మంత్రి గా ఉన్నపుడు ఆయన దగ్గిర అడిషనల్ ప్రయివేటు సెక్రటరీ గా కూడా పనిచేశారు.