విలక్షణ కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్లు, కొత్త సినిమాలు… అన్ని వర్గాల ప్రజలకు కావలసిన వినోదం అందిస్తున్న ఏకైక ఓటీటీ వేదిక ‘జీ 5’. గత ఏడాది (2020)లో బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘చదరంగం’, ఆరేళ్ళ పిల్లల నుంచి అరవైయేళ్ళ పెద్దల వరకూ అందర్నీ కడుపుబ్బా నవ్వించిన ‘అమృతం ద్వితీయం’, స్పోర్ట్స్ డ్రామా ‘లూజర్’, క్రైమ్ & యాక్షన్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ వంటి ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను అందించి, ప్రజల ఆదరణ, అభిమానం సొంతం చేసుకొన్న ‘జీ 5’ ఈ ఏడాది మరో ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 2016లో జాతీయ పురస్కారం అందుకున్న ‘పెళ్లి చూపులు’, నవతరం యువత ఆలోచనలు, అభిప్రాయాలకు అద్దంపట్టే ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ సమర్పణలో ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘రూమ్ నంబర్ 54 ‘జీ 5’లో ఎక్స్‌క్లూజివ్‌గా మే 21న స్ట్రీమింగ్ కానుంది.
‘రూమ్ నంబర్ 54’ వెబ్ సిరీస్ విషయానికి వస్తే… ఇంజనీరింగ్ చదువుతూ కాలేజీ హాస్టల్లోని రూమ్ నంబర్ 54లో ఉంటున్న నలుగురు కుర్రాళ్ల కథ ఇది. ఆ రూమ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అందులో ఉన్న వారందరికీ నెక్స్ట్ బ్యాచ్‌లతో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. ఆ రూమ్‌లో దిగిన నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకు ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించారు? అనేది మిగతా కథ.
వెంకటరావు పాత్రలో మొయిన్, యువరాజ్ పాత్రలో కృష్ణప్రసాద్, ప్రసన్నగా పవన్ రమేష్, బాబాయ్ పాత్రలో కృష్ణతేజ నటించిన ‘రూమ్ నంబర్ 54’లో శ్వేతా, నవ్య కీలక పాత్రలు పోషించారు. ఇందులో పలువురు ప్రముఖులు అతిథి పాత్రల్లో సందడి చేశారు. త్వరలో వాళ్ళ వివరాలు వెల్లడించనున్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “మీరందరూ ఇంట్లో కూర్చుని కాలేజ్ మిస్ అవుతున్నారని నాకు తెలుసు. నేనూ నా కాలేజ్ మిస్ అవుతున్నాను. ముఖ్యంగా, బ్యాక్ బెంచ్ గ్రూప్ ఉంది కదా! వాళ్ళు అయితే తప్పకుండా మిస్ అవుతారు. కాలేజ్ మెమరీస్ జీవితాంతం గుర్తుంటాయి. ఈ కరోనా సమయంలో, ఎవరికి వారు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్న ఈ వేళలో… మీ కోసం, మీ కాలేజ్ మెమరీస్ గుర్తు చేయడం కోసం చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు ‘రూమ్ నంబర్ 54’ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. నూతన దర్శకుడు సిద్ధార్థ్ గౌతమ్ రచన, దర్శకత్వంలో రూపొందిన దీనిని ఐడ్రీమ్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ప్రతి ఎపిసోడ్ లో మిమ్మల్ని మీరు మీరు చూసుకుంటారు. మీ స్నేహితుల్ని గుర్తు చేసుకుంటారు. ‘జీ 5’లో మే 21న ‘రూమ్ నంబర్ 54 ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి” అని అన్నారు.
ఇటీవల, మే 14న ‘జీ 5’ ఓటీటీలో విడుదలైన ఒరిజినల్ మూవీ ‘బట్టల రామస్వామి బయోపిక్కు’కు విశేష వీక్షకాదరణ లభించింది. లాక్డౌన్లో తెలుగు ప్రజలకు వినోదం అందించింది. ‘జీ 5’ తెలుగు నుంచి 2021లో వచ్చిన తొలి ఒరిజినల్ కంటెంట్ ప్రాజెక్ట్స్ ఇది. ఇప్పుడు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘రూమ్ నంబర్ 54’ విడుదల కానుంది. దీనిపై వీక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.