హద్దులేని ఆదర్శవాదం,అంతులేని త్యాగనిరతి,నిండైన నిరాడంబరత్వం,
కుటుంబానికంటే మిన్నగా ఆత్మీయంగా శ్రామికులతో కలిసిపోయే విశాల హృదయం, పదవులకే వన్నెదెచ్చెే ప్రాపంచిక దృక్ఫథం, వ్యూహకర్త, పోరాట యోధుడు చరిత్రలో ఎవరున్నారని ఆలోచిస్తే గాంధీ, నెహ్రు, అంబేడ్కర్, భగతసింగ్,… అంటూ చాలామంది వేర్వేరు పేర్లు చెప్పే
అవకాశముంది. కానీ విప్లవ పోరాట చరిత్రలో త్యాగాలకు, ఉద్యమ నిర్మాణాలకు చిరునామాగా నిలిచిన భారత కమ్యూని
స్టు యోధుడు కా. పుచ్చలపల్లి సుందరయ్య అంటే పైన తెల్పిన లక్షణాలకు నిలు వెత్తు తార్కాణమని అందరూ అంగీకరిస్తారు.
పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1 వ తేదీన నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన అలగానిపాడు లో ఒక భూస్వామ్య సంపన్న కుటుంబంలో జన్మించాడు చిన్ననాడే తండ్రి చనిపోవడంతో బంధువుల ఇళ్లల్లో చదువుకుని ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు. కమ్యూనిస్టులలో ఆయన కామ్రేడ్ పిఎస్ గా ప్రసిద్ధి.
అయితే తన ఆలోచనలు నిరంతరము దేశ సేవలో గడపాలనే తపన ఎక్కువగా ఉండేది. 14 యేటనే ఆయన చెన్నైలో గాంధీ ప్రసంగించిన కాంగ్రెస్ సభకు హాజరయ్యారు. గాంధీ తో పరిచయమైన 1930లో ఆయన చదువు మానేసి జాతీయోద్యంలోకి దూకారు. గ్రామీణ వ్యవసాయ కార్మికుల కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. తర్వాత ఉప్పు సత్యాగ్రహము , సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని జైలు కెళ్లారు.
అదే సమయంలో స్వాతంత్ర పోరాటంతో పాటు కమ్యూనిస్టు నాయకులతో పరిచయం కావడంతో కమ్యూనిస్టు ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు.నాటి కమ్యూనిస్టు నాయకుడు అమీర్ హైదర్ ఖాన్ ఆయన కమ్యూనిస్టు పార్టీ వైపు మళ్లించారు. అవి బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీనినిషేధించిన రోజులు. ఇఎంఎస్ నంబూద్రి పాద్, ఎకె గోపాలన్, పి కృష్ణ పిళ్లై వంటి వారిని కమ్యూనిస్టు పార్టీలోకి తీసుకువచ్చింది ఆయనే.
1942లో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేశాక ఆయన పార్టీ కేంద్ర కమిటి సభ్యుడయ్యారు.1943లో లీల ని వివాహమాడారు.ప్రజాసేవ అంకితమయిన సుందరయ్య పిల్లలు కలిగితే స్వార్థం పెరుగుతుందేమోననే ఆలోచనతో పెళ్లి కాగానే పిల్లలు కాకుండా శస్త్రచికిత్స చేయించుకున్నారు
1947-1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర కీలమయినది.1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అపుడు ఆయన పార్లమెంటుకు సైకిల్ పైనే ప్రయాణం చేసేశారు..
కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇతర కొన్ని రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. పార్టీ కేంద్ర రాష్ట్ర స్థాయి అనేక పదవులను నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ జీవితం గడపడం లో అందరికీ ఆదర్శమే.
తన వాటా కు వచ్చినటువంటి భూమి ఆస్తిపాస్తులను పేద ప్రజానీకానికి పంచిపెట్టి ఆచరణలో చూపిన చిత్తశుద్ధి గల కమ్యూనిస్టు నాయకుడు. విధానసభ సభ్యుడైన,
1964 అక్టోబర్ లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో విభేదాలు వచ్చిన కారణంగా ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (CPI-M) పక్షాన నాయకత్వం వహించాడు. ఒకరోజు ఎండలో సైకిల్ పై ప్రయాణించి చెమటలు కక్కుతూ వచ్చిన ఒక సాధారణ వ్యక్తి సైకిల్ ను ఒక రాజ భవనం ముందు నిలిపి లోనికి పోతుంటే అందరూ రాచ మర్యాదలతో స్వాగతం పలికారు.
తిరిగి అదే సాదా సీదా వ్యక్తి బయటికి వస్తున్నప్పుడు ఖద్దరు దుస్తుల తో ఉన్న ప్రముఖ నాయకుడు ఇతనికి వీడ్కోలు పలికాడు. వీడ్కోలు ఇచ్చిన వ్యక్తి నాటి ముఖ్యమంత్రి. వీడ్కోలు అందుకున్న సాదా సీదా సైకిల్ పై వచ్చిన వ్యక్తి నాటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఇవి నాడు పార్టీలకు కాకుండా వ్యక్తులకు, పదవులు ఇచ్చిన గౌరవ మర్యాదల తీరుతెన్నులు.
కేంద్ర కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ సాయుధ పోరాటానికి అనుమతించిన నేపథ్యంలో వీరి నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విజయవంతంగా ముగిసింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలోనూ, కమ్యూనిస్టు పార్టీపై ఆంక్షలు విధించిన సందర్భంలోనూ అజ్ఞాతంలో గడిపైన సుందరయ్య. ఆయన కనపరిచిన నైతిక విలువలు, ఆదర్శ జీవితము నేటి తరానికి, ఏనాటికైనా ఆదర్శప్రాయమే.
అత్యాధునిక వసతులతో హైదరాబాదులోని బాగ్ లింగం పల్లి సుందరయ్య భవనంలో గ్రంథాలయము, సమావేశ మందిరములు, పత్రికా కార్యాలయాలు, కమ్యూనిస్టు మహా నాయకుల స్మారక మందిరాలు సగౌరవంగా మనలకు స్వాగతం పలుకుతున్న వి. ముందు గల విశాలమైన పార్కులోగలవారి
భారీ విగ్రహము కార్మికులు,రైతులు,పేద ప్రజా
నీకాన్ని నిరంతరం చైతన్య స్రవంతిలో నిలుపుతుంది. అనారోగ్యంతో ఆయన 1985 మే 19వ తేదీన మద్రాసులోని అపోలో హాస్పిటల్ లో కన్నుమూశారు.
72 సంవత్సరాల జీవనయానంలో 60 సంవత్సరాల పాటు పేద ప్రజానీకం కోసం, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కోసం, కార్మిక కర్షక జీవితాలలో వెలుగు నింపడానికి, కృషిచేసిన అసాధారణ వ్యక్తిత్వం గల సుందరయ్య గారు స్వయంగా కవి రచయిత కూడా. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తో పాటు” విప్లవ పథంలో నా పయనం” అనే పుస్తకాన్ని కూడా రచించారు.
నాయకుడు అంటే ఎలా ఉండాలి? అనే విషయంలో” నాయకుడంటే సీట్లో కూర్చుని ఆదేశాలు ఇచ్చేవారు కాదు. అధికారాన్ని చెలాయించే వారు కాదు, ఆయా వర్గాల తో మమేకమై ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరము జాగరూకత వహించి నిజాల నిగ్గు తేల్చి అవకాశాలను ప్రజలకు చేరువ చేసే వారే”. అని తను రాసిన” విప్లవ పథంలో నా పయనం” అనే పుస్తకములో నిర్వచించారు. కుటుంబానికి దూరమై తాను నమ్మిన ఆశయాల కోసం కార్మిక లోకాలకు చేరువైన సామాజిక విలువలతో కూడిన పోరాటయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య నేటితరం స్ఫూర్తిగా తీసుకొని ప్రశ్నించడం, పేద ప్రజల పక్షాన పోరాటం, సమస్యలపై నిలదీయడం, వామపక్ష సిద్ధాంత అధ్యయనంతో పాటు ఆచరణాత్మకంగా కృషి చేయడం,విస్తృత వేదిక గా ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం నేటితరం యువత ,విద్యార్థులు, మేధావులు,రాజకీయ పక్షాల కనీస బాధ్యత.వారి 36వ వర్ధంతి
సందర్భముగా వారు పోరాడిన జీవిత విలువలకోసం కట్టుబడి ఉండడమే నేడు మనం వారికి అర్పించే ఘనమైన నివాళి.
(వడ్డేపల్లి మల్లేశము,సామాజికవిశ్లేషకుడు, హుస్నాబాద్.505467
(చౌటపల్లి)తెలంగాణ రాష్ట్రం)