కోవిడ్ చెలరేగుతున్నపుడు మార్నింగ్ వాక్ చేయవచ్చా?

కరోనా తీవ్రంగా ప్రబలుతున్నందన , కోవిడ్ సోకకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం కొన్ని సులభతరమయిన జాగ్రత్తలు పాటించమని చెబుతూ ఉంది. ప్రస్తుతానికి  ఉదయం పూట మార్నింగ్ వాక్ వద్దని చెబుతున్నది. మార్నింగ్ వాక్ అంటూ  రోడ్లపైకి రాకుండా మీ ఇంటిపైన ఉండే డాబాల మీద నడవండని  ఆంధ ప్రదేశ్ కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ చెబుతున్నారు.  మీ ఇంట్లోనే డాబా మీదనే తిరగండని చెబుతున్నారు. ఇదే విధంగా కళ్లజోడు ధరించాలని కూడా ఆయన చెబుతున్నారు. మరిన్ని వివరాలు:

ఎపి కోవిడ్ -19 కమాండ్ కంట్రోల్  విడుదల చేసిన ముందు జాగ్రత్త చర్యలు

 

* ఉదయం పూట మార్నింగ్ వాక్ లు అంటూ రోడ్లపైకి రాకుండా మీ ఇంటిపైన ఉండే డాబాల మీద నడవండి. లేదంటే మీ ఇంట్లోనే తిరగండి. వాక్ రెగ్యులర్ గా చేసే వాల్లు అలవాటు మానుకోలేరు. 4కి.మీ వేగంతో  వాక్ చేస్తున్నపుడు డ్రాప్ లెట్స్ 5మీటర్ల దాకా వ్యాపిస్తాయి. కనీసం 20  అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇపుడు మార్నింగ్ లాక్ సడలింపు ఉంటున్నందున పొద్దునే ఎక్కువ మంది రోడ్ల మీదకు వస్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కష్టం. అందవల్ల ఇంట్లోనో, డాబామీదనో వాక్ చేయడం మంచిది.

* టిఫిన్, టీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ల దగ్గర ఎప్పటిలాగానే తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఫ్యాషన్ గా మాస్కులు ముఖానికి తగిలించుకుని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.

* మరికొంతమంది కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పడం లేదు. కరోనా లక్షణాలు ముదిరిపోయి పరిస్థితి తీవ్రంగా మారినపుడు మాత్రమే బయటకు తెలుస్తున్నాయి. అలా చేయడం ద్వారా వారిని, వారి కుటుంబాన్ని, వారితో దగ్గరగా మెలిగిన వారిని కూడా ప్రమాదంలోనికి నెడుతున్నారు.

* బయట తిండి, టీ, చాట్ మసాలాలు, బిర్యానీలు తినకపోవడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట తిండి తినడం వల్ల కరోనాను మనమే స్వయంగా ఆహ్వానిస్తున్నట్టు లెక్క.

* కరోనాకి ఎవరూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో కరోనా బారినపడేవారి సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనవరకు రాలేదని ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అది మన బాధ్యతారాహిత్యాన్ని, విచ్చలవిడితనాన్ని తెలియచేస్తుంది.

* కరోనా అనేది సాధారణ వ్యాధుల్లా పరిగణించి బాధ్యత లేకుండా తిరగమని కాదు. కరోనా సోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు పెట్టుకుని, ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వచ్చి అవసరమైన పనిచూసుకు వెళ్లాలి. ఈ సూచనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం తగదు.

* సాధ్యమైనంత వరకు చిన్న పిల్లల్ని బజారుకి, మార్కెట్లకు పంపకండి. ట్యూషన్ లు, చదువులు అని అత్యుత్సాహం వద్దు. ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం.

* డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి మనకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. వారి శ్రమను గుర్తించి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వారిపై ఎక్కువ ఒత్తడిపడకుండా తగ్గిద్దాం.

* ప్రస్తుతం కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వస్త్రం మాస్కు కన్నా భద్రమైన సర్జికల్ మాస్కు లేదా ఎన్95 మాస్కు వాడితే మేలు.

* కళ్లను పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోడు వాడితే మరింత భద్రం

* ద్విచక్ర వాహనదారులు తలను పూర్తిగా కప్పి ఉంచేలా హెల్మెట్ ధరించి దానికి ముందు అద్దం వేసుకుంటే చాలా వరకు భద్రంగా ఉంటారు. తలపై, జుట్టుపై వైరస్ అంటుకునే ప్రమాదం చాలా వరకు తప్పుతుంది.

* ప్రతి ఒక్కరూ నెలకు సరిపడా నిత్యావరసరాలు ఒక్కసారే తెచ్చుకోండి. ఒకటి అర కావాల్సి వచ్చినా అవి అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.

* పట్టణాల్లో అయితే చాలా షాపుల యజమానులు డోర్ డెలివరీ కోసం వాట్సాప్ నంబర్లు ఇస్తున్నారు. వీలైనంత వరకు ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటే షాపుల దగ్గర రద్దీ తగ్గుతుంది.

* అవకాశం ఉన్నవారు పెద్దపెద్ద షాపులకు వెళ్లకుండా ఆన్ లైన్ ద్వారా సరుకులు బుక్ చేసుకుని తెప్పించుకోవడం మరింత ఉత్తమం.

* రైతు బజార్లలో కూరగాయలు తక్కువ రేటుకు దొరుకుతాయని ఆశపడవద్దు. ప్రస్తుతం రోడ్లపక్కన చాలా చోట్ల కూరగాయల షాపులు ఉంటున్నాయి. రేటు కొంచెం ఎక్కువైనా రద్దీలేని చోట కొనడం మంచిది. తక్కువ రేటు ఉంటాయని రైతు బజార్లకు వెళితే వైరస్ ను మీతోపాటు మీ ఇంటికీ ఆహ్వానించిన వారు అవుతారు.

* ప్రస్తుత పరిస్థితుల్లో బయట టిఫిన్ సెంటర్లలో, రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల చేయడం మంచిది కాదు. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారం.. అది కూడా వేడిగా తినేందుకు ప్రయత్నించండి.

* మానసిక వికాసానికి మంచి పుస్తకాలు చదవడం, ఆహ్లాదాన్నిచ్చే కార్యక్రమాలను టీవీలో చూడడం మంచిది.

* పిల్లలకు కూడా వైరస్ పట్ల అవగాహన కల్పించండి. ఇంట్లోనే ఉంటారు కాబట్టి చెస్, క్యారమ్స్ లాంటి ఆటలు ఆడించడం, జనరల్ నాలెడ్జ్ పై పరీక్షలు పెట్టడం ద్వారా వారికి ఆసక్తి కలుగుతుంది.

* ఇంట్లోనే ఉంటూనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగితే.. కరోనా వైరస్ ను త్వరగా కట్టడి చేయవచ్చు.

కరోనాపై జరిగే పోరాటంలో మనవంతు కర్తవ్యం నిర్వర్తిద్దాం.. బాధ్యతగా ఉందాం.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *