తెలంగాణ మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ భూవివాదంపై సాగుతున్న విచారణ చూస్తే ఎవరికైన అధికారుల తీరు మీద, ప్రభుత్వం తీరు మీద ధర్మసందేహాలు కలుగుతాయి. ప్రాణాంతక కరోనాను లెక్కచేయకుండా తెగించి తాహశీల్దార్లు ఈటెల భూముల ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిటన్లు, రోడ్లు వేసినట్లు రుజువు చేసేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. బంగారు తెలంగాణలో అవినీతి అనేది లేకుండా చేసేందుకు వాళ్లు పడుతున్న ప్రశంసనీయమయిందే. ఇప్పటికే అధికారులు క్షణాల్లో ఓంఫట్ అని వెలికి తీసిన ఒక సర్వేని కోర్టు బుట్టదాఖలా చేసింది. ఇపుడు హైకోర్టు ఉత్తర్వుల పేరుతో రీసర్వే సాగుతూ ఉంది. 95.22 ఎకరాల్లో రెవెన్యూ అధికారులు రీ సర్వే చేయనున్నారని మీడియా రాసింది.
పత్రికలకు సర్వే చేస్తున్న తాహశీల్దార్లు సురేశ్ కుమార్, మాలతి చెప్పిన వివరాలు: ఈటల రాజేందర్ భార్య పేరున ఉన్న జమున హేచరీస్ యాజమాన్యం 2018లో అచ్చంపేటలోని సర్వే నంబరు 55, 124, 126, 127, 128, 129లో ఉన్న 40 ఎకరాల పట్టా భూమికి ఎటువంటి పత్రాలు లేకుండానే ఎన్‌వోసీ తీసుకుందని గుర్తించారు.
2018లో పంచాయతీ కార్యదర్శికి తెలిసీ ’అక్రమాలు‘ జరిగితే2020 దాకా పై అధికారులకు తెలియకుండా పోయిందా? ఇదెలా జరిగింది? అపుడు ఎన్ వొసి ఇచ్చిందెవరు? ఎటువంటి పత్రాలు లేకుండానే ఆయన ఎన్ వొసి ఇచ్చారా? ఆయన పేరు బయటపెట్టరా?
ఈ నెల 27, 29న అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లోని 95.22 ఎకరాల్లో సర్వే చేస్తామని వారు తెలిపారు. అసైన్డ్, సీలింగ్ భూములకు సంబంధించి 75 మంది రైతులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అచ్చంపేటలోని సర్వే నంబరు 77, 78, 79, 80, 115, 130తో పాటు హకీంపేటలో సర్వే నంబరు 97తో కలిపి 95.22 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని వారు తెలిపారు.
2019లో మరోసారి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొచ్చి సర్వే నంబరు 130లో 18.35 ఎకరాలకు బలవంతంగా ఎన్‌వోసీ తీసుకున్నట్లు వెల్లడించారు.
మరి వత్తిడి తీసుకువస్తే, పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదా? మంత్రి వత్తిడి చేసినపుడు పంచాయతీ కార్యదర్శి మౌనంగా ఉండిపోయారా? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా ముట్టిందా? లేకపోతే, పై అధికారులకు పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశారా లేదా, చేసుంటే ఎవరికి చేశారు? ఫిర్యాదు చేస్తే పై అధికారులు చేశారు?
2018, 2019లో ఎన్‌వోసీ కోసం చేసుకున్న ధరఖాస్తును గమనిస్తే సర్వే నంబర్లలో తేడా ఉన్నట్లు తేలిందన్నారు. 130 సర్వే నంబరులో 3 ఎకరాలు పట్టా భూమి అయితే మిగిలిన 15.35 ఎకరాల భూమి అసైన్డ్ భూమి అని వారు పేర్కొన్నారు.
మరోవైపు హకీంపేటలో సర్వే నంబరు 111లోని 7 ఎకరాల్లో జమున హేచరీస్ యాజమాన్యం అనధికారికంగా ఫీడ్ ప్లాంట్ నిర్మిస్తోందని తాహశీల్దార్లు తెలిపారు.
పబ్లీకుగా ప్లాంట్ నిర్మాణం సాగిస్తున్నపుడు అది అధికారులు కంట పడకుండా సాగిందా? లేక అధికారులు చూసీ చూడనట్లు పోయారా? ఈ రెండు అధికారులు చేసిన తప్పులే. మరి వారికి నోటీసుల ఇచ్చారా? ఎవరికిచ్చారు?
అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న ఫీడ్ ప్లాంట్ పనులను ఆపివేయాలని గ్రామ కార్యదర్శి హేచరీస్ యాజమాన్యానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని తాహశీల్దార్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి హేచరీస్ యాజమాన్యానికి రెండు సార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మే 10న పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసులకు హేచరీస్ యాజమాన్యం వివరణ ఇచ్చిందని అన్నారు.
వ్యవహారం ఇలా అనుమానాస్పదంగా ఉంటే, పంచాయతీ కార్యదర్శి జిల్లాకలెక్టర్ కు, ఇతర ఉన్నతాధికారులకు ఈవిషయం నివేదించలేదా? ఎందుకు నివేదించలేదు. ఒక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఉంటే వాళ్లు తీసుకున్న చర్యలేమిటి?
అలాగే అచ్చంపేటలో 81 సర్వే నంబరులో 5.35 ఎకరాల్లో అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించామని తహసీల్దార్లు చెప్పారు.
రోడ్లు వేస్తున్నా అధికారులు అభ్యంతరం చెప్పలేదా? అంటే ఈటెల చేశాడని చెబుతున్న అక్రమాలకు అధికారులు అండ ఉండిందనే అర్థం కాదా?
ఈటెలతో సమస్య లేనంత వరకు అన్ని ‘అక్రమా’లకు అంతా అండగా నిలిచారని, ఆయనకు ముఖ్యమంత్రి కి పూర్తిగా చెడగానే నాటి అక్రమాలు సడెన్ గా లావాలా పెల్లుబికి వెల్లడవుతున్నాయని అనుకోవాలి. ఇలాంటి ‘అక్రమాలు’ ఎన్నింటిని ప్రభుత్వంలో సహిస్తూ పోతున్నారో….
ఈటెల విచారణ జరిగే కొద్ది అక్రమాలేమో గాని చేసే వాళ్లకంతా ఎక్కువగా కనిపించేవి ప్రశ్నలే…