అరెస్టయిన నర్సాపురం ఎంపి, వైసిపి రెబెల్ రఘురామకృష్ణ రాజు ముఖ్యమంత్రి జగన్ తో సాగిస్తున్న రగడలో రాజుల కులం (క్షత్రియ) అండగా నిలబడుతుందా?
ఈవిషయం మీద సర్వత్రా ఆసక్తి కరమయినచర్చ జరుగుతూ ఉంది. రఘు రామరాజు మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం, బాగా ఆర్థికంగా బలవంతుడు కావడంతో తన మీద జరిగిన దాడిని ఆయన క్షత్రియ కులం మీద జరిగిన దాడి గా చిత్రీకరిస్తారని, అది పెద్ద రాజకీయ వివాదమవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఇది నిజమవుతుందా అనేది ఇపుడు ఎదురవుతున్న ప్రశ్న.
రఘురామ కృష్ణ రాజును పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, కోర్టులో తనను పోలీసులు కొట్టారని గాయాలు చూపించారు. వాటి గురించిఫిర్యాదు చేసినా క్షత్రియ కులస్థులు అగ్గిమీద గుగ్గిలం కాలేదు. రోడ్లమీద కు వచ్చి రాస్తా రోకోలు, నిరసన ప్రదర్శనలు చేయలేదు. పెద్ద ఎత్తున ప్రకటనలు, ఖండనలు రాలేదు. ఒక్క టిడిపి రాజు ఎమ్మెల్సీ మాత్రం గట్టిగా ఖండించారు.కుల సంఘాలు, కులయవజన సంఘాలు, కుల పారిశ్రామిక సంఘాలు ఇంకా స్పందించలేదు.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రూలింగ్ కులాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రతిసమస్య కులానికి ముడిపడిపోతుంది. రఘురామకృష్ణ వ్యవహారం కూడా కులం సెంటిమెంట్ ను రగిలిస్తుందేమోనని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
రాజు గారి క్షత్రియ కులం ఉభయగోదావరి జిల్లాలలో బలంగా ఉంటుంది. పైన విశాఖ దాకా కింద కృష్ణ దాకా విస్తరించి ఉంటుంది. బాగా డబ్బున్నకులం. వ్యాపార, రాజకీయ రంగాల్లోబాగా కనిపించే కులం. పెద్ద పారిశ్రామిక వేత్తలున్న కులం. అయితే, ఈ కులం శాంతియుతంగా సహజీనవంచేసే కులం అని మర్చిపోరాదు. కులంలో రాజకీయ వివాదాలు తగాదాలు బాగా తక్కువ. రాజకీయాల్లో దూసుకుపోయి, దందుడుకుగా ఉంటూ,నాయకత్వంలోకి ఎగబాకి ముఖ్యమంత్రి కావాలనే కలలు కనే కులం కాదు. ఆందుకే ఈ కులం నుంచి ఎందరో వచ్చి ఎన్నికల్లో నెగ్గారు, మంత్రులయ్యారు తప్ప ఎవ్వరూ ఇటీవల కాలంలో బాగా ఇన్ ఫ్లుయన్స్ ఉన్న నాయకులుగా ఎదగలేదు. ఏదో ఒక పార్టీలో చేరి పదవులు సంపాదించడం మాత్రం జరుగుతుంది. ఈ కులానికి చెందిన పారిశ్రామిక వేత్తలు ఎపుడూ ముఖ్యమంత్రులతో గొడవలుపెట్టుకున్న దాఖలా లేదు. చాలా క్రమశిక్షణ తో సర్దుకుపోవడం లో ఈ కులాన్ని మించిన కులం మరొకటి లేదు. ఇలాంటపుడు రఘురామకృష్ణ మీద జరిగిన ‘దాడి’ కులచిచ్చు రగిలిస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే గతంలో సత్యం కంప్యూటర్ రామలింగరాజు వ్యవహారం వచ్చినపుడు కులం ఆయన కు పెద్దగా మద్దతు ఇచ్చినట్లులేదు.
“Today they are mostly peaceful businessmen and professionals. Many Rajus are also traditionally expert horticulturists since they live in lush river land areas. They were always ready to chance their luck in battle…(–and cockfights adds one Godavari Raju), now they are prepared to do so in business… and they work very hard and have done well in the industry, “అని నేటి ‘రాజుైల పరిస్థితి మీద పరిశోధన చేసిన వి.రామచంద్రరావు రాశారు.
దీనికి తగ్గట్టుగానే ఈ రోజు భీమవరంలో జరిగిన క్షత్రియ సమాఖ్య నేతల సమావేశం నుంచి నిప్పురవ్వలు ఎగిరినట్లు కనిపించడం లేదు. భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లిగూడెం క్షత్రియ పెద్దలు సమావేశానికి వచ్చారని తెలిసింది. అయితే, రఘురామకృష్ణ రాజుకు క్షత్రియ సేవా సమితి ఎలాంటి మద్దతు ఇస్తూ ప్రకటనేదీ ఇవ్వలేదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం, రఘురామరాజు మధ్య వ్యవహారం ఇందులోకి క్షత్రియ కులాన్నిలాగడం మంచిదికాదేమో ననే భావన వ్యక్తమయినట్లు సమాచారం.
దానికి తోడు రఘరామకృష్ణ రాజు పొలిటికల్ లైన్ కు అంత మద్దతులేదని చెబుతున్నారు. రఘురామ జగన్ తో పెట్టుకున్న జగడానికి సానుభూతి లేదు. రఘురామకృష్ణ రాజు మరీ దూకుడుగా వెళ్లడం కొందరికి ఇష్టం కూడా లేదు. సీఎం వైఎస్ జగన్ రాజులకు నరసాపురం స్థానం కేటాయించడంతో పాటు మూడు ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వడం కులం పట్లగౌరవంచూపడమే ననే వాదన కూడా కొందరు చేస్తున్నారు.
ఎంపి అయ్యి దాదాపు రెండేళ్లు కావాస్తున్నా రఘురామ రాజు కులాన్నిగాని, నియోజకవర్గాన్ని గొప్పగా ఆకట్టుకున్న దాఖలాలేదు. ఆయన సమయమంతా జగన్ తో కొట్లాటడానికే వెచ్చించాడు తప్ప నియోజకవర్గం కోసం పనిచేసిందెపుడని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
వీటన్నింటికి తోడు రఘురామకష్ణ రాజు మీద కావలసినంత నెగటివ్ ప్రచారం జరిగింది. ఆయన బ్యాంకుల దగ్గిర రుణాలు పొంది ఎగ్గొట్టాడనే వార్త తెలుగు ప్రజల మీద చాలా ప్రభావం చూపింది.దీనికి కారణం, రఘురామ బ్యాంకుల వ్యవహారం,నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్లు బ్యాంకులనే మోసగించిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నపుడే వెలుగులోకి వచ్చింది.ఇందులో నిజమెంతో ఎవరికీ తెలియదు కాని, రఘురామ కృష్ణ రాజు మీద వచ్చిన వార్త ఆయన ఇమేజ్ ను కొంత మసకబార్చింది. కేవలం జగన్ ను ఢీకొట్టున్నాడన్న ఆంశం ఆయన అనుకూలంగా ఉంటుందా?
అయితే, ఒకసారి బెయిల్ మీద రఘురామ బయటకు వస్తే, ఆయన కులపెద్దలను కలిసి చర్చిస్తాడని, అసవరమయితే,పర్యటనలను జరిపి మద్దతు కూడగట్టుకుంటారని,దీనికి బెయిల్ రావడమే ఆలస్యమని ఆయనకు సన్నిహితుడయిన ఒక వ్యక్తి ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’కు చెప్పాడు. “ఒక ఎంపిని పోలీసులు కొట్టారు.ఇది అంత చిన్నవిషయం కాదు. ఆయన బయటకు వచ్చాక రాజకీయ వివాదం రాజుకుంటుంది.ఢిల్లీలో కూడా ఆయనకు మద్దతు లభిస్తుంది.’ అని ఆయన చెప్పారు.
ఇది ఇలా ఉంటే, రఘురామను వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జైలుకు తరలించారు.ఆయన కోర్టులో చూపించిన గాయాలను పరిశీలించేందుకు ఒక వైద్య నివేదిక అందించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు.మెడికల్ బోర్డు అధ్యక్షలుగా జి జి హెచ్ సూపర్ డెంట్ ప్రభావతి వ్యవహరిస్తారు. ఈ బోర్డు తన నివేదికనుకోర్టుకు అందించింది.