ప్రముఖ కవి, సీనీగేయ రచయిత అదృష్టదీపక్ (జనవరి 18,1950- మే 16,2021) కొద్ది సేపటి కిందట కోవిడ్ తో చికిత్స పొందుతూ మరణించారు. తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం ‘సోమేశ్వరం’ ఆయన సొంతవూరు. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన అదృష్టదీపక్ రామచంద్రాపురంలో విశ్రాంత జీవితం గడుపుతూ కొవిడ్ బారినపడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వామపక్ష భావజాలంతో నిండిన కుటుంబంనుంచి వచ్చిన అదృష్టదీపక్ విద్యార్థి దశనుంచీ చేసిన కృషి ఫలితంగా వీరి కవితలు, పాటలు, కథలు, వ్యాసాలు, సాహిత్య విమర్శలు ఆంధ్రదేశంలోని ప్రముఖ పత్రికలన్నీ
ప్రచురించాయి. అభ్యుదయ రచియతల సంఘంతో ఆయన పనిచేశారు.
విశాలాంధ్ర, స్వాతి, వికాసం, మొదలగు పత్రికలూ, సంస్థలూ నిర్వహించిన పోటీలలో ఉత్తమ కవిగానూ, ఉత్తమ కథారచయిత గానూ బహుమతులు పొందారు.
ప్రచురిత గ్రంథాలు:
1. కోకిలమ్మ పదాలు (1972) 2. అగ్ని (1974)
3. సమర శంఖం(1977) 4. ప్రాణం (1978)
5. అడవి (2008) 6. దీపకరాగం (2008)
7. ఆశయాల పందిరిలో (2010) 8. శ్రీశ్రీ ఒక తీరని దాహం (2010)
ఇవికాక అనేక ప్రసిద్ధ సంకలనాలలో వీరి రచనలు చోటుచేసుకున్నాయి. బెర్ట్రోల్డ్ బ్రెహ్ట్, పాబ్లో నెరూడాల కొన్ని కవితలను తెలుగులోకి అనువదించారు.
‘ఉదయం’ దినపత్రికలో ఒక సంవత్సరం ప్రతి ఆదివారం ‘పదసంపద’శీర్షిక నిర్వహించారు. విజయవాడనుంచి వెలువడుతున్న ‘చినుకు’
మాసపత్రికలో మూడేళ్ళపాటు ‘దీపకరాగం’ శీర్షిక నిర్వహించారు. ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధం ‘ఫన్ డే’లో ప్రారంభ సంచికనుంచీ ‘పదశోధన’ శీర్షిక నిర్వహించారు.
ఎన్నో నాటక కళాపరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ కేరక్టర్ నటుడు మొదలగు అవార్డులు పొందారు.
గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రముఖ నాటక కళాపరిషత్తులలో న్యాయనిర్ణేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్స్ లో – నాటికలు, లలితసంగీతం, బృందగానాలు మొదలగు అనేక అంశాలకు
న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ఆకాశవాణి, దూరదర్శన్ లు అదృష్టదీపక్ కథలూ, కవితలూ, కార్యక్రమాలూ ఎన్నోసార్లు ప్రసారం చేశాయి. కొన్ని కవితలను ప్రముఖ కవి నిర్మలానంద వాత్సాయన్ హిందీలోకి అనువదించారు.
1980లో మాదాల రంగారావుద్వారా ‘యువతరం కదిలింది’చిత్రంలో
‘ఆశయాల పందిరిలో’ గీత రచనతో సినిమా రంగ ప్రవేశం చేశారు.
ఇంకా విప్లవశంఖం, నవోదయం, నేటిభారతం, దేశంలో దొంగలుపడ్డారు, ప్రజాస్వామ్యం,నవభారతం, భారతనారి, ఎర్రమందారం, అన్న, మా ఆయన బంగారం, దేవాలయం,వందేమాతరం. అర్ధరాత్రి స్వతంత్రం,
కంచుకాగడా, జైత్రయాత్ర, స్వరాజ్యం, బదిలీ, సగటుమనిషి, నవయుగం,
మొదలగు అనేక విజయవంతమైన చిత్రాలలో గీతరచన చేశారు.
అదృష్టదీపక్ కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులూ, రివార్డులూ
లభించాయి.
“సంభాషణాచాతుర్యంఅతనిది!సాహిత్యంలో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లోనూ అతను ప్రవేశించాడుకేవలం ప్రవేశించడమే కాదు. ఆయన కవిత రాసినా, ఉద్యమ గీతం రాసినా,సినిమా పాట రాసినా, విమర్శనా వ్యాసం రాసినాతనదైన ముద్ర బలంగా కొట్టాడుకవిగా, కధకుడిగా, విమర్శకుడిగా,వక్తగా, అధ్యాపకుడిగా, నాటక న్యాయనిర్ణేతగాఅతను ‘షణ్ముఖుడు’,”అని 2010లో షష్టి పూర్తి సందర్భంగా ఆయనను ప్రముఖ రచయిత తణికెళ్ల భరణి ప్రశసించారు.
(సోర్స్: అదృష్టదీపక్ బ్లాగ్ )