అధికారంలో ఉన్నోళ్లు, ఆధికారం పోయినోళ్లు ఒక్క సారిగా ఐసోలేషన్ లోకి వెళ్లి పోయారు.
ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష నేతలు, వగరుస్తూ ఎండనకా, వాననకా, గాలనక,చలి అనకా ఎన్నికల ముందు పాదయాత్రలు, రోడ్ షోలు చేసినోళ్లంతా హోం క్యారంటైన్ లోకి మాయమయ్యారు.
ఎన్నికల ప్రచారంలో ఓట్లకోసం, క్యాంటీన్లలోకి దూరి టీ చేసినోళ్లు, దోబీ బండి దగ్గిర నిలబడుకుని ఇస్త్రీ పెట్టెతో ఫోటోలు తీయించుకున్నోళ్లు, సెలూన్లో గడ్డం గీసినోళ్లు, రోడ్డు మీద బజ్జీలు వేసినోళ్లు, మార్కెట్లో కూరగాయలమ్మినోళ్లు, చీమిడి ముక్కుల చిన్నారులను ముద్దాడినోళ్లు, ముసలమ్మలను హత్తుకున్నోళ్లు…. అంతా ఐసోలేషన్లోకి జారకున్నారు.
జాతినేతల జయంతులకు, వర్ధంతులకు, అయినా దానికి కాని దానికి ఆసుపత్రుల్లోకి, అనాథ శరణాలయాల్లోకి,వృద్ధాశ్రమాల్లోకి తోసుకుంటూ దూరి దూరి నాలుగు యాపిల్ పళ్లు పంచి, బ్రెడ్డు ముక్కలందించి పోటోలు తీసుకుని తరించి నాయకులంతా ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
పార్టీ బాసుల బర్త్ డేలకు రక్తదానం చేసినోళ్లు, పాలాభిషేకాలు కురిపించినోళ్లు ఐసోలేషన్లోకి జారుకున్నారు.
ఓట్లకు, చప్పట్లకు తప్ప వాళెవరూ గత ఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా హోం క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన దాఖల్లేవు.
ఇషోలేషన్ నుంచే నేతల బర్త్ డేలకు బుకే లందించారు, కేకులు కట్ చేశారు, విందులు చేసుకున్నారు. చిందులేశారు… విలవిల్లాడుతున్న ప్రపంచాన్ని చూసేందుకు వాళ్లెవరూ ఐసోలేషన్ దాటి వచ్చినట్లు లేదు.
కొద్ది సేపు బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నదో చూసేందుకో, మొన్నామధ్య ఓట్ల కోసం తాము హత్తుకున్నముసలోళ్లెమయ్యారో చూసేందుకో, తాము టీ తయారు చేసిన బండి ఉందా మాయమయిందా తెలుసుకునేందుకో, తాము ముద్దాడిన పసిపిల్లల తల్లిదండ్రులు, అవ్వతాతలు ఏమయ్యారో, ఏంతింటున్నారో, ఎలా బతుకున్నారో, ఏ కోవిడ్ సెంటర్ మూలనో,ఆసుపత్రి వరండాలో పడి మూలుగుతున్నారో చూసేందుకో ,ఓటేసిన జనమే ఆసుపత్రిలో బెడ్ లేక, బెడ్ ఉంటే ఆక్సిజన్ లేక, ఆక్సిజన్ ఉండే రెమ్డిసివిర్ లేక… ఎలా విలవిల్లలాడుతున్నారో చూసేకుందకో బయటకు వచ్చిన దాఖలా లేదు.
శవాలతో బెడ్ పంచుకుంటున్న ప్రజల నరకయాతన చూసేందుకు బయటకు రావడం కాదు, బంగళాలలో నుంచి కనీసం కిటీకీలైనా తెరచి ప్రపంచంలో ఏంజరుగుతున్నదో చూస్తున్నట్లు లేరు.
అందుకే బెడ్ల మీద, ఆక్సిజన్ మీద, రెమ్డిసివిర్ ఇంజక్షన్ ల మీద,ప్రయివేటు ఆసుపత్రుల బిల్లుల మీద వాళ్లు చేస్తున్న ప్రకనటలకు, వాస్తవంగా జరుగుతున్నదానికి పోలికే లేదు. ప్రజల కష్టాలకు, రివ్యూ మీటింగ్ పొంతనే లేదు. ప్రజలు కోరుతున్నది రివ్యూ మీటింగ్ లనుంచి రావడం లేదు. రివ్యూ మీటింగ్ లో చూపిస్తున్నది ప్రజలకు కనిపించడం లేదు.
వాళ్ల ప్రకటనల్లో రాష్ట్రాలు, ఫుల్ ఆక్సిజన్ లో హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆసుపత్రి పడకలతో, దండిగా మందులతో పసందైన ఆహారంతో వర్ధిల్లుతున్నాయి.
కానీ కనిపిస్తున్నవన్నీ హృదయవిదారక దృశ్యాలే. వినిపిస్తున్నవన్నీ ఆర్తనాదాలే.
ఆసుపత్రి వరండాల్లో ఆత్మీయులంతా చూస్తుండానే రాలిపోతున్నారు, ఆసుప్రతి దారిలో చనిపోతున్నారు, ఆస్పత్రుల చుట్టూ తిరగలేక చనిపోతున్నారు. విపరీతంగా పెరిగిపోయిన పనిభారాన్ని చేధించుకుని డాక్టర్లు వచ్చే లోపు చనిపోతున్నారు. ఎక్కడ ఆక్సిజన్ ఉందో తెలుసేనేలోపు చనిపోతున్నారు. అంబులెన్స్ దొరక్క చనిపోతున్నారు. ఆటోల్లో చనిపోతున్నారు. చేతుల్లోనే చనిపోతున్నారు. ఎన్నికుటుంబాలో నాశనమయవుతున్నాయో. ఎందరో అనాథలువుతన్నారో.
ఎక్కడ చూసినా భయం, ప్రాణభయం, ఆసుపత్రి భయం, ఆక్సిజన్ భయం, రెమ్డిసివిర్ భయం. ఆంబులెన్స్ భయం, ప్రభుత్వ ఆసుపత్రి భయం, ప్రయివేటు ఆసుపత్రి భయం.
ఈ భయంతో తల్లడిల్లి పోతున్న వాళ్లని, ఇంటింటికి వచ్చి, వార్డు వార్డు తిరిగి, పేరుపేరునా పిల్చి పల్కరించాల్సిన పనిలేదు. ఆలింగనం చేసుకోవలసిన పనిలేదు. తల నిమరనసరంలేదు. నాలుకతో వాళ్ల బతుకుల్లోంచి వైరస్ నలుసును లాగేయాల్సిన పనిలేదు.
వాళ్లకి గుండె ధైర్యం కల్గించేందుకు ఒక్కసారలా ఒక ఆస్పిటల్ వార్డుకో, కోవిడ్ కేర్ సెంటర్ కో వచ్చి చూడొచ్చు. వరండాల్లో బెడ్ కోసం దీనంగా ఎదురుచూస్తున్న వాళ్లకు మాట సాయమయినా చేయవచ్చు. భుజం మీద చెయ్యేసే భరోసా ఇవ్వాల్సిన పనిలేదు. దూరాన్నుంచే ఒక సారలా చేయూపితే చాలు, అది పదివేలనునే అమయాకత్వం వాళ్లది.
ఒకసారలా కాలుకదిపి ఐసోలేషన్ నుంచి బయటకు వస్తే మీకూ ప్రపంచం కనిపిస్తుంది. ఆక్సిజన్ బెడ్లు ఎలా ఉన్నాయో చూడవచ్చు. కోవిడ్ రోగులకు నీళ్లందుతున్నాయా, ఆహారమెంలా ఉందో అడగవచ్చ. ఇదే మంచి సమయం. ట్విటర్ ని వదలకండి, ఫేస్ బుక్ నుఖాళీ చేయవద్దు. కాకపోతే, కొద్దిసేపు ప్రపంచంలోకి రావాలి, కోవిడ్ ప్రొటోకోల్ ప్రకారమే రావచ్చు, పోవచ్చు.
అవసరమే లేనపుడు పండ్లు బ్రెడ్లు పంచిన ఆపన్న హస్తాలతోనే ఇపుడు డాక్టర్ల సాయంతో కోవిట్ కిట్లు పంచండి, కోవిడ్ డిస్టెన్స్ పాటించి రెమ్డి సివివర్, టోసిలి జుమాబ్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ అందించండి,బెడ్లు ఎక్కడున్నాయో చెప్పండి.
లాక్ డౌన్ ఎలా అమలువుతున్నదో మంత్రులు, ఎమ్మెల్యేలు చూడాల్సిన పనిలేదు. దానికి పోలీసులున్నారు. మీ చూపు ఆసపత్రుల వైపు, రోగుల వైపు మళ్లించండి.
వోటేసినళ్లంతా రాలిపోతున్నారు. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చి కుటుంబాలను, రోగులను పరామర్శించి, మానవత్వం చాటుకునేందుకు ఇదే మంచి సమయం. మీరొస్తానంటే ఏ డాక్టర్ అడ్డుకోడు. కోవిడ్ ప్రొటోకోల్ పాటిస్తూనే ముఖ్యమంత్రులు, మంత్రులు, వార్డుల కొస్తే కాదంటారా? ప్రాణభయాన్ని కొద్ది సేపు మానుకోండి. మంది మార్బలంతో కాకుండా,మనిషిగా రావాలి. మృత్యువు పారాడుతున్న వార్డుల్లో రాజకీయాలు మాత్రం చేయకండి.
ఇపుడు ఎదురుతున్న ప్రళయంలో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి నుంచి వచ్చే ఒక మంచి మాట కూడా మందులాగా పనిచేస్తుంది ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుంది. బెడ్లు పెంచుతున్నామని, ఆక్సిజన్ రాబోతున్నదని హామీ ఇవ్వవచ్చు. నేనున్నాను, నేను చూస్తున్నాననిచెప్పండి.
వార్డు బాయ్ లకు, నర్సులకు, డాక్టర్లకు, పేద పేషంట్ల అటెండెంట్లకు లేని భయం మీకేందుకు?
మీకు పిపిసి కిట్లున్నాయి. మీమీద కరోనా వాలకుండా చూసే కట్టుదిట్టమయిన ఏర్పాట్లున్నాయి. వైరస్ వాలినా క్షణాల్లో మీకు సేవ చేసేందుకు వ్యవస్థ మొత్తం మీ ముందు మోకరిల్లుతుంది. మీరు కోవిడ్ సెంటర్ చికిత్సకో, గాంధీ ఆసుపత్రికో వెళ్లాల్సిన పనుండుదు. మీకు సేవ చేయడమే మహాభాగ్యమని కార్పొరేట్ ఆసుపత్రులు క్యూలో నిలబడతాయి. రాజకీయ నాయకులంతా ఐసోలేషన్ బబుల్ వదిలి బయటకు రావాలి. ఇప్పటికే చాలా కాలంగా ఐసోలేషన్ లో ఉన్నారు. కట్టుదిట్టంగా N95 మాస్కులు రెండేసుకుని కాకుండే మూడేసుకుని, టేబుల్ మీద శానిటైజర్లు చుట్టూ పెట్టుకుని, మైళ్లూదూరం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ట్విట్టర్లకు, ఫేస్ బుక్ లకు పరిమితమై పోయారు.
కొద్ది సేపు కోవిడ్ ఆసుపత్రులను చూడండి, రోగులకేం కావాలో తెలుసుకోండి.
మరీ ఎక్కువ కాలం ఐసోలేషన్ లో ఉన్నానష్టమే, తీవ్ర పరిణామాలుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు